పెషావర్‌లో మిలటరీ స్కూలులో 132 మంది స్కూలు పిల్లల (వారితో బాటు యితరులు 8 మంది చనిపోయారు) మరణం తర్వాత పాకిస్తాన్ టెర్రరిజాన్ని ఏ విధంగా ఎదుర్కుంటుంది అన్నది చర్చనీయాంశంగా మారింది. ఆ ఘాతుకం నిర్వహించినది టిటిపి (తెహరీక్ ఎ తాలిబాన్ పాకిస్తాన్) జిహాదీ టెర్రరిస్టులు. ప్రభుత్వవ్యవస్థను వ్యతిరేకించే 13 చిన్న మతవాద టెర్రరిస్టు సంస్థలను ఒక ఛత్రం కింద తేవడానికి 2007లో బైతుల్లా మెహసూద్ అనే వజీరిస్తాన్‌కు చెందిన గిరిజన నాయకుడు స్థాపించిన సంస్థ అది. 2009లో అమెరికా నిర్వహించిన డ్రోన్ ఎటాక్‌లో అతను మరణించాడు. ఆ తర్వాత హకీముల్లా మెహసూద్ అనే అతను కూడా అలాటి ఎటాక్‌లోనే 2013లో చనిపోయాడు. అతని మరణానికి ప్రతీకారం అంటూ యీ సంస్థ పాకిస్తాన్ మిలటరీకు చెందిన కార్యాలయాలపై దాడి చేయడం మొదలుపెట్టింది. ఆ వరసలోనే 2014 జూన్‌లో కరాచీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై కూడా దాడి చేసింది.
పాకిస్తాన్ తాలిబన్లను ప్రోత్సహిస్తోందని చదువుతాం, మళ్లీ తాలిబన్లు పాకిస్తాన్‌పై దాడి చేశారనీ వింటాం. ఏమిటీ మిస్టరీ అంటే టెర్రరిజంపై, తాలిబన్లపై పాక్ ద్వంద్వ విధాన ఫలితం యిది. ఆఫ్గనిస్తాన్‌లో, భారత్‌లో జిహాద్ పేర కల్లోలాలు, హింసాత్మక ఘటనలు చేసి వాటిని బలహీనపరచే తాలిబన్లను 'మంచి తాలిబన్ల'గా ప్రకటించి పాకిస్తాన్, ఐయస్‌ఐ వారిని ప్రోత్సహిస్తుంది. పాకిస్తాన్ భారత్‌ను బలహీనపరచడానికి 1989లో లష్కరే తొయ్‌బా, జైషే మొహమ్మద్ సంస్థలను తయారుచేసి కశ్మీర్‌లో ప్రవేశపెట్టింది. ఆఫ్గనిస్తాన్‌ను బలహీనపరచడానికి 1999 నుండి 2008 వరకు పాకిస్తాన్ అధినేతగా వున్న పర్వేజ్ ముషారఫ్ అలాటి చర్యలే చేశారు. ఆఫ్గనిస్తాన్ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నట్లు పైకి చెప్తూ అమెరికా నుండి సహాయం పొందుతూ లోపాయికారీగా అఫ్గనిస్తాన్ తాలిబన్లకు సైన్యసహాయం చేస్తూ వచ్చాడు. (ఈ విషయాన్ని అమెరికా కనుక్కోలేక పోయిందనుకోవడం వింతగా వుంటుంది) ఆ విజయాలతో మదించిన కొందరు తాలిబన్లు పాకిస్తాన్‌ను తాము కలలు కనే ఉగ్రవాద తీవ్రమతవాద దేశంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. వారిని పాకిస్తాన్ 'చెడ్డ తాలిబన్లు'గా పరిగణిస్తుంది. వీరిపై యుద్ధం చేస్తూంటుంది. అందుకని వారూ పాకిస్తాన్‌పై దాడులు చేస్తూ వుంటారు. మసీదుల్లోని మదరసాలలో నేర్పించే విద్య కాకుండా వేరే రకమైన విద్య నేర్పడం తాలిబన్లు సహించరు. 