ఆయన సినిమాలన్నీ కళాఖండాలనీ, ఆయన అభిరుచి ఉత్తమోత్తమైనదనీ నేననను. ఆయన వాటిని వ్యాపారదృష్టితోనే తీశాడు. అందుకే దాదాపు 150 సినిమాలు తీయగలిగాడు. లేకపోతే ఏ పాతిక దగ్గరో ఆగిపోయేవాడు. అయితే ఆయనలో విశేషం ఏమిటంటే ప్రయోగాలు చేయడానికి వెరవలేదు. ఆ ప్రయోగాలు కూడా డబ్బు తెస్తాయనే, జనాలు చూస్తారనే అనుకున్నాడు కానీ, కేవలం అవార్డుల కోసం తీయలేదు. సాధారణంగా కొందరు నిర్మాతలు కెరియర్ తొలిథలో ప్రయోగాలు చేసి ఆ తర్వాత మానేస్తారు. ఆయన అలా మానలేదు. హీరోహీరోయిన్లు లేని ''పాపకోసం'' (1968) ''ద్రోహి'' (1970) తీసినట్లే తర్వాతి రోజుల్లో కూడా గుడ్డి హీరోయిన్‌తో ''ప్రేమించు'' (2001), పిల్లలతో ''హరివిల్లు'' (2003) లాటివి తీశారు. వరుసగా భారీ సినిమాలు తీస్తూ మధ్యలో ''సూరిగాడు'' (1992) వంటి చిన్న సినిమా తీసి వాటికి వూపిరి పోశారు. ''అక్కాచెల్లెళ్లు'' (1993), ''పరువు-ప్రతిష్ట'' (1993), ''తోడికోడళ్లు'' (1994), ''కొండపల్లి రత్తయ్య'' (1995). ''నువ్వు లేక నేను లేను'' (2002) – యివన్నీ చిన్న సినిమాలే. వీటిలో కొన్ని బాగా ఆడాయి కూడా.ఇది ఒక విశేషంగా భావిస్తాను నేను. ఎందరో నిర్మాతలు తాము బలపడిన కొద్దీ తమ బ్యానర్ వాల్యూ నిలబడాలంటే సక్సెస్ వచ్చి తీరాలనే లెక్కతో భారీగా, మరింత కమ్మర్షియల్‌గా తీస్తూ పోయారు. విజయా ప్రొడక్షన్స్ సైతం అంతే.
ఎవిఎం, జెమినీ వంటి స్టూడియో ఆధారిత సంస్థలు మాత్రమే చిన్నా, పెద్దా ఒకేసారి తీస్తూ నిలబడ్డారు. స్టూడియో కట్టి అధినేత కావడానికి ముందు నుండే రామానాయుడు ఆ ఫార్ములా వుపయోగించారు. ''రాముడు భీముడు'' (1964)కి ''శ్రీకృష్ణ తులాభారం'' (1967) కు మధ్య ''ప్రతిజ్ఞా పాలన''(1965) తీస్తే దానికీ లాభం వచ్చింది. (''ప్రేమనగర్'' (1971) కలర్‌లో తర్వాత తీసినది అంతకంటె భారీ సినిమా కాదు. ''జీవనతరంగాలు'' (1973) అనే బ్లాక్ అండ్ వైట్ సినిమా. తర్వాత రంగుల్లో తీసిన ''చక్రవాకం'' (1974) పోయినా వెంటనే వచ్చిన ''అమ్మాయిల శపథం'' (1975) అనే చిన్న సినిమా ఆడింది. నిజానికి పెద్ద సినిమాల్లో ఆదాయం, ఖర్చు యించుమించు సమానంగా వుండేవిట. అందుకే వరుసగా ''బొమ్మలు చెప్పిన కథ'' (1969), ''సిపాయి చిన్నయ్య'' (1969), ''ద్రోహి'' (1970) ఫెయిల్ కావడంతో పెట్టనదంతా పోయి, అప్పులు చేసి ''ప్రేమనగర్'' తీయాల్సి వచ్చింది. తర్వాతి రోజుల్లో కూడా పెద్ద దర్శకులతో తీసిన సినిమాలు ఫెయిలయిన తరుణంలో ఔత్సాహికులతో తీసినవి హిట్ అయి ఆదుకున్నాయి. ''తాజ్‌మహల్'' (1995) – అలాటిదే. కామెడీ జానర్ కూడా ఆయనికి లాభాలు తెచ్చి పెట్టింది.
