ఎమ్బీయస్‌ : సౌదీ అరేబియాలో రాజు మారారు

సౌదీ అరేబియా పాలకుడు అబ్దుల్లా బిన్‌ అబ్దులజీజ్‌ జనవరి 23 న చనిపోయారు. అరబ్‌ ప్రాంతంలో అమెరికాకు చిరకాలమిత్రుడైన అబ్దుల్లా అంత్యక్రియలకు హాజరు కావడానికై ఒబామా తన భారతదేశ పర్యటనను కుదించుకోవలసి వచ్చింది. సౌదీ…

సౌదీ అరేబియా పాలకుడు అబ్దుల్లా బిన్‌ అబ్దులజీజ్‌ జనవరి 23 న చనిపోయారు. అరబ్‌ ప్రాంతంలో అమెరికాకు చిరకాలమిత్రుడైన అబ్దుల్లా అంత్యక్రియలకు హాజరు కావడానికై ఒబామా తన భారతదేశ పర్యటనను కుదించుకోవలసి వచ్చింది. సౌదీ ఆచారం ప్రకారం అంత్యక్రియలు అతి నిరాడంబరంగా జరిగాయి. శవాన్ని ఒక గుడ్డలో చుట్టి కుటుంబసభ్యులు మోయగా, శవపేటిక కూడా లేకుండా గుర్తు పట్టలేని ఒక చోట కప్పిపెట్టారు. అక్కడ సమాధి కట్టడం లాటివి ఏవీ చేయరు.    లెక్కప్రకారం చూస్తే 2005 నుంచే అబ్దుల్లా రాజుగా వ్యవహరించారు. కానీ అంతకు పదేళ్ల ముందు నుంచే అతను తెర వెనుక నుండి అధికారం చలాయిస్తున్నాడు. అప్పటి రాజు ఫహద్‌ యితని సవతి సోదరుడే. ఇతను అప్పుడు యువరాజు. సౌదీ అరేబియా రాజ్యాన్ని స్థాపించిన ఇబ్న్‌ సౌద్‌ 1953లో చనిపోయాక, అతని కుమారులే ఒకరి తర్వాత మరొకరు రాజులవుతూ వస్తున్నారు. అబ్దుల్లా స్థానంలో యిప్పటిదాకా యువరాజుగా వున్న ఆయన సోదరుడు సల్మాన్‌ బిన్‌ అబ్దులజీజ్‌ సౌద్‌ కొత్తరాజు అయ్యారు. వయసు 70. వీళ్లందరూ సోదరులేనా అని ఆశ్చర్యపడవద్దు. వాళ్లు మొత్తం 53 మంది బ్రదర్స్‌! (ఇంతమంది పిల్లలకు పేర్లు వెతకడం కూడా కష్టమే కదా) ఈ సోదరులందరూ కలిసి వారసులెవరో నిర్ణయిస్తారన్నమాట. అందరి కంటె చిన్నవాడు 68 ఏళ్ల ముక్రీన్‌ను యువరాజు చేస్తూ కొత్తగా యువరాజుకి డిప్యూటీ (బాలరాజు అనాలేమో)ను కూడా నియమించాలని నిశ్చయించారు. అతను హోం మంత్రిగా పని చేస్తూ అల్‌ ఖైదాతో పోరాటం సాగిస్తున్న మహమ్మద్‌ బిన్‌ నయ్యీఫ్‌. ఇతను సౌద్‌కు కొడుకు కాదు, మనుమడు. ఈ మార్పుల వలన సౌదీ విధానాలు ఏమైనా మారతాయా అనేది ఆసక్తికరమైన అంశం.

