శివసేన పార్టీ వారి అధికార పత్రిక ''సామ్నా'' మే 1 నాటి సంపాదకీయంలో మహారాష్ట్రలోని గుజరాతీలపై విరుచుకు పడడం జరిగింది. ''ఇక్కడ నివసిస్తూ, దినదినం అభివృద్ధి చెందుతూన్న గుజరాతీలు స్థానిక నాయకులను పట్టించుకోకుండా గుజరాతీ కదాని మోదీకి జేజేలు పలుకుతున్నారు.'' అని. మూడు థాబ్దాల క్రితం శివసేన గుజరాతీలకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపి, వారి దుకాణాలను తగలబెట్టింది. మళ్లీ ఆ రోజులు తిరిగి వస్తాయేమోనని గుజరాతీలు భయపడ్డారు.
మే 1 నాటికి శివసేన-బిజెపిల మధ్య పొత్తు సరిగ్గా కుదరలేదు. ఎవరికి వారే ఎక్కువ సీట్లు అడుగుతున్నారు. పైగా శివసేనకు ప్రతిపక్షమైన ఎంఎన్‌ఎస్‌తో బిజెపి ఓ పక్కనుంచి బేరసారాలు ఆడుతోంది. ఈ సంపాదకీయం వెలువడగానే గుజరాతీలు, బిజెపి గొడవ పెట్టాయి. 'అది సామ్నా సంపాదకుడి అభిప్రాయం తప్ప, పార్టీ సిద్ధాంతం కాదు' అని ఉద్ధవ్ ఠాకరే వివరణ యిచ్చారు. చివరకు పొత్తు కుదిరింది. ఎన్నికలలో యిద్దరూ లాభపడ్డారు. ముంబాయిలో శివసేన ఆశ్చర్యకరంగా మూడు సీట్లు గెలుచుకుంది.
లెక్కలేసి చూస్తే ఓటర్లలో 18% మంది గుజరాతీలే అని తేలింది. ఇక శివసేన రిపేరు పని మొదలుపెట్టింది. గుజరాతీలు ప్రధానంగా వున్న ప్రాంతాలలో శివసైనికులు యిల్లిల్లూ తిరిగి తమ పార్టీని గెలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతారట, 'సామ్నా' సంపాదకీయానికి క్షమాపణ చెప్తారట. ఇంత పశ్చాత్తాపం దేనికంటె అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడైతే మోదీని ప్రధాని చేయడానికి ఓట్లేసి వుండవచ్చు, అప్పుడు ఆ అంశం వుండదు కదా, అదీ భయం!
-ఎమ్బీయస్ ప్రసాద్