రామానాయుడు కథలు వినడం గురించే అందరూ చెప్తారు తప్ప కథలో మార్పులు సూచించారనీ, స్టోరీ సిట్టింగుల్లో, మ్యూజిక్ సిట్టింగుల్లో కూర్చున్నారనీ ఎవరూ చెప్పరు. ఒక కార్పోరేట్ చీఫ్‌లా ఆయన ఒక వ్యక్తిని సమర్థుడిగా భావించి, అతని చేతికి అన్నీ అప్పగించేవారు. స్క్రిప్టు తనకు మనసుకు హత్తుకునేదాకా కార్యాచరణకు దిగేవారు కారు. ''ప్రేమఖైదీ'' స్క్రిప్టు ఇవివి 17 సార్లు తిరగరాయవలసి వచ్చింది. 17వది ఓకే చేసి డైరక్షన్ అప్పగించారు. సినిమా హిట్ అయింది. తను కథ వినకుండా ఓకే చేసిన ఏకైక సినిమా ''సూపర్ హీరోస్'' (1997) అనీ, అందుకే దాని ఫ్లాప్‌కి తానూ కారకుడననీ ఆయన చెప్పుకున్నారు. నిర్మాణ సమయంలో టెక్నీషియన్ల వ్యవహారాల్లో తలదూర్చినట్లు ఎక్కడా వినలేదు. దూర్చి వుంటే ఎవరో ఒక దర్శకుడితోనో, నటుడితోనో పేచీ వచ్చి వుండేది. ఆయన కెయస్ ప్రకాశరావు, వి మధుసూదనరావు, కమలాకర కామేశ్వరరావు, తాపీ చాణక్య వంటి సీనియర్లతో ఎలా కలిసి పనిచేశారో కొత్తతరం దర్శకులతోనూ అంతే యీజ్‌తో పని చేయించుకున్నారు. అర్ధశతాబ్ది దాటిన కెరియర్‌లో ఎలాటి వివాదమూ రాలేదంటే ఎవరికి యివ్వాల్సిన గౌరవం వారికి యిచ్చినట్లే అనుకోవాలి. తొలిసారిగా భారీ తారాగణంతో తీస్తున్న రాముడు భీముడు సినిమాను అప్పటికి వరుసగా ఏడెనిమిది ఫ్లాపులు తీసిన తాపీ చాణక్యకు యిచ్చారు. ''పాపకోసం'' లాటి విలక్షణ చిత్రాన్ని జివిఆర్ శేషగిరిరావు వంటి కొత్త దర్శకుడికి యిచ్చారు. ''బొమ్మలు చెప్పిన కథ'', ''ద్రోహి'' లాటి ఫ్లాప్‌లిచ్చినా బాపయ్యకు ''సోగ్గాడు'' (1975) యిచ్చారు. ఇవివి సత్యనారాయణ ''చెవిలో పువ్వు'' తీస్తూ వుంటే 11 ఆఫర్లు వచ్చాయి. ఆ సినిమా ఫెయిల్ కావడంతో అన్నీ వెనక్కు వెళ్లిపోయాయి. కానీ ఈయన ''ప్రేమఖైదీ''(1991) ఛాన్సు యిచ్చారు.
