ఎమ్బీయస్‌: స్పార్టకస్‌ – 1/5

రోమ్‌ సామ్రాజ్యపు బానిసల చరిత్ర గురించిన హోవర్డ్‌ ఫాస్ట్‌ రాసిన 'స్పార్టకస్‌' నవల ముద్రణ 1951 లో జరిగింది. నవల ఇంగ్లీషులో రాసినా కథాకాలం క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దం. కథాస్థలం రోమ్‌. క్రీ.పూ. 73-71లలో…

రోమ్‌ సామ్రాజ్యపు బానిసల చరిత్ర గురించిన హోవర్డ్‌ ఫాస్ట్‌ రాసిన 'స్పార్టకస్‌' నవల ముద్రణ 1951 లో జరిగింది. నవల ఇంగ్లీషులో రాసినా కథాకాలం క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దం. కథాస్థలం రోమ్‌. క్రీ.పూ. 73-71లలో రోమ్‌లో బానిసల తిరుగుబాటు జరిగింది. దాన్ని ఆధారం చేసుకుని ఆ యా పాత్రలతోనే ఓ నవల రాశారు హోవర్డ్‌ ఫాస్ట్‌. అంటే హిస్టారికల్‌ ఫిక్షన్‌ అన్నమాట. ఫాస్ట్‌ అమెరికన్‌ రచయిత. వామపక్ష భావాలు కలవాడు. ఈ నవల చాలా ప్రజాదరణ పొందింది. 1955లో ఆకెళ్ల కృష్ణమూర్తి అనే ఆయన తెలుగులోకి అనువదించారు. ప్రథమ ముద్రణ కాపీలన్నీ చెల్లిపోయాక హైదరాబాద్‌ బుక్‌ ట్రస్టువాళ్లు 1981 లో రెండో ముద్రణ వేశారు. 

ప్రాచీన రోమ్‌లో బానిసల తిరుగుబాటు జరిగింది. దానికి స్పార్టకస్‌ అనేవాడు నాయకత్వం వహించాడు. మూడు, నాలుగేళ్లపాటు రోమన్‌ సామ్రాజ్యాన్ని గడగడ లాడించేడు. కానీ రోమన్‌ సేనాని క్రాసస్‌ నాయకత్వంలో రోమన్‌ సైనికులు స్పార్టకస్‌ను, అతని అనుచరులను తుదముట్టించారు. స్పార్టకస్‌ను ముక్కలు ముక్కలుగా కోసేశారు. అతనికి మద్దతు నిచ్చిన బానిసల్లో సజీవంగా దొరికిన ఆరువేల పై చిలుకుమందిని సజీవంగా కొరత వేశారు. ఏసుక్రీస్తును వేసినట్టు శిలువ వేశారు. చెక్క క్రాసుమీద ఎక్కించి చేతుల్లో, కాళ్లల్లో మేకులు కొట్టి తిండి, నీళ్లు యివ్వకుండా మాడ్చి చంపారు. 

అప్పట్లో రోమన్‌ నీతి అటువంటిది. రోమ్‌లో నాగరికత ఎంత అభివృద్ధి చెందిందో దానితో బాటు మానవ విలువల పతనం కూడా జరిగింది. రోమ్‌ యూరోప్‌నంతా జయించిన రోజులవి. విశాలమైన రోడ్లు నిర్మించి ప్రపంచంలో రోమ్‌ వంటి నగరం లేదని అనిపించుకున్న రోజులవి. రోమన్‌ సైన్యమంటే పక్కదేశాలు గడగడ వణికిన రోజులవి. రోమన్‌ రాజ్యం భోగభాగ్యాలతో, సిరిసంపదలతో తులతూగిన రోజులవి. అంత భాగ్యం వుంటే ఖచ్చితంగా మదం ఎక్కుతుంది. సమాజం భ్రష్టు పట్టిపోతుంది. సామాజిక నీతి, మానవ విలువలు మంట గలుస్తాయి. అహంభావం తలకెక్కుతుంది. అందుకే తిరుగుబాటు చేసిన బానిసలకు అటువంటి కఠిన శిక్ష! చిత్రం ఏమిటంటే ఈ శిలువ శిక్ష చూడడానికి జనాలు తండోపతండాలుగా వచ్చేవారు. ఆడవాళ్లు కూడా అదో వేడుకగా చూసేవారు. అలా వేడుకగా చూడవచ్చిన ఓ కులీన కుటుంబం తో కథ ప్రారంభమవుతుంది. 

