ఉందనే అంటోంది సిఐఏ. అవునవునంటూ వంత పాడుతోంది అమెరికన్ మీడియా. ౖటంప్ ఓడిపోవడం తథ్యమనీ, హిల్లరీ గెలుపు దేశానికి అత్యావశ్యకమని నమ్మి ఆ విధంగా ప్రచారం చేసిన మీడియా అతని గెలుపును హరాయించుకోలేక పోతోంది.
పుతిన్ వ్యక్తిగత ఆదేశాల మేరకు రష్యన్ హాకర్లు డెమోక్రాటిక్ పార్టీ నాయకుల ఈ-మెయిళ్లు హ్యాక్ చేసి, వికీలీక్స్‌కు ద్వారా బహిరంగ పరచి, ట్రంప్ విజయానికి సాయపడ్డారని వాళ్లు కథనాలు రాస్తున్నారు.
సైబర్ ఎటాక్స్ చేయడం రష్యాకు, అమెరికాకు కొత్త కాదు. విదేశాల్లో ఎన్నికల ఫలితాలు ప్రభావితం చేయడానికి అమెరికా గతంలో హ్యేకింగ్ బాట పట్టింది. అలాగే రష్యా కూడా ఉక్రెయిన్‌లో, యూరోప్‌లోని కొన్ని దేశాల్లో యీ ఆయధాన్ని ప్రయోగించి చూసింది. ఇది కనబడని, ప్రయోగించాక కూడా కనిపెట్టలేని ఆయుధం, పైగా చవకైనది. అయితే యీ ఆయుధాన్ని పుతిన్ అమెరికాపై ప్రయోగించడానికి కారణం? అతనికి హిల్లరీపై వ్యక్తిగతమైన కక్ష అంటున్నారు.
ఆమె స్టేట్ సెక్రటరీ పదవిలో వున్నపుడు 2011 రష్యాలో ఎన్నికలు జరిగి పుతిన్ నెగ్గాడు. అవి సక్రమంగా జరగలేదని ఆమె బహిరంగంగా వ్యాఖ్యానించి అతనికి వ్యతిరేకంగా రష్యా వీధుల్లో ప్రదర్శనలకు కారకురాలైంది. అందువలన పుతిన్ ఆమెకు బుద్ధి చెప్పదలచాడు. అది కాకుండా ఇంకో కారణం ఏమిటంటే – ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని గొప్పలు చెప్పుకునే అమెరికన్ మేడిపండు పొట్ట విప్పి చూస్తే ఎలా వుంటుందో లోకానికి చూపదలచాడు.
అమెరికన్ మీడియా కానీ, సిఐఏ కానీ, ఒబామా ప్రభుత్వం కానీ రష్యా డెమోక్రాటిక్ పార్టీ తాలూకు రహస్య సంభాషణలు దొంగిలించి, తమ ముసుగులు లాగేసిందని వాపోతున్నారు కానీ రష్యా అబద్ధాలు సృష్టించిందని ఒక్కరూ అనలేదు. ఇప్పుడు సిఐఏ ప్రతీకారం తీర్చుకోవడానికి హ్యాకర్లను నియమించి పుతిన్ వ్యక్తిగత ఐశ్వర్యం తాలూకు వివరాలు బయటకు లాగుతారట. శుభం.
రష్యన్ హ్యాకర్లు యిలా అధికార పార్టీ నాయకుల ఈ మెయిళ్లు హ్యాక్ చేసేస్తూ వుంటే అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశపు ప్రభుత్వం కనుక్కోలేక పోయిందా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. '
'న్యూయార్క్ టైమ్స్'' దానిపై కథనం వేసింది. దాని ప్రకారం – డెమోక్రాటిక్ నేషనల్ కమిటీ (డిఎన్‌సి) ఆఫీసుకి టెక్నికల్ సపోర్టు అందించే కాంట్రాక్టరు యారేడ్ టామేన్ అనే అతనికి సైబర్ ఎటాక్స్‌లో అనుభవం తక్కువ. 2015 సెప్టెంబరులో ఎఫ్‌బిఐ స్పెషల్ ఏజంట్ ఎడ్రాయిన్ హాకిన్స్ అనే అతను ఫోన్ చేసి ''మీ కంప్యూటర్ సిస్టమ్స్‌లో కనీసం ఒకటైనా హ్యాకింగ్‌కు గురవుతోంది. రష్యాతో సంబంధాలున్న ''ద డ్యూక్స్'' అనే కోడ్ పేరుతో పనిచేసే హ్యాకర్ల బృందం అన్‌క్లాసిఫైడ్ ఈ మెయిల్స్‌ను చదివేస్తోంది. జాగ్రత్త పడండి.'' అని చెప్పాడు.
ఈ హెచ్చరికను ఎంత సీరియస్‌గా తీసుకోవాలో టామేన్‌కు అర్థం కాలేదు. ఏదో ఆకతాయి కాల్ చేసి ఉత్తుత్తినే హడలగొడుతున్నాడేమో అనుకున్నాడు. ఎందుకంటే ఆ ఎఫ్‌బిఐ ఏజంటుతో అతనికి పరిచయం లేదు. అయినా ఎందుకైనా మంచిదని గూగుల్‌లో ''ద డ్యూక్స్'' కోసం సెర్చ్ చేశాడు. అక్కడ వున్న కొన్ని హెచ్చరికలను నోట్ చేసుకుని తమ కంప్యూటర్ సిస్టమ్‌లో వున్నాయేమో ఓ సారి చెక్ చేసుకుని వూరుకున్నాడు. ఆ తర్వాతి వారాల్లో కూడా ఏజంట్ హాకిన్స్ అప్పుడప్పుడు ఫోన్ చేసి హెచ్చరిస్తూనే వున్నా, ఇతను పెద్దగా వర్రీ కాలేదు. ఆ హ్యాకర్లు మన దగ్గరనుంచి ఏమైనా సమాచారం కోసం తాపత్రయ పడుతున్నారేమో అనుకుని వూరుకున్నాడు. ఆ విధంగా ఏడు నెలల పాటు హ్యాకర్లు వీరవిహారం చేయడానికి వీలు చిక్కింది.
