మోదీ ప్రమాణస్వీకారానికి వచ్చిన నవాజ్ షరీఫ్ తల్లికి మోదీ శాలువా బహుమతిగా యిచ్చారు. పాకిస్తాన్ తిరిగి వెళ్లాక షరీఫ్ మోదీ తల్లికి తెల్లచీరను కానుకగా పంపించారు. దాయాదులైన భారత, పాకిస్తాన్‌లను తల్లి సెంటిమెంటు కలిపిందని, ''దీవార్'' సీను నిజజీవితంలో జరుగుతోందని, జర్నలిస్టులు, రచయితలు హర్షాతిరేకంతో పులకించిపోయారు. మనబోటి వాళ్లింటికి ఎవరైనా వస్తే మగాడికి షేక్ హ్యాండ్‌తో సరిపెట్టి ముత్తయిదువు కదాని అతని భార్యకు చీరా, జాకట్టు పెడతాం. అదే పద్ధతి ప్రభుత్వస్థాయిలో కూడా జరుగుతుంది. విదేశాధిపతులు ఏదైనా సమావేశానికి వచ్చినపుడు భర్తలు, భర్తలు చర్చల్లో మునిగితే వారి భార్యలు షాపింగుల్లో మునుగుతారు.
స్థానికంగా దొరికే దుస్తులు, వస్తువులు చూసి ముచ్చటపడితే ఆతిథ్యం యిచ్చిన దేశాధిపతి తన సతీమణి ద్వారా వాటిని బహుమతులుగా యిస్తూ వుంటారు. నెహ్రూగారు ప్రధాని అయినపుడు అప్పటికే ఆయన భార్య పోయింది కాబట్టి, ఇందిరా గాంధీ యీ హోస్టెస్ పని చూసుకునేవారు. మన్‌మోహన్ భార్య కూడా యిలాటి బాధ్యతలు నిర్వర్తించారు. మోదీ విషయానికి వస్తే ఆయన కుటుంబసభ్యులెవరూ ఆయనతో వుండరు. పాకిస్తాన్‌తో బాంధవ్యం పెంచుకుందామనుకుంటున్నారు కాబట్టి మర్యాదపూర్వకంగా షరీఫ్ కుటుంబసభ్యులకు ఏదో ఒకటి యిస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చి వుంటుంది. మామూలు పద్ధతుల్లో అయితే అతని భార్యకు చీరో, శాలువాయో పంపాలి. ప్రతిస్పందనగా ఆయనా మోదీ భార్యకు చీరో, శాలువాయో పంపే అవకాశం వుంది. అదే జరిగితే మోదీకి పెద్ద చిక్కు. జశోదా బెన్ స్థానాన్ని అఫీషియల్‌గా ఆమోదించినట్లవుతుంది. అందుచేతనే మోదీ తన తల్లిని రంగంపై తెచ్చాడు.
ఇన్నేళ్లగా మోదీ తన కుటుంబసభ్యుల్ని ఎవర్నీ వెలుగులోకి తీసుకురాలేదు. కుటుంబం లేకపోవడమే ఆయనకు పెద్ద అర్హత, బంధుప్రీతి చూపించే అవకాశమే లేదు అన్నట్లుగానే ప్రొజెక్టు అవుతూ వచ్చింది. అయితే యీసారి ఎన్నికలలో కొత్తగా వచ్చిన నియమాల ప్రకారం ఆయన తన భార్య పేరు బయటపెట్టవలసి వచ్చింది. ఇక అప్పణ్నుంచి భార్య పట్ల ఆయన నిరాదరణ ఫోకస్‌లోకి వచ్చింది. ఆమె పాపం యితని క్షేమం గురించి, ప్రగతి గురించి ప్రార్థనలు, ఉపవాసాలు చేస్తూ, 'ఆయన యిప్పటికైనా పిలిస్తే తప్పకుండా వెళ్తాను, పాత విషయాలు ప్రస్తావించను' అని యింటర్వ్యూలలో చెప్తూ వుంటే ఆవిడపై జాలి పెరుగుతోంది. 'ఇతను మనిషా? శిలా? ఆర్‌ఎస్‌ఎస్‌పై అంత ప్రేమ వుంటే తక్కిన ప్రచారకుల్లా బ్రహ్మచారిలా వుండలేకపోయాడా? తాళి కట్టుకుని వదిలేసేడేమిటి? గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యేవరకు ఏ పదవీ లేదు కదా, బంధుప్రీతితో అవినీతికి పాల్పడే ప్రమాదమే లేదు కదా, అప్పుడైనా దగ్గరకు రానీయలేదేం?' అనే సందేహం మామూలు వాళ్లకు కలుగుతుంది. మోదీ వ్యతిరేకులు 'భార్య బాగోగులే పట్టించుకోని వాడికి లోకంలో మహిళల సంక్షేమం గురించి మాట్లాడే అర్హతే లేదు' అని విరుచుకుపడ్డారు. అందువలన తను కూడా ఒక సాధారణ ఫ్యామిలీ మ్యానే అని చూపించుకోవలసిన అవసరం మోదీకి పడింది. ఎన్నికలు కాగానే తల్లిని రంగంపైకి తెచ్చాడు. (మూడోసారి ముఖ్యమంత్రిగా అయినప్పుడు కూడా యిలాటివి వార్తల్లో రాలేదు.
ఒకప్పటి గురువు, దరిమిలా ప్రత్యర్థి అయిన కేశూభాయ్ పటేల్ వద్దకు వెళ్లి తనకు మిఠాయి తినిపించిన ఫోటో వచ్చింది, (ప్రత్యర్థుల పట్ల కూడా మోదీ ఉదారంగా వ్యవహరించారన్న మెసేజ్ పంపడం ధ్యేయం కాబోలు) ఈయన వెళ్లడం, ఆవిడ మిఠాయి తినిపించడం, తింటూంటే మీసాలకు, గడ్డాలకు అంటిన మిఠాయిని ఆవిడ కొంగుతో తుడవడం – యివన్నీ పెద్ద విశేషాలుగా పేపర్లలో పడేట్లు చేశారు. మోదీ మరీ అంత కఠినాత్ముడు కాడు, తల్లీ తండ్రీ అంటే భయభక్తులున్నవాడు అనే భావం నాటుకోవాలంటే ఆవిణ్ని యింకా ఫోకస్‌లోకి తేవాలనుకున్నారు కాబట్టే ఎప్పుడూ లేని విధంగా షరీఫ్ తల్లికి మోదీ బహుమతి పంపడం!
ఈ ధోరణి ప్రబలిందంటే మన దేశానికి ఏ విదేశాధినేత భార్యా తోడుగా రాదు. 'ఆ మోదీగారు తల్లులకే బహుమతులు యిస్తాడు, కావాలంటే మీరూ మీ అమ్మా వెళ్లి బట్టలు పెట్టించుకుని, వాయినం పుచ్చుకురండి' అని మూతీ, ముక్కూ విరవవచ్చు.
-ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2014)