అబ్దుల్లాకు లిబియా అధినేత కల్నల్‌ గడ్డాఫీ అంటే అస్సలు పడేది కాదు. ఒకసారి అరబ్‌ లీగ్‌ సమావేశంలో అబ్దుల్లా గడ్డాఫీపై అరబిక్‌ భాషలో బూతులు కురిపించాడట. అమెరికా సాయంతో గడ్డాఫీని ఎలా అంతం చేశాడో చూశాం. ప్రస్తుతం సిరియా పాలకులపై కక్ష కట్టాడు. అంతకుముందు ఐయస్‌ (ఇస్లామిక్‌ స్టేట్‌)ను అణచాలని అమెరికా మిలటరీ కూటమి ఏర్పరచి సౌదీని భాగస్వామిగా చేసింది. అలాటి కూటమే మరొకటి ఏర్పరచి సిరియా పని పట్టాలని అబ్దుల్లా కోరుతూ వచ్చాడు. 2013లో  సిరియాపై దాడి చేయడానికి అమెరికా, సౌదీ, ఫ్రెంచ్‌ విమానాలు రెడీగా వున్న తరుణంలో ఆఖరి నిమిషంలో దాడి వద్దని అన్నందుకు ఒబామాను అబ్దుల్లా క్షమించలేదు. కొన్నాళ్లు పోయాక సిరియా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, వారి సహకారంతో సిరియాలో వున్న ఐయస్‌ స్థావరాలపై దాడిచేశారు. కానీ అది అబ్దుల్లాను సంతృప్తి పరచలేదు. 

అబ్దుల్లాకు ఈజిప్టు అధ్యక్షుడుగా వున్న హోస్నీ ముబారక్‌ అంటే అభిమానం వుంది. ఈజిప్టులో విప్లవం చెలరేగి, అతన్ని కిందకు దింపేస్తూ వుంటే వేడుక చూస్తూ కూర్చుందని అమెరికాపై కినుక. హోస్నీ పతనం తర్వాత ముస్లిం బ్రదర్‌హుడ్‌కు బలం పెరిగి, ఆ ప్రాంతంలో బలం పుంజుకోవడం, అరబ్‌లో కల్లా పెద్ద దేశమైన ఈజిప్టులో ప్రజాస్వామ్యం కోసం డిమాండ్‌ రావడం – యివన్నీ చూశాక అబ్దుల్లాకు గుబులు ప్రారంభమై కినుక కోపంగా మారింది. అరబ్‌ ప్రాంతంలో ప్రజాస్వామ్యం ఛాయలు పడకూడదన్న ఆదుర్దాతో ఈజిప్టులోని మిలటరీ ప్రభుత్వానికి ఆర్థికసాయం, నైతిక సాయం చేశాడు. అంతేకాదు, గల్ఫ్‌లోని యితర అరబ్‌ దేశాల నేతలను కూడా ఒప్పించి ఈజిప్టు ప్రజాస్వామ్యంవైపు వెళ్లకుండా మిలటరీకి మద్దతిచ్చేట్లా చేశాడు. అరబ్‌ ప్రజలెప్పుడూ రాజులకు సలాంలు చేస్తూనే వుండాలని అబ్దుల్లా కోరిక. వీళ్లు సున్నీలు. వీళ్ల రాజ్యంలో 15% వున్న షియాలు తమ పట్ల వివక్షత చూపుతున్నారని భావిస్తూ వుంటారు. బహరైన్‌లో రాజు కూడా సున్నీ, కానీ ప్రజల్లో షియాలకు సంఖ్యాబలం వుంది. వాళ్లు ఎన్నికలు కావాలంటూ, ప్రభుత్వంలో ప్రజలకు ప్రాతినిథ్యం వుండాలంటూ 2012, 2013లలో ఉద్యమాలు చేపడితే బహరైన్‌ రాజు అబ్దుల్లా సాయం అర్థించాడు. అబ్దుల్లా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కలిసి 'శాంతిసేన'ను పంపించి, ఉద్యమాన్ని అణచివేశారు. ఇప్పటికీ ఆ సేన అక్కడే వుంది. 