2004-2013 మధ్య పాకిస్తాన్‌లోని స్కూళ్లపై 724 దాడులు జరిగాయి. ఈసారి యీ ఘాతుకం తర్వాత పాకిస్తాన్ ప్రజలు తాలిబన్లను నిర్మూలించాలని హాహాకారాలు చేస్తుంటే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఫారిన్ పాలసీ సలహాదారుగా వున్న సర్తాజ్ అజీజ్ 'అందరు టెర్రరిస్టులను ఒకే గాటకు కట్టకూడదు. పాకిస్తాన్ దేశభద్రతకు హాని కలిగించనివారిని మనం లక్ష్యంగా చేసుకోకూడదు' అంటున్నాడు. ఇదంతా చూస్తే ఒక విషయం స్పష్టమవుతోంది – పెషావర్ సంఘటన తర్వాత పాకిస్తాన్ సైన్యం టెర్రరిజానికి మద్దతు యివ్వడం ఆపబోవటం లేదు. ప్రజాగ్రహాన్ని యితరులపై మళ్లించి, తమకు అనుకూలమైన తాలిబన్లను ప్రోత్సహిస్తోంది.
ఇలాటి డబుల్‌గేమ్‌కు రూపశిల్పి ఐన పర్వేజ్ ముషారఫ్ యిప్పుడీ మారణకాండపై ఒక టీవీ యింటర్వ్యూలో ఏమన్నాడో తెలుసా? ''ఇది విదేశీ శక్తుల పని. అఫ్గనిస్తాన్‌లోని హమీద్ కర్జాయ్ ప్రభుత్వం హిందూస్తాన్‌కి చెందిన గూఢచారి సంస్థ 'రా' కలిసి యీ దాడిని టిటిపి ద్వారా నిర్వహించాయి. టిటిపి ప్రస్తుత అధినేత మౌలానా ఫజుల్లా అఫ్గనిస్తాన్‌లోనే దాగున్నాడు.'' అని. ఈ వాదనకు వత్తాసు పలుకుతున్నట్లు పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ దాడి జరగగానే అఫ్గనిస్తాన్‌కు వెళ్లి అక్కడి ప్రభుత్వాధికారులతో ''మౌలానా ఫజుల్లాను మాకు అప్పగించండి'' అని అడిగేశాడు. ఈ ఫజుల్లా వాయువ్యపాకిస్తాన్‌లోని స్వాత్ లోయకు చెందినవాడు. పాకిస్తాన్ సైన్యం అక్కడ తాలిబన్లను వెతక నారంభించనపుడు 2009లో అఫ్గనిస్తాన్‌కు పారిపోయి, అక్కణ్నుంచి టిపిపిని నడుపుతున్నాడు. ముషారఫ్ మాటలను 'మంచి తాలిబన్లు' అందిపుచ్చుకున్నారు. స్కూలులో ప్రాణాలు కోల్పోయినవారికై ఏర్పరచిన సంతాపసభలో లష్కరే తొయిబాకు ముసుగుగా పని చేసే జమాత్-ఉద్-దవా అనే సంస్థ పెషావర్ శాఖ అధిపతి అబ్దుల్ రవూఫ్ ''పాకిస్తాన్‌ను విచ్ఛిన్నం చేయడానికి విదేశాలు కుట్ర పన్నాయి. కానీ అవి విఫలం కాకతప్పదు.'' అన్నాడు. 'ఈ అమాయకపు పిల్లల రక్తం అమెరికా, ఇజ్రాయేలు, ఇండియాలను భస్మీపటలం కావిస్తుంది' అంటూ ఆ సభలో బ్యానర్లు కట్టారు. పాక్‌ను తమ చేతిలో తీసుకుందామని ప్రయత్నించే తాలిబన్లకు, పాక్ సైన్యానికి నడుస్తున్న యుద్ధంలో భాగంగా ఆ సంఘటన జరిగితే మధ్యలో విదేశాలు ఎలా వచ్చాయో వాళ్లకే తెలియాలి.
