''జెపి అభిమానుల కోపం…'' లోనే రాసినది – జెపి మేధావి అనీ, పరిపాలనా సమర్థుడనీ, నిష్కళంకుడనీ అందరం నమ్ముతాం. అందులో తభావతు లేదు. అయితే నాబోటి వాళ్లం ఆయన మొహమాటాలకు లొంగుతారని మార్గదర్శి వ్యవహారంతో తెలిసి నిర్ఘాంతపోయాం. అవసరం లేకపోయినా మార్గదర్శి వ్యవహారంలో ఆయన వాళ్లని వెనకేసుకుని వచ్చి ఉండవల్లిని విమర్శించారు. ఇర్రెగ్యులారిటీస్ ఏవైనా జరిగితే చూడడానికి ఆర్‌బిఐ వుండగా ఉండవల్లి వేలెత్తి చూపవలసిన అవసరం ఏముంది? అన్నారు. వెంటనే శ్రీరమణ ఆంధ్రజ్యోతిలో తన కాలమ్‌లో జెపిని తూర్పారబట్టారు. 'కల్తీ నిరోధ విభాగం వారు, తూనికల వారు వుండగా మీరు పెట్రోలుబంక్‌లపై దాడి చేసి నిఘా ఎందుకు వేశారు స్వామీ?' అని. వెంటనే జెపి 'నాకు ఈ ఆర్థికవ్యవహారాలు నాకు పెద్దగా తెలియవు' అని తప్పుకున్నారు. ఆస్ట్రేలియాలో ప్రజాస్వామ్యం, ఆఫ్రికా ఆటవికస్వామ్యం గురించి తెలుసుకుని మనకు లెక్చర్లిచ్చే జెపిగారు తలచుకుంటే రెండు రోజులు అధ్యయనం చేస్తే మార్గదర్శి రూల్సు అతిక్రమించిందో లేదో తేల్చలేకపోయారా? మార్గదర్శి అంటే పూనకం వచ్చే ఉండవల్లి 'నాతో చర్చకు రండి. చెప్తా' అని ఛాలెంజ్ చేస్తే చర్చావేదికల ఛాంపియన్ జెపి వెనక్కి జంకారు. మళ్లీ ఆ జోలికి పోలేదు. మార్గదర్శిది తప్పో, ప్రభుత్వానిదో తప్పో తేల్చలేదు. ఎందుకిదంతా? ఈనాడు, ఈటీవీలతో మొహమాటాల వలనా? తన ఉద్యమానికి ఎంతో ప్రచారం కల్పించిన సంస్థలను ఆపదలో ఆదుకోవాలన్న కృతజ్ఞతాభావంతోనా? మరి యిలాటి మొహమాటాలకు లొంగితే యితర రాజకీయ నాయకుల కంటె భిన్నమైన వాతావరణాన్ని జెపి ఎలా కల్పించగలరు?
ఇవీ నా మనసులో సందేహాలు. అబద్ధాలైతే ఖండించండి. అవగాహనలో పొరబాటుంటే సవరించండి. అంశాలవారీగా చర్చించండి కానీ నిందలు వేయకండి. మిగతా పార్టీలు గొప్పవా, నువ్వు జెపి అంతటివాడివా, ఆయన్ని విమర్శించేటంతటి వాడివా అని కుతర్కాలు చేయకండి. నేను ఆయనంతటివాణ్ని కాను. కానీ విమర్శలు చేయడానికేముంది? ఎవరైనా చేయవచ్చు! జెపి చేస్తున్నారు, నేనూ చేస్తున్నాను, నా పై మీరు చేయవచ్చు. ఎవరంతటివారు వాళ్లమే. అందుకని ఆ పాయింటు వదిలేసి వేరే ఏదైనా వుంటే చెప్పండి.
