ఎమ్బీయస్‌ : తమిళ రాజకీయాలు- 47

రాష్ట్రంలో స్కూలుకి వెళ్లవలసిన పిల్లల్లో సగం మందే స్కూలుకి వెళుతున్నట్లు, స్కూలుకి వచ్చినవాళ్లు కూడా ఐదేళ్లు కూడా కొనసాగకుండా మానేస్తున్నట్లు రాజాజీ ప్రభుత్వం గమనించింది. తక్కినవాళ్లను స్కూళ్లకు తీసుకుని వద్దామన్నా, వచ్చినవాళ్లు కొనసాగేట్లు చూద్దామన్నా…

రాష్ట్రంలో స్కూలుకి వెళ్లవలసిన పిల్లల్లో సగం మందే స్కూలుకి వెళుతున్నట్లు, స్కూలుకి వచ్చినవాళ్లు కూడా ఐదేళ్లు కూడా కొనసాగకుండా మానేస్తున్నట్లు రాజాజీ ప్రభుత్వం గమనించింది. తక్కినవాళ్లను స్కూళ్లకు తీసుకుని వద్దామన్నా, వచ్చినవాళ్లు కొనసాగేట్లు చూద్దామన్నా చాలినన్ని స్కూళ్లు లేవు. అందువలన స్కూళ్ల కెపాసిటీ రెట్టింపు చేయడానికి స్కూళ్లను ఒంటిపూట బళ్లగా మారుద్దామనుకున్నారు. అలా చేస్తే రెండు గంటల కాలం మిగిలిపోతుంది. ఆ సమయాన్ని పిల్లలకు తమ కుటుంబవృత్తిలో తర్ఫీదు యివ్వడానికి వినియోగిద్దామనుకున్నారు. ఎందుకంటే స్కూలు మానేయడానికి ముఖ్యకారణం, కొన్నాళ్లు బడికి పంపాక తలిదండ్రులు పిల్లల్ని కులవృత్తిలో పెట్టడానికి బడి మాన్పిస్తున్నారు. ఈ పిల్లలకు అటు చదువూ రాక, యిటు కులవృత్తీ రాక రెండిటికీ చెడుతున్నారు. గాంధీజీ ప్రతిపాదించిన బేసిక్‌ ఎడ్యుకేషన్‌లో కూడా వడ్రంగం, కుమ్మరం, కమ్మరం నేర్పాలనే వుంది. అది కులవృత్తి అయినా కాకపోయినా విద్యాభ్యాసం అనంతరం ఉద్యోగాలకు ఎగబడనవసరం లేకుండా స్వతంత్రంగా బతకడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆలోచనను పదిమందితో చర్చించి, సరైన రీతిలో ప్రజలకు నచ్చచెప్పి వుంటే ఆమోదించబడేదేమో, కానీ రాజాజీ చాలా మూర్ఖంగా విద్యామంత్రితో కానీ, ఎమ్మెల్యేలతో కానీ సంప్రదించకుండా హఠాత్తుగా 1953 జూన్‌లో చట్టం చేసి పారేశాడు. అదేమిటని ప్రశ్నిస్తే ''ఆదిశంకరుడు, రామానుజుడు అందరితో చర్చించి తమ సిద్ధాంతాలను ప్రతిపాదించారా?'' అని ఎదురు ప్రశ్నించాడు. ఈ మూర్ఖత్వమే రాజాజీ పదవికి మంగళం పాడింది.

