తిక్కవరపు ఫ్యామిలీ మూడు నాలుగేళ్ల కిందట వరకూ ఒక వెలుగు వెలిగింది. వీరి వ్యాపారాలు.. వాటిల్లో నష్టాలు లాభాల సంగతి ఎలా ఉన్నా.. ఐపీఎల్ టీమ్ డెక్కన్ చార్జర్స్ ఓనర్లుగా వీరికి మంచి క్రేజ్ కనిపించింది. ఐపీఎల్ తొలి సీజన్ నుంచి దాదాపు నాలుగు సీజన్ల వరకూ డెక్కన్ చార్జర్స్ ఆడినట్టుగా ఉంది. ఆ తర్వాత వివిధ కారణాలతో ఆ టీమ్ హోదా రద్దు అయ్యింది.
అయితే చార్జర్స్ ఆడిన రోజుల్లో మాత్రం తిక్కవరపు వెంకటరామిరెడ్డి అండ్ ఫ్యామిలీకి వీఐపీ హోదా దక్కింది. ఈ హైదరాబాద్ బేస్డ్ జట్టు ఓనర్లుగా వీరు ఒక వెలుగు వెలిగారు. సాధారణంగా మీడియాకు కనపడని వెంకటరామిరెడ్డి ఐపీఎల్ సందర్భంలో మాత్రం కనిపించేవాడు. తమ టీమ్ బాగా ఆడుతున్నప్పుడు ఉత్సాహంగా కనిపించే వాడు.
ఇక ఈయన కూతురు గాయత్రి రెడ్డికి అయితే బీభత్సమైన ఫాలోయింగ్. ఆమెకు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో అభిమాన సంఘాలే ఏర్పడ్డాయి! ఆటగాళ్లతో కలిసి ఉత్సాహంగా కనిపించే ఆమెను ఆరాధించే వాళ్లు కూడా ఎంతో మంది కనిపించారు.
అయితే అదంతా గతం. చార్జర్స్ టీమ్ రద్దు కావడం.. ఆ తర్వాత తిక్కవరపు ఫ్యామిలీ ఆర్థిక ఇబ్బందుల్లో పడటం.. వెంకటరామిరెడ్డి జైలు పాలవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ కుటుంబం జైలు చుట్టూ తిరుగుతోంది. ప్రత్యేక ములాఖత్ లలో వెంకటరామిరెడ్డిని పరామర్శిస్తున్నారు కుటుంబ సభ్యులు!
మరి ఐపీఎల్ లో ఒక వెలుగు వెలిగిన కుటుంబం ఇప్పుడు జైలు చుట్టూ తిరగడం ఓడలు బళ్లు అవుతాయనే సూక్తికి నిరూపణేనేమో!