పాక్ సైన్యం జర్బ్ ఎ అజ్బ్ పేర తమకు, ఆఫ్గనిస్తాన్‌కు గల సరిహద్దులో వున్న వజీరిస్తాన్ పర్వతప్రాంతంలో గెరిల్లా యుద్ధం చేస్తున్న టెర్రరిస్టులను వేటాడుతోంది. ఇప్పటికి 1500 మంది టెర్రరిస్టులను చంపామని, వారిలో చాలామంది విదేశీయులని చెప్పుకుంటోంది (ఆ ప్రాంతానికి మీడియాను అనుమతించటం లేదు, రుజువులు చూపడం లేదు, అందువలన యీ అంకె ఎంతవరకు నమ్మాలో తెలియదు). గత పదేళ్లగా వజీరిస్తాన్, ఖైబర్, ఫక్తూనిస్తాన్ ప్రాంతాల్లో పాక్ 1.50 లక్షల మంది సైనికులను అక్కడకు పంపించింది. ఈ ఆపరేషన్ కారణంగా పది లక్షల మంది పౌరులు నిర్వాసితులై శరణార్థులుగా మారారు. వారి అవస్థ చూసి పాక్ పాలనావ్యవస్థలోని కొందరు తాలిబన్ సానుభూతిపరులుగా మారారు. డిసెంబరు 16 నాటి పెషావర్ ఘటనలో స్కూలులో పనిచేసేవారు టెర్రరిస్టులకు ముందుగా సమాచారం అందించారని కొందరి ప్రగాఢవిశ్వాసం. పొద్దున్న ఆరుగురు దుండగులు స్కూలు వెనక్కాల గోడ ఎక్కుతూంటే ఎవరూ చూడలేదా? అని వారు అడుగుతున్నారు. వచ్చినది ఆరుగురు కాదు, పన్నెండుమంది, ఆరుగురు ముందు నుంచి, ఆరుగురు వెనకనుంచి వచ్చారని స్థానిక మీడియా అంటోంది. వాళ్లు స్కూలుకు సంబంధించిన వ్యాన్‌లోనే వచ్చారని, మిలటరీ కమెండోలు వచ్చి 900 మందిని రక్షించినప్పుడు దాడి చేసినవారిలో కొందరు స్కూలు సిబ్బంది సహాయంతో వారితో కలిసిపోయి తప్పించుకున్నారని కూడా అంటున్నారు. ఈ ఆర్మీ పబ్లిక్ స్కూలు మిలటరీ జోన్‌లో వుంది. వెళ్లాలంటే అనేక మిలటరీ చెక్‌పోస్టులుంటాయి. అయినా టెర్రరిస్టులు రాగలిగారంటే భద్రతా లోపాలు ఎన్ని వున్నాయో తెలుస్తున్నాయి. ఈ స్కూలుపై దాడి జరిగే ప్రమాదం వుందని పెషావర్ ప్రాంతీయ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గత ఆగస్టులోనే హెచ్చరిక జారీ చేసింది. అంతేకాదు, దాడికి మూడు రోజుల ముందు కూడా వార్నింగు అందిందట. అయినా దాడి జరిగిందంటే దాని అర్థం – స్కూలుకి సంబంధించిన వారిలో తాలిబన్ సానుభూతిపరులున్నారు!