అబ్దుల్లాకు నచ్చని మరో దేశం షియాలు ఎక్కువగా వున్న ఇరాన్‌! బహరైన్‌, ఇరాన్‌. యెమెన్‌, లెబనాన్‌ – ఎక్కడ గొడవ జరిగినా ఇరానే వెనక నుంచి చేయిస్తోందని అతని అనుమానం. సిరియాలో ప్రభుత్వాన్ని మార్చేసి తన చెప్పుచేతల్లో వుండేవారిని నెలకొల్పాలనే అబ్దుల్లా కోరిక ఇరాన్‌, రష్యాలు సిరియాకు మద్దతు యివ్వడం చేత నెరవేరటం లేదు పాపం. తమ మధ్య సత్సంబంధాలు నెలకొల్పాలని ఇరాన్‌ ప్రయత్నాలు చేయకపోలేదు. కానీ అబ్దుల్లా స్పందించలేదు. ఇరాన్‌-అమెరికాల మధ్య అణు ఒప్పందానికి ఇజ్రాయేలు ఎంత వ్యతిరేకో, అబ్దుల్లా కూడా అంతే వ్యతిరేకి. సౌదీ రాజకుటుంబానికి రాజగురువులైన వహాబీ మతపెద్దల ప్రకారం షియాలు ఇస్లాం మతవిశ్వాసరహితులు. హసన్‌ వహాబ్‌ అనే మతగురువు 19 వ శతాబ్దపు చివరిలో వుండేవాడు. ఆయన కూతుళ్లలో ఒకరిని ఇబ్న్‌ సౌద్‌ పెళ్లాడి, ఆ మతపీఠంతో చేతులు కలిపాడు. సౌదీ రాజుల మద్దతుతో యీ గురువులు అరబ్‌ ప్రాంతమంతా పర్యటిస్తూ, తమ ప్రబోధాలతో ఇరాన్‌, ఇరాక్‌, సిరియా వంటి ప్రాంతాల్లో సున్నీ-షియా విభేదాలను రెచ్చగొడుతున్నారు. సిరియాను అల్లకల్లోలం చేయడానికి చూస్తున్న ఐయస్‌ సౌదీ తరహా పుస్తకాలను తమ అధీనంలో వున్న స్కూళ్లలో చదివిస్తోంది. ఇరాన్‌ బలపడితే సౌదీలో వున్న షియాలకు ధైర్యం వస్తుందని సౌదీ రాజుల భయం.

ఆర్థికపరమైన అంశాలకు వస్తే – సౌదీ వైభవానికి కారణం ప్రపంచంలో కల్లా క్రూడ్‌ ఆయిల్‌ ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశమది. తన ఉత్పత్తిని పెంచో, తగ్గించో ప్రపంచంలో ఆయిల్‌ ధరలను నియంత్రించ శక్తి గలది. గత ఏడాదిగా ఆయిల్‌ ధరలు తగ్గుతున్నాయి. లెక్క ప్రకారం చూస్తే సౌదీ ఆయిల్‌ ఉత్పత్తి తగ్గించి డిమాండ్‌, ధర పడిపోకుండా, తాము నష్టపోకుండా చూసుకోవాలి. కానీ సౌదీ ఉత్పత్తి తగ్గించటమే లేదు, ఆయిల్‌ ధర యింకాయింకా పడిపోతున్నా సరే! దీని వెనక రాజకీయ కారణాలున్నాయి. సిరియాను వశపరచుకోవాలంటే దానికి మద్దతిస్తున్న ఇరాన్‌, రష్యాలను ఎలాగోలా దెబ్బ కొట్టాలి. ముందుగా రష్యాపై సామోపాయం ప్రయోగించి చూశాడు. 2014లో 'మీ వద్ద బిలియన్ల డాలర్ల ఆయుధాలు కొంటాం, సిరియాకు మద్దతు యివ్వడం మానేయండి' అన్నాడు. దానికీ, దీనికీ లింకు పెట్టవద్దు, దేనికదే అన్నారు రష్యావారు. రష్యా ఆర్థికవ్యవస్థను దెబ్బ కొట్టాలంటే ఆయిల్‌ ధర పెరక్కుండా చూడాలి అనుకున్నాడు. అదే రీతిలో ఆయిల్‌ ఉత్పత్తి చేసే మరో దేశమైన ఇరాన్‌ను కూడా దెబ్బ కొట్టాలంటే యిదే మంత్రం అనుకున్నాడు. పాత స్థాయిలోనే ఆయిల్‌ ఉత్పత్తి చేస్తూనే వున్నాడు. గత ఏడాది 100 డాలర్లు వున్న బారెల్‌, యిప్పుడు 50 డాలర్లకు పడిపోయింది. ఇరాన్‌, రష్యా విలవిల్లాడుతున్నాయి. అమెరికా ఆయిల్‌ ఇండస్ట్రీకి కూడా దీని వలన దెబ్బ తగిలింది. అయినా దానికి సంతోషమేమిటంటే ఆయిల్‌ ఎగుమతులపై ఆధారపడిన వెనిజులా వామపక్ష ప్రభుత్వం కూడా ఆర్థిక సంక్షోభంలో యిరుక్కుంది. ఆయిల్‌ ధరల తగ్గుదల వలన సౌదీ కూడా ప్రభావితమైంది. 2015 బజెట్‌లో 38.6 బిలియన్‌ డాలర్ల లోటు కనబడుతోంది. కానీ దానికి 750 బిలియన్‌ డాలర్ల రిజర్వ్‌స్‌ వున్నాయి కాబట్టి ధీమాగా వుంది. కొత్త రాజు యీ పాలసీని మార్చేస్తాడని అనుకోలేం కానీ, రాచకుటుంబంలోని పిన్నవయస్కులు ఎందుకొచ్చిన గోల యిది అనుకుంటున్నారట. 