ఏప్రిల్ నెలలో ''గెలుపెవరిది?'' లో లోక్‌సత్తా విజయావకాశాల గురించి రాసినది యిది – జెపి గారి గురించి నా అభిప్రాయాలు యిదివరకే రాశా. విజ్ఞాన్ రత్తయ్యగారిని పార్టీలో చేర్చుకుంటూనే టిక్కెట్టు చేతిలో పెట్టడంతో జెపిగారిపై నా అభిప్రాయం మరింత తగ్గింది. రత్తయ్యగారు లోక్‌సత్తా గురించి వినని మనిషి కాదు, లోక్‌సత్తాకు ఆయన సహాయ సహకారాలు అందించినట్టుగా ఏమీ చెప్పుకోలేదు. ఎన్నికల సమయంలోనే పార్టీకి రావడమేమిటి? ఈయన ఒప్పుకోవడమేమిటి? ఆయనే కాదు, ఆఖరి నిమిషంలో ఎంతోమందికి పార్టీ టిక్కెట్టు యివ్వడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదని అని ఒప్పుకుంటూనే జెపిగారూ తక్కిన పార్టీల్లాగానే చేశారు. ఇక తేడా ఏముంది? ఆఖరి నిమిషంలో పార్టీలోకి వచ్చినవారి గుణగణాలేమిటో జెపిగారికే తెలియవు. మనని ఏం కన్విన్స్ చేస్తారు? జెపిగారికే తెలియవు. మనని ఏం కన్విన్స్ చేస్తారు? హంగ్ ఎసెంబ్లీ ఏర్పడిన పక్షంలో యీ మహానుభావులు అమ్ముడు పోయినా అమ్ముడు పోవచ్చేమో. ఉద్యమంలో కనీసం ఐదారేళ్లు చేసినవారికి తప్ప టిక్కెట్టు యివ్వకుండా వుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇలాటి సలహాలు ఎన్నయినా చెప్పవచ్చు. కానీ ప్రాక్టికల్‌గా రాజకీయాల్లోకి దిగిన తర్వాత యీ సిద్ధాంతాలేమీ నడవవు. జెపి గారు కానీయండి, మరొకరు కానీయండి, రాజకీయాల క్రీడాప్రాంగణంలోకి దిగాక అక్కడి ఆట పద్ధతులలోనే ఆడాలి. అందుకనే ఆయనా ఐదేళ్లలో ఐదులక్షల వుద్యోగాలన్నాడు. స్విస్ బ్యాంకుల నుండి డబ్బు తెప్పిస్తానంటున్నాడు.
ఇక వాళ్ల గెలుపు అవకాశాలు ఎలా వుంటాయంటారు? జెపి యీసారి ముఖ్యమంత్రి అవరని అందరికీ తెలుసు. కానీ ప్రస్తుత విధానాలతో విసిగిపోయి, ఇప్పుడున్న వారికి బుద్ధి చెప్పాలన్న వుద్దేశంతో కొందరు లోక్‌సత్తాకు ఓటేయవచ్చు. కాండిడేట్ ఎవరో తెలియకపోయినా, జెపి గారి మొహం చూసి ఓట్లేయవచ్చు. ఈసారి మొదటి విడితలో ఓటింగ్ 70% దాకా జరిగింది. అంటే మధ్యతరగతివాళ్లు గడప దాటి వచ్చి ఓట్లేశారన్నమాట. ఇది లోక్‌సత్తాకు ఉపయోగపడుతుందని అనుకోవచ్చా? (వింతగా కూకట్‌పల్లిలో 52% ఓటింగే! ఓటుహక్కు వినియోగించుకోండొహో అని చాటి చెప్పిన జెపిగారి నియోజకవర్గ ప్రజలే యిలా తేలారు) ఇక్కడో విషయం చెప్తాను. లోకసత్తాకు మొత్తం మీద 2-3% ఓట్ల కంటె, 2,3 సీట్ల కంటె ఎక్కువ రాకపోవచ్చని నా అంచనా.
మే లో ''ఫలితాలు వచ్చాక..''లో రాసినది – రాష్ట్రం మొత్తం మీద లోక్‌సత్తా 1.6% ఓట్లు తెచ్చుకుంది. సిటీలో 8.6% ఓట్లు వచ్చాయి. సిటీలో మొత్తం 22 స్థానాలు వుంటే కూకట్‌పల్లిలో జెపి 71 వేలు తెచ్చుకుని గెలవగా, సిటీలో 3 చోట్ల 20 వేలు మించి వచ్చాయి. 5 చోట్ల 10-20 వేలు వచ్చాయి. 25 చోట్ల లోకసత్తాకు వచ్చిన ఓట్లు మహాకూటమికి వచ్చి వుంటే కూటమి గెలిచివుండేది. కానీ లోకసత్తాకు వేసినవాళ్లందరూ మహాకూటమి అభిమానులని ఎలా నిర్ధారించగలం?