ఆ తర్వాత వాళ్లు ఒక్కోటి బయటపెడుతూ వుంటే డిఎన్‌సి అధికారులు ఒక్కోరూ మేలుకోసాగారు. సైబర్ ఎక్స్‌పర్టులను పిలిపించి తమ సిస్టమ్స్‌కు రక్షణ కల్పించుకోసాగారు. ఆ పాటికి హ్యాకర్లు డిఎన్‌సి నుంచి తక్కిన డెమోక్రాటిక్ నాయకుల కంప్యూటర్లకు విస్తరించారు. హిల్లరీ తెలివితక్కువగా రహస్య సమాచారాన్ని కూడా అన్‌క్లాసిఫైడ్‌గా చూడడంతో కొంప మునిగింది.
ప్రయివేటు మెయిళ్లు, కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్లు కూడా రోజువారీ వికీలీక్స్‌లో దర్శనమియ్యసాగాయి. హిల్లరీ క్లింటన్ కాంపెయిన్ చైర్మన్ జాన్ పోడెస్తా ప్రయివేటు ఈ మెయిలు కూడా హ్యాక్ అయింది. హిల్లరీ ఈ మెయిళ్లు బహిర్గతం కావడంతో ఆమె యిమేజి మసకబారింది. తమపై నుంచి దృష్టి మరల్చడానికి ఆమె వర్గం ట్రంప్‌ను రష్యన్ ఏజంటు అనసాగింది.
నిజానికి గతంలో బిల్-హిల్లరీ క్లింటన్ ఫౌండేషన్‌కు రష్యన్ ప్రభుత్వ ఏజన్సీల నుండి విరాళాలు అందినందుకు విమర్శలు వచ్చాయి. కానీ యిప్పుడు ''ట్రంప్ రష్యాకు ఫేవరేట్'' అనే పల్లవి అందుకుంది హిల్లరీ క్యాంప్. ఆ ఈ మెయిళ్లపై విచారణ జరపడం, హిల్లరీకి క్లీన్‌చిట్ రావడం.. యివన్నీ గందరగోళంగా తయారై ఆమె రాజకీయంగా నిజాయితీపరురాలు కాదనే సందేశాన్ని ఓటర్లకు యిచ్చాయి. ఆమె ఓటమికి యిది ఒక ప్రధాన కారణమైంది.
ఇప్పుడు సిఐఏ కాంగ్రెస్‌కు ఒక నివేదిక సమర్పిస్తూ రష్యన్ ప్రభుత్వం ట్రంప్‌ను గెలిపించడానికే యిదంతా చేసిందని గట్టిగా వాదించింది. ఒబామా తక్షణమే విచారణకు ఆదేశించాడు. ట్రంప్ అధ్యక్ష పదవి అలంకరించే జనవరి 20 లోగా ఆ విచారణ ఫలితాలను బహిరంగ పర్చాలన్నాడు. సిఐఏ యిచ్చిన వివరణను రష్యా ప్రభుత్వమే కాదు, ట్రంప్ కూడా కొట్టి పారేశాడు.
''నన్ను గెలిపించడానికి వారిదంతా చేశారనడం అర్థరహితం. హ్యాక్ చేసిన వాళ్లు రష్యావాడు కావచ్చు, చైనావాడు కావచ్చు, న్యూజెర్సీలో కూర్చున్న అమెరికా వాడూ కావచ్చు.'' అన్నాడు. అతని వర్గం వారు యింకాస్త ముందుకు వెళ్లి ''వీళ్ల నివేదికలు యిలాగే అఘోరిస్తాయి. గతంలో సద్దాం హుస్సేన్ వద్ద మారణాయుధాలున్నాయని వీళ్లే రిపోర్టు యిచ్చారు. అదెంత నిజమో చూశాం.'' అని తీసిపారేశారు.
అయినా ట్రంప్‌కు, పుతిన్‌కు సత్సంబంధాలే వున్నాయని సాధారణ అమెరికన్ ప్రజలకే కాదు, రిపబ్లికన్ నాయకులకూ సందేహాలున్నాయి. ఎందుకంటే తన సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా ట్రంప్ నియమించిన ఎక్సాన్ మోబిల్ అధినేత రెక్స్ టిల్లర్‌సన్ పుతిన్‌కు ఆత్మీయుడు. విదేశీయులకు రష్యా యిచ్చే అత్యున్నత పురస్కారం – ఎవార్డ్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ – అందుకున్నవాడు. ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా రష్యాపై అమెరికా ఆర్థికపరమైన ఆంక్షలు విధించినపుడు తన కంపెనీకి బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లితే యిరు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొనాలని పిలుపు యిచ్చినవాడు. టిల్లర్‌సన్ నియామకం ద్వారా ట్రంప్ పుతిన్‌కు స్నేహహస్తం చాస్తున్నాడని పరిశీలకులు భావిస్తున్నారు. హిల్లరీ ఓటమి మాట ఎలా వున్నా ఎలాగోలా అమెరికా, రష్యా మధ్య కోల్డ్‌వార్ అంతమై ప్రపంచంలో శాంతి నెలకొంటే అంతే చాలు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2016)