రోమ్‌ నగరంలో వుండే కైయస్‌ అనే యువకుడు తన చెల్లి హెలీనాతో, ఆమె స్నేహితురాలితో కలిసి కేపువా నగరానికి ప్రయాణం కట్టాడు. ఈ కేపువా నగరంలోనే స్పార్టకస్‌ విప్లవం పురుడు పోసుకున్నది! అప్పటికి విప్లవం ముగిసి పోయింది. ఆ స్పార్టకస్‌ గురించి కబుర్లు విందామని వీళ్లు ఉబుసుపోకకు బయలుదేరారు. రోమ్‌ నుండి కేపువాకు మంచి రహదారి వుంది. ఆ రోడ్డంతా ఈ బానిసల శవాలే! మొత్తం 6,472 శిలువలు. వాటిపై శవాలు చచ్చేకంపు కొడుతున్నాయి. అయినా ఈ ఆడాళ్లు అత్తర్లు చల్లుకుంటూ అవన్నీ వింతగా చూస్తూ, స్పార్టకస్‌ శవం యిదేనా? యిదేనా? అని అడుగుతూ ముందుకు వెళ్లారు.

కేపువాకు వెళ్లే దారిలోనే కైయస్‌్‌ మేనమామ భవంతి వుంది. అతనో జమీందారు. వడ్డీ వ్యాపారంలో బాగా ఆర్జించాడు. ఆ భవంతిని సలేరియా భవనం అంటారు. వీళ్లు అక్కడ విశ్రమించారు. ఆయన చాలా డబ్బున్నవాడు. అక్కడకు స్పార్టకస్‌ను ఓడించిన సేనాని క్రాసస్‌ వచ్చాడు. అతనితో బాటు ఇద్దరు రాజకీయవేత్తలు – వాళ్ల పేర్లు సిసిరో, గ్రాఛూస్‌ –  కూడా వచ్చారు. సిసిరోకి ముప్ఫయి రెండేళ్లుంటాయి. పద్ధెనిమిదో యేట ప్లీడరయ్యాడు. ఓ చిన్న దాడిలో పాల్గొని గౌరవాన్ని సంపాదించుకుని, ప్రభుత్వ పరిపాలనా శాఖలో ఉన్నతోద్యోగాన్ని సంపాదించుకున్నాడు. వేదాంతం లాటి విషయాలపై వ్యాసాలు రాశాడు. బానిసల యుద్ధాన్ని సమీక్షించి ఉపన్యాసాలు యివ్వడంలో దిట్ట. మహా స్వార్థపరుడు. కొత్త రకం సిద్ధాంతాలు వల్లిస్తూ ప్రజల్ని ఆకట్టుకుంటూ ఎదిగిన సెనేటర్‌. కానీ  ఆ సిద్ధాంతాలన్నీ అతని స్వార్థానికే ఉపయోగపడతాయి. గ్రాఛూస్‌ బానిస వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించి సెనేటర్‌ అయిన పెద్దమనిషి. వృద్ధుడు. బానిసలను కొరత వేయించే బిల్లుకి సైద్ధాంతిక బలం చేకూర్చి తయారు చేసినది సిసిరో కాగా దాన్ని పాస్‌ చేయించినది సెనేటర్‌ గ్రాఛూస్‌. అమలు చేయించినది క్రాసస్‌. ఇలా బానిసలను అణచడంలో ముగ్గురికీ పాత్ర వుంది.

చెప్పానుగా ఆ కాలంలో భోగభాగ్యాలతో రోమన్లు బాగా మదించి వున్నారని. కైయస్‌ అంటే అతని మేనమామ భార్య పడిఛస్తుంది. తన కోరిక తీర్చమని అతని వెంట పడుతుంది. అతనేమో ఈ సేనాని క్రాసస్‌ అంటే పడిఛస్తాడు. స్వలింగ సంపర్కం కూడా అప్పట్లో సాధారణమేమో! ఇక కైయస్‌ చెల్లెలు రాజకీయ వేత్త సిసిరో వద్దకు తనంతట తానుగా వెళ్లి కోరిక తీర్చుకుంటుంది. మేనకోడలి స్నేహితురాలిని ఎలాగైనా అనుభవిద్దామని కైయస్‌ మేనమామ ప్రయత్నాలు చేస్తూంటాడు. అతని భార్యను అనుభవిద్దామని రాజకీయ నాయకుడు గ్రాఛెస్‌ చూస్తూంటాడు. ఇదీ వీళ్ల వరస! 