ఇవన్నీ ఏడేళ్ల క్రితంనాటి కబుర్లు. పోనుపోను లోకసత్తా నీరసించింది కానీ ఎదగలేదు. దానికి కారణం – చంద్రబాబు లోకసత్తాపై పూర్తిగా కక్ష కట్టేయడమే! కృష్ణా, గుంటూరు జిల్లాలలో తమకు రావలసిన ఓట్లను లోకసత్తా చీల్చిందని, అదో నాన్-సీరియస్ పార్టీ అని ఆయన ఆగ్రహం వెళ్లగక్కారు. కాంగ్రెసు ఓట్లు చీలుస్తుందని ఆశించిన పీఆర్పీ తమ ఓట్లు దోచిందని చెప్పుకున్నారు. (నా అంచనాలో పీఆర్పీ రెండు పార్టీల ఓట్లూ చీల్చింది) బాబుకు మద్దతుగా నిలిచే మీడియా జెపిని నిర్లక్ష్యం చేయసాగింది. ప్రజాందోళనల కంటె మీడియా ద్వారానే ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చిన జెపి అసంతృప్తి ఫీలయ్యారు. ప్రజాప్రతినిథిగా ఆయన కార్యశైలిపై కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజలు అసంతృప్తి చెందారు. కౌన్సిలరు చేయవలసిన పనులేమిటో, ఎంపీ చేయవలసిన పనులేమిటో ఓటర్లకు అవగాహన వుండదు. కుళాయిలో నీళ్లు రాకపోయినా యీయన దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేయబోవడం, యీయన 'మీ సమస్యలు మీకు మీరే ఎలా పరిష్కరించాలో చెప్తాను పట్టండి' అంటూ పాఠాలు చెప్పబోవడం, వాళ్లు విసుక్కోవడం జరిగాయి. గతంలో మాలతీ చందూర్ ''జవాబులు'' శీర్షిక వుండేది – 'మా ఆయన నన్ను పట్టించుకోవటం లేదు, అత్తమావలు పొమ్మంటున్నారు, ఏం చేయమంటారు?' అని ఓ గృహిణి రాస్తే యీవిడ '1932లో అల్బేనియాపై యుగోస్లావియా దండెత్తినపుడు అనేకమంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. అయినా ఆత్మస్థయిర్యంతో ముందుకు వెళ్లారు.' వంటి జవాబిచ్చేవారు. జెపిదీ అదే ధోరణి. స్థానిక సమస్యలకు అంతర్జాతీయ పరిష్కారాలు చెప్తారు. ఇప్పటి సంఘటనలను గత విషయాలతో పోలుస్తూ నేను '1978లో యిలాగే..' అని రాస్తేనే కొందరు పాఠకులు విసుక్కుంటారు. సమస్యలతో వచ్చినవాళ్లకు ఆస్ట్రేలియాలో, ఆమ్‌స్టర్‌డామ్‌లో విషయాల గురించి చెప్తే ఎవరు సహిస్తారు?
2009 ఎసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హైదరాబాదు మునిసిపల్ ఎన్నికలలో కూకట్‌పల్లిలో కూడా లోకసత్తా అభ్యర్థి గెలవలేదు. అక్కడ వున్న టిడిపి సమర్థకులు 2009 ఎన్నికలలో టిడిపి తెరాసతో పొత్తు పెట్టుకోవడం సహించలేక లోకసత్తాకు వేశారు తప్ప జెపిపై అభిమానంతో కాదని వ్యాఖ్యలు వచ్చాయి. 2014 ఎన్నికలు వచ్చేసరికి జెపి మల్కాజ్‌గిరి పార్లమెంటు ఎన్నికలలో నిలబడి తను గెలిస్తే మోదీని సమర్థిస్తానని ప్రకటించుకున్నారు. ప్రజాస్వామ్యం, మానవహక్కులు, వగైరా విలువల కోసం తపించే జెపి మోదీలో అలాటివి ఏం చూశారో ఎవరికీ అర్థం కాలేదు. పైగా బిజెపితో పొత్తు పెట్టుకున్న టిడిపి తరఫున అభ్యర్థి కూడా మోదీనే సమర్థిస్తున్నానని ఓ పక్క చెపుతూంటే మధ్యలో యీయన కూడా ఎందుకు? అనుకున్నారు ఓటర్లు. 9.77% ఓట్లు వేసి నాలుగోస్థానంలో నిలబెట్టారు.