రాజాజీ విద్యావిధానం కులవ్యవస్థ ఆధారంగా రూపొందించినదని పెరియార్‌, అణ్నా ఆరోపించారు. కమ్యూనిస్టులు కూడా వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడితే అది ఒక్క ఓటు తేడాతో ఓడిపోయింది. కమ్యూనిస్టు నాయకుడు పి.రామమూర్తి పార్టీ ఆదేశాల మేరకు కశ్మీర్‌ నాయకుడు షేక్‌ అబ్దుల్లాను కలవడానికి వెళ్లడం వలన అసెంబ్లీకి గైరు హాజరయ్యాడు. సాటి బ్రాహ్మణుడైన రాజాజీ పరువు కాపాడడానికే రామమూర్తి యిలా చేశాడని కరుణానిధి, యితర డిఎంకె నాయకులు రామమూర్తిని దుమ్మెత్తి పోశారు. తీర్మానం నెగ్గినా డిఎంకె చేపట్టిన ఆందోళనకు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో కాంగ్రెసులోనే రాజాజీని విమర్శించసాగారు. ఈ పరిస్థితుల్లో రాజాజీ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది. 1956 ఏప్రిల్‌లో అతని స్థానంలో వచ్చిన కామరాజ్‌ యీ వివాదాస్పద చట్టాన్ని ఉపసంహరించాడు. రాజాజీని తిట్టడం డిఎంకెకు మహా సులభం. ఎందుకంటే ఆయన బ్రాహ్మడు. కానీ కామరాజ్‌ నాడార్‌ కులస్తుడు. అతి పేద కుటుంబం నుంచి వచ్చాడు. బ్రహ్మచారి. అతి సాధారణ జీవితాన్ని గడిపాడు. అందరితో అతి సులభంగా కలిసిపోగలడు. వెనుకబడిన వర్గాల, ఆది ద్రావిడ కులాల వారిని కాంగ్రెసు పార్టీలోకి తీసుకువచ్చిన ప్రతిభాశాలి. తమిళం తప్ప వేరే భాష రాదు. వెనుకబడిన తరగతుల ప్రతినిథిగా ఎదుగుతున్న డిఎంకెకు అదే వర్గానికి చెందిన ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పోరాడడం కష్టతరమైన పనే. 

పైగా కామరాజ్‌ పరిపాలనాదక్షుడు. సి.సుబ్రహ్మణ్యం, భక్తవత్సలం వంటి సమర్థులైనవారిని మంత్రులుగా పెట్టుకుని అనేక సంక్షేమ, ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టాడు. గ్రామీణప్రాంతాలలో విద్యుత్‌ సౌకర్యం కల్పించాలనే మహోద్దేశంతో దాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. దేశం మొత్తం మీద విద్యుత్‌ సరఫరా వున్న గ్రామాలు 54,700 వుంటే, 1968 నాటికి తమిళనాడులోనే 22 వేల గ్రామాలకు ఆ సౌకర్యం వుంది. దానివలన అక్కడ కూడా పరిశ్రమలు వస్తాయని ఆశించారు. అయితే పల్లెటూళ్లో కరంటు రాగానే రైసు మిల్లులు పెట్టడానికి అప్లికేషన్లు రాలేదు. సినిమా థియేటర్లు పెట్టడానికి అప్లికేషన్లు వచ్చాయి. ఆ విధంగా అప్పటిదాకా పట్టణాలకే పరిమితమైన సినిమా ప్రభావం పల్లెటూళ్లలో కూడా విస్తరించింది. సినిమా అనగానే ఎమ్జీయార్‌ మ్యాజిక్‌, డిఎంకె సిద్ధాంతాల వ్యాప్తి అనే అర్థం చేసుకోవాలి. ఆ విధంగా 13 ఏళ్లలో 1967 నాటికి డిఎంకె అధికారంలోకి వచ్చేసింది. కామరాజ్‌ పాలన గురించి 25 వ భాగంలో రాసినది మళ్లీ గుర్తుకు తెచ్చుకోవచ్చు – కామరాజ్‌ రాజకీయాలతో వ్యతిరేకించేవారు సైతం ఆయన పాలనను మెచ్చుకుంటారు. ముఖ్యంగా విద్య విషయంలో ఆయన చేసినది యింతా అంతా కాదు. రాజాజీ పెట్టిన విద్యావిధానాన్ని ఎత్తేసి, డబ్బులేదంటూ ఆయన మూసేసిన 6 వేల స్కూళ్లను మళ్లీ తెరిచారు. 12 వేల స్కూళ్లు కొత్తగా తెరిచారు. ఏ గ్రామంలోని విద్యార్థి ఐనా సరే, బడికోసం మూడు మైళ్లకు మించి వెళ్లనక్కరలేని విధంగా స్కూళ్లు పెట్టించారు. ఇంచుమించు ప్రతీ గ్రామంలోనూ ఓ ప్రాథమిక పాఠశాల వెలిసింది. ప్రతీ పంచాయితీలోనూ ఓ హై స్కూలు. 11 వ తరగతి వరకు నిర్బంధ, ఉచిత విద్య ప్రవేశపెట్టారు. అంతేకాదు, పేద విద్యార్థులకు మధ్యాహ్నభోజన పథకం పెట్టినది ఆయనే. ప్రపంచంలోనే తొలిసారి ఆ పథకం రూపుదిద్దినది కామరాజే. 