ఈ పెద్ద (!) మనుష్యులు వాళ్ల భ్రష్టాచార పద్ధతుల్లో బతుకుతూనే వీళ్లు స్పార్టకస్‌ లేవనెత్తిన విప్లవం మంచి చెడ్డల గురించి తర్కించారు. స్పార్టకస్‌ గురించి తమకు తెలిసినవి, తమ అనుభవాలు ఒకరి కొకరు చెప్పుకున్నారు. అతని గతాన్ని తవ్వారు. మధ్యమధ్యలో కథ యిలా కాస్సేపు వర్తమానంలో, కాస్సేపు గతంలో నడుస్తూ వుంటుంది. మధ్యమధ్యలో ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళుతూ కథ చెప్పడం కష్టం కాబట్టి నేను కథ సీదాగా చెప్పుకుపోతాను. పుస్తకం చదివితేనే కథనం గొప్పతనం ఆస్వాదించగలరు.

అప్పట్లో రోమ్‌లో బానిస వ్యవస్థ వుండేది. బానిస అనగానే మన కళ్లముందు ఆఫ్రికావాళ్లే కడతారు కదూ. అప్పట్లో అలా ఏమీ లేదు. మనదేశంలో కూడా బానిసలు వుండేవారు కదా. అందరూ ఆఫ్రికానుండి వచ్చినవారేనా? అబ్బే. జరిగేదేమిటంటే పల్లెల్లో వాళ్ల మటుకు వాళ్లు బతుకుతున్నవాళ్ల మీద బలవంతులు దాడి చేసి బందీగా చేసి బానిస వర్తకులకు అమ్మేసేవారు. వాళ్లు ఈ బానిసలను వేలంలో వర్తకులకు అమ్మేసేవారు. వాళ్లకు గుప్పెడు అన్నం పెట్టి గొడ్డుచాకిరీ చేయించేవారు. అన్ని విధాలా – లైంగికపరంగా కూడా – దోపిడీ చేసేవారు. 

రోమ్‌ సామ్రాజ్యం ఈ బానిసల చెమటతోనే నిర్మించబడింది. అదే వాళ్లకు వీక్‌ పాయింట్‌ కూడా అయింది. ఉదాహరణకి వీళ్లు బస చేసిన సలేరియా భవనమే వుందనుకోండి. దాని కింద పదివేల ఎకరాలున్నాయి. పూర్వం ఆ భూమి మీద ఆధారపడి పదిహేనువేల జనం బ్రతికేవారు. కైయస్‌ మేనమామ వడ్డీ వ్యాపారం ధర్మమాని రైతులు పొలాలు ఆయనకు అమ్ముకుని పోయారు. ఇప్పుడు వాళ్లు రోమన్‌ రోడ్లమీద ఎందుకూ కొరగాకుండా తిరుగుతున్నారు. వాళ్ల స్థానంలో పనివాళ్లను పెట్టుకున్నాడీయన. కానీ పనివాళ్లకు జీతాలివ్వాలి, పనిగంటలు పాటించాలి. దాని బదులు బానిసను పెట్టుకుంటే? ఇరవై నాలుగు గంటలూ పనిచేయించవచ్చు. ఒక్కసారి పెట్టుబడి పెట్టి కొనుక్కుంటే చాలు, జీతాలివ్వనక్కరలేదు. నచ్చకపోతే చంపి పారేసినా అడిగేవాడు లేడు.

అందువల్ల బానిసలకు గిరాకీ హెచ్చింది. ఎక్కడెక్కడినుంచో బానిసలను తెచ్చేవారు. ఈజిప్టులో బంగారు వర్తకులు కూడా బానిసల కోసం వెతికేవారు. నైల్‌ నదికి పైగా వెళితే యెడారి మధ్యలో నల్ల పర్వతశ్రేణుల్లో బంగారు గనులున్నాయి. గోడలను రాగి, యినుము పనిముట్లతో తరాల తరబడి గోకితే బంగారం వస్తుంది. కానీ అలా గోకడం సామాన్యం కాదు. మామూలు పనివాడయితే పారిపోతాడు. బానిసలను తెద్దామన్నా మామూలు రకం బానిసయితే యిక్కడి పరిస్థితులు తట్టుకోలేక ఛస్తాడు. అందువల్ల తరతరాలుగా బానిసలుగా వున్నవాళ్లే పనికి వస్తారు.  వేడినీ, ధూళినీ, శారీరక వికారాలను తట్టుకుని రాతి లోలోతులలోకి మెలికలు తిరుగుతూ పోయే బంగారపు నాళాలను త్రవ్వి తీయగలగడానికి వాళ్లు థ్రేస్‌ నుండి మనుష్యులను కొని తెచ్చేవారు. థ్రేస్‌ అంటే ఇప్పటి బల్గేరియా అన్నమాట. 