దాడి జరిగిన తర్వాతి పరిస్థితిని సమీక్షిస్తే – స్కూలులో భద్రతావైఫల్యాల గురించి మీడియా ప్రశ్నలు లేవనెత్తటం లేదు. సైన్యం ఏది చెపితే అదే రాస్తోంది. తాలిబన్లను అణచివేయగలం అని వాళ్లు గొప్పలు చెపుతూంటే యథాతథంగా అదే ప్రచారం చేస్తోంది. ఇక ప్రభుత్వమైతే ఉక్రోషంతో టెర్రరిజం ఆరోపణలపై జైల్లో వున్న 500 మందిని ఉరి తీసేస్తామని ప్రకటించింది. వారిలో కొందరు అమాయకులు కూడా వున్నారని జస్టిస్ ప్రాజెక్ట్ పాకిస్తాన్ అనే హ్యూమన్ రైట్స్ సంస్థ వాదిస్తోంది. మరణశిక్షపై 2008లో విధించిన మారటోరియంను హడావుడిగా ఎత్తేసి, డిసెంబరు 19 నుంచి 24 లోగా 6 ఉరిశిక్షలు అమలు చేశారు. ఈ ఉరిశిక్షలు ప్రారంభం కాగానే తెహరీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ అనే సంస్థ మీడియాకు హెచ్చరికలు పంపింది – మా వాదనలకు మీరు సరైన కవరేజి యివ్వటం లేదు, ఇలా చేస్తే మేం మరిన్ని దాడులు చేస్తాం జాగ్రత్త అని. ప్రధాని నవాజ్ షరీఫ్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి టెర్రరిజాన్ని ఎదుర్కోవడానికి నేషనల్ టెర్రరిజం పాలసీని సమీక్షిద్దామన్నాడు. తాలిబన్‌లకు తిండి పదార్థాలు, డబ్బు ఎలా అందుతున్నాయో నిఘా వేయాలని, అఫ్గనిస్తాన్‌నుండి అనుమతి లేకుండా వచ్చిన శరణార్థులను తిప్పి పంపాలని, వారిపై సత్వర విచారణ జరపాలని యిలా ఆ సమావేశంలో రకరకాల సూచనలు వచ్చాయి. ఇదిలా జరుగుతూండగానే యాంటీ టెర్రరిస్టు కోర్టు జడ్జి ముంబయి దాడులలో నిందితుడు జకీర్ రెహమాన్ లఖ్వీకి బెయిల్ మంజూరు చేశాడు. పెషావర్ దాడికి విదేశీయులే కారణమని ప్రచారం చేస్తున్న జమాత్ ఉద్ దావాకు లఖ్వీ సన్నిహితుడు. హర్షించదగిన విషయం ఏమిటంటే పాక్ ప్రజలు మాత్రం పెషావర్ దాడిని జీర్ణించుకోలేక పోతున్నారు. ఆ దాడులను ఖండించడానికి నిరాకరించిన ఎఱ్ఱ మసీదు పూజారి మౌలానా అబ్దుల్‌కి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. తాలిబన్ వ్యతిరేక ప్రదర్శనలు దేశమంతటా యిన్నాళ్లు జరగడం గతంలో ఎన్నడూ చూడలేదు. ఇలాటి దాడులు విద్యాసంస్థలపై, కోచింగ్ సెంటర్లపై యింకా జరుగుతాయన్న పంజాబ్ ప్రాంతీయ ప్రభుత్వం హెచ్చరించడంతో పాకిస్తాన్ క్రికెట్ ఆటగాడు, ప్రఖ్యాత బౌలర్ సయీద్ అజ్మల్ ఫైసలాబాద్‌లో తను నడుపుతున్న క్రికెట్ అకాడమీని మూసేశాడు. అకాడెమీలో దాదాపు 200 మంది కోచింగ్ పొందుతున్నారు. ఇంకో వంద మంది దాకా వస్తూ పోతూ వుంటారు. వీళ్లందరి ప్రాణాలూ పణంగా పెట్టలేక మూసేశానన్నాడు. ఇలాటి కష్టనష్టాలు పాక్ ప్రజలు మరెన్ని కలగనున్నాయో!
ఎమ్బీయస్ ప్రసాద్