వ్యాపారమే ప్రధానంగా భావించినా మొహమాటాలకు లొంగిన సందర్భాలూ లేకపోలేదు. ''సెక్రటరీ'' విజయోత్సవ సభలో 'నన్ను హీరోగా పెట్టి తీసినా సక్సెస్ చేయగల సత్తా నాయుడుగారిది' అని నటుడు సత్యనారాయణ అంటే 'సరే అలాగే తీస్తా' అన్నారు. ''సావాసగాళ్లు'' సినిమా చిత్రీకరణలో నాగేశ్ కొత్త డైరక్టరుకు మరీ సూచనలు యిస్తూ వుంటే 'కావాలంటే నీకు డైరక్షన్ ఛాన్సు యిస్తాను కానీ, కొత్తవాణ్ని కంగారు పెట్టకు' అన్నారు. వెంటనే నాగేశ్ ''మొరటోడు'' కథతో వస్తే యిద్దరికీ యిచ్చిన మాట ప్రకారం ఆ సినిమా తీసి 5 లక్షలు పోగొట్టుకున్నారు. కృష్ణంరాజును పెట్టి తీయాల్సింది అని డిస్ట్రిబ్యూటర్స్ అన్నారట కానీ సినిమాయే చాలా మొరటుగా, మోటుగా, అతిగా వుంటుంది. అలాగే తన అనేక సినిమాలకు కథ యిచ్చిన ఆప్తుడు గుహనాథన్‌ను దర్శకుడిగా పరిచయం చేయడానికి తీసిన ''కక్ష'' సినిమా బజెట్ బాగా పెరిగినా పోనీ అనుకున్నారు. దాంతో రూ.8 లక్షలు నష్టం తెచ్చింది. అదే గుహనాథన్ ''మనసే మందిరం'' సినిమానే మగా, ఆడ పాత్రలు మార్చేసి ''మాంగల్యబలం'' (1985)కు కథ యిస్తే సినిమా తీస్తూండగా మధ్యలో పోలిక గుర్తించినా యింకేం చేయలేక సినిమా పూర్తి చేసి నష్టాన్ని భరించారు.
తమిళంలో తీసిన ఆయన సినిమాల్లో కొన్ని తెలుగువాటి రీమేక్స్ కాగా, కొన్ని డబ్బింగ్ కాగా, ''నమ్మకుళందైగళ్'', ''మధురగీతం'', ''తనికట్టు రాజా'', ''మైఖేల్ రాజా'', ''కైనాట్టు'' ''శివప్పు నిరత్తిల్ చిన్న పూ'' స్ట్రెయిట్ సినిమాలు. హిందీ సినిమాలు మాత్రం తెలుగు రీమేక్సే. ''ప్రేమ్‌నగర్'' అదే పేరుతో, ''సోగ్గాడు-దిల్‌దార్'', ''జీవనతరంగాలు – దిల్ ఔర్ దీవార్'', ''చిలికి కృష్ణుడు-బందిష్'', ''దేవత-తోఫా'', ''ముందడుగు-మక్సద్'', ''ప్రతిధ్వని-ఇన్సాఫ్‌కీ ఆవాజ్'', ''కథానాయకుడు-దిల్‌వాలా'', ''బ్రహ్మపుత్రుడు-రఖ్‌వాలా'', ''బొబ్బిలి రాజా-జీవన్ ఏక్ సంఘర్ష్'', ''ప్రేమఖైదీ''ని అదేపేరుతో, ''సూరిగాడు-సంతాన్'', ''చంటి-అనాడీ'', ''యమలీల-తక్‌దీర్‌వాలా'', ''పవిత్రబంధం-హమ్ ఆప్‌కే దిల్‌మే రహ్‌తే హై'', ''శివయ్య-ఆఘాజ్'', ''కలిసుందాం రా – కుఛ్ తుమ్ కహో కుఛ్ హమ్ కహే''. ఒకే ఒక్క హిందీ చిత్రం ''హమారీ బేటీ'' ఎకె బీర్ దర్శకత్వంలో వికలాంగ యువతి గురించి తీశారు. ఆయన హిందీ కాక యితర భాషల్లో తీసిన సినిమాల్లో చాలా వాటిల్లో డబ్బులు రాలేదట. కానీ – ఫర్ ద హెక్ ఆఫ్ యిట్ – తీశారు. వాటన్నిటికై డబ్బుకోసం అనేక మసాలా సినిమాలు తీశారు. వాటిలో కాలపరీక్షకు నిలిచేవి కొన్నే కావచ్చు. కానీ ఆయన కారణంగా ఎందరో ఆర్టిస్టులకు, ఎందరో టెక్నీషియన్లకు తెరపరిచయం కలిగింది, అభివృద్ధి కలిగింది, వేలాదిమందికి జీవనోపాధి కలిగింది. రామానాయుడిగారు డబ్బు రావాలనే సినిమాలు తీసినా ఆయనను నడిపించినది మాత్రం సినిమాల పట్ల 'పేషన్'. దాని కోసం కొన్ని భిన్నతరహా సినిమాలు కూడా తీశారు. ఆయన వారసులు కేవలం వాణిజ్యపరమైన విజయం కోసమే సినిమాలు మాత్రమే తీద్దామనుకుంటే మాత్రం ఆయనంత ఖ్యాతి తెచ్చుకోలేరు. రామానాయుడిగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2015)