క్రమంగా ఈజిప్టు వర్తకులు క్షీణించారు. రోమన్‌ వర్తకులు ఆ గనుల వ్యాపారాన్ని చేపట్టారు. వాళ్లూ ఈజిప్టు వాళ్లలాగానే థ్రేస్‌లో గ్రామాల మీద పడి బలిమితో అక్కడి మనుష్యులను వశపరచుకుని బానిసలుగా చేసి బంగారు గనుల్లో పనిచేయించేవారు. ఒంటిమీద బట్ట లేకుండా,  మెడకు ఓ రింగు వేసి దానికి గొలుసు కట్టి, పిడికెడు గోధుమ గింజలిచ్చి ఓ సీసా మంచినీళ్లిచ్చి పని చేయించేవారు. ఈ బానిసల్లో కొంతమంది నల్లవాళ్లు, మరి కొంతమంది తెల్లవాళ్లు. ఎవళ్లయినా వాళ్ల కొకటే! గుహల్లోనే వుండాలి. అక్కడ దుర్గంధం. ఇవి భరించలేక ఎవడైనా పనిచేయలేకపోతే  వాణ్ని బయటకు తోలేస్తారు. అక్కణ్నుంచి ఆ న్యూబియా ఎడారి దాటేలోగా వాడు చచ్చేపోతాడు.

ఇటువంటి గనుల్లోకి స్పార్టకస్‌ను తెచ్చారు. అప్పటికి అతని వయసు 23. మరో 122 మందితో కలిసి అతన్ని గనుల్లోకి తెచ్చారు. స్పార్టకస్‌ ఓ 'కోరూ'. అంటే మూడు తరాల బానిస అని అర్థం. స్పార్టకస్‌ పొడుగయిన మనిషి కాడు, నల్లగా ఉంగరాలు తిరిగిన జుట్టు. గోధుమరంగు కళ్లు. అతని ముక్కు ఓ మేస్త్రీ పచ్చడి చేశాడు. అందువల్ల అతని మొఖం గొఱ్ఱె ముఖంలా తయారయింది. కానీ అందమైన వ్యక్తే. అతనిది కూడా థ్రేస్‌యే! మితభాషి. అతని మాటను థ్రేసియన్లు అందరూ మన్నించేవారు.     

కేపువాలో బేటియాటస్‌ అనే ఓ వర్తకుడు వుండేవాడు. అతను మొదట్లో గూండాముఠాలను నిర్వహించేవాడు. ఓ శుభముహూర్తాన మల్ల కేంద్రం ప్రారంభించి మల్లయుద్ధాలను నిర్వహించడం మొదలుపెట్టాడు.అప్పటిదాకా మల్లయుద్ధం అంటే మామూలు కుస్తీ పోటీల్లా వుండేవి. లేదా కవచాలు, డాళ్లు, స్పానిష్‌ కత్తులతో పోట్లాడడాలు వుండేవి. రక్తాలు కారేవరకూ ఎవరూ పోట్లాడేవారు కారు. కానీ ఈ బేటియాటస్‌ దాని పద్ధతి మార్చేశాడు. మల్లులచేత బట్టలిప్పించి పోట్లాడించేవాడు. కవచాలు లేవు, డాళ్లు లేవు. రక్తం ఓడుతుంది. ఒక్కోప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు చచ్చేదాకా మల్లయుద్ధం కొనసాగవలసినదే అనే షరతుమీద జరిపించేవాడు. రోమన్లు వాటిని వేలంవెర్రిగా చూసేవారు. ఎందుకంటే అవి ఉత్తుత్తి యుద్ధాలు కావు. ఎవడో ఒకడు తమ కళ్ల ముందు చావడం ఖాయం అన్న ఊహ వాళ్లను మత్తెక్కించేది. అంత క్రూరులు వాళ్లు. అయితే ఈ రోమన్లకు వినోదం కలిగించడానికి బానిసలు ప్రాణాలకు తెగించి ఎందుకు పోట్లాడాలి? ఓ బానిసకు కట్లు విప్పి ఆయుధాన్ని చేతికి యివ్వడంతో వాడు ఆ కాస్సేపు స్వతంత్రుడు అయినట్టు వూహించుకునేవాడు. ప్రాణాలకు తెగించి పోట్లాడేవాడు. రక్తాన్ని ఓడ్చేవాడు. చూసేవాళ్లకు అది హుషారు కలిగించేది.(సశేషం) (ఫోటో – గ్లాడియేటర్ల యుద్ధాలు జరిగే రోమ్‌లోని కలోజియం, ప్రస్తుతరూపం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2016) 

[email protected]