స్కూలులో కులాల తేడా, అంతస్తుల తెలియకుండా వుండడానికి యూనిఫాం ప్రవేశపెట్టారు. వాటిని వుచితంగా యిచ్చారు. బ్రిటిషు హయాంలో తమిళనాడులో అక్షరాస్యత 7% మాత్రమే. కామరాజు హయాంలో అది 37%కి చేరుకుంది. రాజాజీ పాలించినప్పుడు 12 వేల స్కూళ్లు వుంటే కామరాజు పాలనలో అవి 27 వేలు అయ్యాయి. 1951లో విద్యార్థుల సంఖ్య 18.52 లక్షలుంటే 1966 నాటికి అది 50 లక్షలకు పెరిగింది. స్కూళ్ల సంఖ్య పెంచడమే కాదు, వాటిలో బోధనాస్థాయి కూడా పెంచడం జరిగింది. స్కూళ్లు పనిచేసే రోజులను ఏడాదికి 180 నుండి 200కు పెంచారు. సిలబస్‌ను కూడా తీర్చిదిద్దారు. ఈయన హయాంలోనే 1959లో మద్రాసుకి ఐఐటి వచ్చింది. పెద్దగా చదువుకోని కామరాజ్‌ విద్యాబోధనకు ఎంతో కృషి చేసి చదువుకు ప్రతీకగా నిలిచారు. మద్రాసులోని మెరీనా బీచ్‌లో బడి కెళ్లే పిల్లలతో వున్న ఆయన విగ్రహం చూస్తే ఆ విషయం తెలుస్తుంది. వ్యవసాయం విషయంలో కూడా కామరాజ్‌ ఎంతో చేశారు. 12 మేజర్‌, మైనర్‌ ఇరిగేషన్‌ స్కీములు ఆయన పాలనలోనే రూపుదిద్దుకున్నాయి. 1951-66 మధ్య విద్యుత్‌ పంపుల సంఖ్య 14,373 నుండి 2,60,000కు పెరిగాయి. మణిముతార్‌, వైగై, అలియార్‌, సాతనూర్‌, కృష్ణగిరి, పాపనాశం, భవానీసాగర్‌, అమరావతి, మలమ్‌పుళా, మెట్టూరు డాములు కూడా అప్పుడే కట్టారు. రైతులకు 25% సబ్సిడీతో దీర్ఘకాలిక రుణాలు యిచ్చారు. ఆయన హయాంలో కోటిన్నర ఎకరాల భూములు సాగులో వుండేవి. వాటిలో మూడోవంతు వాటికి శాశ్వతంగా నీటి సౌకర్యం వుండేది. 

ఇక పారిశ్రామిక ప్రగతి మాట చెప్పనే అక్కరలేదు. పెరంబూరులో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, మెట్టూరులో పేపర్‌ పరిశ్రమ, నైవేలిలో లిగ్నయిట్‌ కార్పోరేషన్‌, తిరుచ్చిలో బిఎచ్‌ఇఎల్‌, నీలగిరిలో ఫోటో ఫిల్మ్‌ పరిశ్రమ, గిండీలో  పారిశ్రామిక వాడ, సర్జికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, చక్కెర ఫ్యాక్టరీలు, సిమెంట్‌ ఫ్యాక్టరీలు.. ఇలా ఎన్నో వచ్చిపడ్డాయి. విద్యుత్‌ ఉత్పాదన ఎంతో పెరిగింది. కేంద్రంలో వున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులలో కామరాజ్‌కు బాగా పలుకుబడి వుండేది. కామరాజ్‌ పాలనలో అవినీతి వుండేది కాదంటారు. కేంద్రంలో తమిళ అధికారులు, రాష్ట్రంలో సి.సుబ్రహ్మణ్యం వంటి నిజాయితీపరుడు, సమర్థుడు అయిన పరిశ్రమల మంత్రిగా వుండడంతో మద్రాసు రాష్ట్రం పారిశ్రామికంగా ఎంతో ఎదిగిపోయింది. గ్రామీణ విద్యుత్‌ పథకం ద్వారా అనేక గ్రామాలకు విద్యుత్‌ అందించారు. కామరాజ్‌ పాలన అంటే తమిళులకు స్వర్ణయుగం వంటిది. అందుకే తమిళనాడులో కాంగ్రెస్‌వాళ్లు ప్రతీసారి తమ మ్యానిఫెస్టోలో కామరాజు పాలనను తిరిగి తెస్తామని ప్రతిజ్ఞలు చేస్తూ వుంటారు. (సశేషం) 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2015)

[email protected]

Click Here For Archives