2010లో అమెరికా ఆర్థికపరిస్థితి అతలాకుతలమైనపుడు అమెరికాతో ముడివేసుకున్న సౌదీ అరేబియాలో కూడా నిరుద్యోగం ప్రబలింది. అబ్దుల్లా 384 బిలియన్‌ డాలర్లతో పంచవర్ష అభివృద్ధి ప్రణాళిక ప్రవేశపెట్టాడు. అయినా జనాభాలో సగం మంది 25 ఏళ్ల వయసు కంటె తక్కువ వాళ్లే కాబట్టి యిప్పటికీ నిరుద్యోగ సమస్య తీరలేదు. నిరుద్యోగ భృతి కింద డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తోంది. రాజకీయ పరమైన సంస్కరణల విషయంలో అబ్దుల్లా కొద్దిపాటి మార్పులు చేశాడు. మహిళలు వాహనాలు నడపకూడదు కానీ మునిసిపల్‌ ఎన్నికలలో ఓటు వేయవచ్చు. ఆ బూతులపై నిఘా వుంటుందనుకోండి.  ఒక హద్దు వరకు మీడియా ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు. అలా అంటూనే హక్కుల ఉద్యమకారులను, రాజకీయ ఉద్యమకారులను జైళ్లలో పెట్టారు. ప్రభుత్వం పాటిస్తున్న మతఛాందసత్వాన్ని ప్రశ్నిస్తూ ఒక వెబ్‌సైట్‌ పెట్టినందుకు రయీఫ్‌ బద్వాయీ అనే సౌదీ పౌరుడికి వెయ్యి కొరడా దెబ్బల శిక్ష విధించారు. మహిళలకు మరిన్ని హక్కులు కావాలని కోరిన ఒక షియా మతస్తుడికి గత అక్టోబరులో స్పెషల్‌ కోర్టు 'రాజధిక్కారం' నేరంపై మరణశిక్ష విధించింది. అంతర్జాతీయంగా నిరసన వెలువడడంతో మరణశిక్షను తాత్కాలికంగా నిలిపి వుంచారు. సౌదీ అరేబియాలో రాజు మారవచ్చు కానీ రాజరికపు పోకడలు ఎక్కడకు పోతాయి? ప్రపంచ ప్రజాస్వామ్య పరిరక్షకులం, జీతం లేకుండా పోలీసు ఉద్యోగం చేస్తున్నాం అని చెప్పుకునే అమెరికా యిలాటివారికి వత్తాసు యిస్తూ వుంటుంది. దాని అండతో వీళ్లు ప్రజల హక్కులను కాలరాస్తూనే వుంటారు.

ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]