లోకసత్తాకు జాతీయ స్థాయి కల్పించాలనుకున్నారో ఏమో జెపి తెలుగువారికి తెలియని వ్యక్తిని తీసుకుని వచ్చి వీరీవీరీ గుమ్మడిపండు వీరే మీ అధ్యక్షుడు అన్నారు. దాంతో పార్టీ చీలింది. మొన్న హైదరాబాదు కార్పోరేషన్ ఎన్నికలలో ఏ ప్రభావమూ చూపించలేకపోయింది. విదేశాల్లో దాన్ని అభిమానులు కూడా బాగా దూరమై పోయి వుంటారనుకుంటా. 2009 సమయంలో నన్ను తిట్టిన లోకసత్తా అభిమానులు కొందరు తర్వాతి రోజుల్లో దాని పోకడ చూసి 'మిమ్మల్ని అనవసరంగా తిట్టాం, యిప్పుడు మేం డబ్బు పంపడం మానేశాం' అని నాకు మెయిల్స్ రాశారు. డబ్బు లేకుండా యీ రోజుల్లో పార్టీ నడపడం మాటలా? చిరంజీవి అంతటి వాడే పార్టీ అటకెక్కించారు. అందుకే పార్టీ మూతపడింది. తెలుగువారికి సంబంధించి యిది ఒక విషాదం. ఈ విఫలప్రయోగం వలన మంచి ఉద్దేశాలతో పార్టీ పెడితే నడవదు అనే సందేశం ప్రజల్లోకి బలంగా వెళుతుంది. జెపి వైఫల్యాలను ఆ ఆదర్శానికి ఆపాదించి, యిలాటి ప్రయోగం మరెవరూ చేయరు.
నిజానికి ఎంతో నిజాయితీపరుడు, సమర్థుడు, మేధావి అయిన జెపి ఎందుకు ఫెయిలయ్యారు అంటే నాకు తోచిన పదం – 'మిస్‌కాస్టింగ్'. కొందరు మంత్రులుగా రాణిస్తారు, కొందరు రాజులుగా రాణిస్తారు, మరి కొందరు సేనానులుగా రాణిస్తారు. దాన్నే స్వధర్మం అన్నారు పెద్దలు. స్వధర్మాన్ని వదలి పరధర్మంలోకి వెళ్లడం ఆత్మహత్యాసదృశం. నిజానికి ఎన్టీయార్ పాలిటిక్స్‌లోకి వచ్చినపుడు ఆయన వెనకాల థింక్ ట్యాంక్ వుంది. దానికి ఆయన గ్లామర్ తోడైంది. మీడియా సపోర్టు చేసింది, ఆయన చెప్పినది అత్యంత ప్రభావవంతంగా జనాల మెదళ్లలోకి చొచ్చుకుపోయింది. వాళ్లు కాంగ్రెసును ఓడించారు. జెపి మేధస్సుకు, చిరంజీవి వంటి స్టార్ గ్లామర్ తోడై వుంటే, వారికి మీడియా మద్దతు యిచ్చి వుంటే లోకసత్తా ఒక బలమైన శక్తిగా వుండి పాలకులకు దడ పుట్టించేది. కనీసం పార్టీ పెట్టి మూసేయకుండా వుంటే ఉద్యమకర్తగానైనా జెపి అంటే బెదురు వుండేది. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి భంగపడినట్లే జెపి కూడా భంగపడ్డారు. అది దురదృష్టం. – (సమాప్తం)
-ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2016)