ఫారిన్ సెక్రటరీగా పనిచేస్తూ సడన్‌గా పదవి పోగొట్టుకున్న సుజాతా సింగ్ తన స్టాఫ్ యిచ్చిన వీడ్కోలు సభలో మోదీపై, తన స్థానంలో వచ్చిన జయశంకర్‌పై విరుచుకుపడ్డారు. ఇండియన్ ఫారిన్ సర్వీసులో 38 ఏళ్ల సర్వీసు వున్న ఆమె ఏడాదిన్నర క్రితం ఆ పదవిలో నియమింపబడ్డారు. పదవీకాలం యింకా ఆర్నెల్లు వుండగానే మోదీ జనవరి 28 న ఆమెను సడన్‌గా తీసేసి, జయశంకర్‌ను వేశారు. సుజాతా చేసిన పొరపాటు ఏమిటో ఎవరూ ఏమీ చెప్పలేదు. ఈ రోజుల్లో ఏదీ కాగితంపై వుండడం లేదు. ట్వీట్‌లు, ఫేస్‌బుక్కులు, సోషల్ మీడియా ద్వారానే చెపుతున్నారు. కొన్ని రోజులుగా జయశంకర్‌ను ఆకాశానికి ఎత్తివేయడంతో కథ ప్రారంభమైంది. మోదీని అమెరికాకు ఆహ్వానించడానికి, రిపబ్లిక్ దినోత్సవ వేడుకలలో పాల్గొనడానికి ఒబామాను ఒప్పించడానికి, చైనాతో సరిహద్దు వివాదంలో ప్రస్తుత ఘర్షణవాతావరణం తగ్గడానికీ జయశంకర్ చేసిన ప్రయత్నాలే కారణమని కొందరు రాయసాగారు. ఆయన ఐఎఫ్‌ఎస్ నుండి మూడు రోజుల్లో రిటైర్ అవుతాడనగా సడన్‌గా తీసుకుని వచ్చి సుజాత స్థానంలో కూర్చోబెట్టారు. ఇది సహజంగానే ఆమెకు కోపం తెప్పించింది. తన విదేశాంగ శాఖలోని 100 మంది ఉన్నతాధికారులు తనకై ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.
''మీలో చాలామంది కరణ్ థాపర్‌కు నేను యిచ్చిన టీవీ యింటర్వ్యూ చూసి వుంటారు. నేను చెప్పదలచుకున్నదానిలో సగమే అక్కడ చెప్పాను. మిగతా సగం యివాళ్టి కోసం దాచుకున్నాను. నేను చాలాసేపు మాట్లాడతాను. ఓపిక లేనివాళ్లు ముందే వెళ్లిపోవచ్చు…'' అంటూ ఉపన్యాసం ప్రారంభించింది. అంతకు ముందు జయశంకర్ ఆమెను 'ఔట్‌గోయింగ్ ఫారిన్ సెక్రటరీ'గా సభకు పరిచయం చేస్తూ ''జూనియర్ డిప్లోమాట్‌గా ఆమె చాలా ధైర్యాన్ని ప్రదర్శించింది. మానససరోవర్‌లో విపరీతమైన వర్షాలు పడి యాత్ర దుర్లభం అనుకున్నపుడు ఆమె ధైర్యంగా లయజన్ ఆఫీసరుగా వుండి అక్కడకు వెళ్లింది.'' అని మాత్రమే చెప్పాడు. 38 ఏళ్ల కెరియర్‌లో ఆమె సాధించిన తక్కిన విజయాల గురించి ప్రస్తావించనైనా ప్రస్తావించలేదు. దానితో ఆమె ''జయశంకర్, జూనియర్ డిప్లోమాట్‌గా నేను చేసినదాన్ని చెప్పడంతో బాటు నన్ను యీ ప్రభుత్వం ఏ విధంగా తొలగించిందో అది కూడా చెప్పాల్సింది..'' అని మొదలుపెట్టి, 'విదేశాంగ వ్యవహారాలనేవి ఒక్కసారిగా జరిగేవి కావు. ఏళ్ల తరబడి బంధాలు నిర్మించుకుంటూ రావాలి. ఎన్నో స్థాయిలలో ఎందరితోనూ వ్యవహారం నడుపుతూ పరిస్థితులను సానుకూల పరుచుకోవాలి. అది నిరంతర ప్రక్రియ. టీమ్ వర్క్. చాలామంది తమ నైపుణ్యాలను రకరకాలుగా వుపయోగిస్తేనే ఫలితం కనబడుతుంది. అంతేకానీ ఎవరో ఒక వ్యక్తి చేతనే అంతా జరిగిందనుకోవడం భ్రమ' అంటూ జయశంకర్‌పై విసుర్లు విసిరింది. ఇక మోదీ తన పట్ల ఎందుకు విముఖంగా వున్నాడో అర్థం చేసుకోలేకపోయానని చెపుతూ 'నాకు మోదీతో పర్శనల్ కెమిస్ట్రీ లేదని కొందరంటున్నారు. విదేశీ వ్యవహారాలపై నేను మోదీగారితో హిందీలోనే మాట్లాడాను. తమిళంలో మాట్లాడి వుంటే ఆయనకు బాగా అర్థమయ్యేదేమో!' అని వెటకరించింది.
సుజాతా సింగ్ తమిళ వనిత. ఆమె తండ్రి టివి రాజేశ్వర్ ఇందిరా గాంధీ కాలంలో ఇంటెలిజెన్సు బ్యూరోకు చీఫ్‌గా పనిచేశారు. భర్త సంజయ్ సింగ్ ఉత్తరభారతీయుడు. ఐఎఫ్‌ఎస్‌లోనే పనిచేశాడు. తండ్రి కారణంగా ఆమెకు కాంగ్రెసు నాయకులతో పలుకుబడి వుందని, అందుకే మోదీకి ఆమె నచ్చలేదనీ కొందరు వ్యాఖ్యానించిన మాట కూడా ఆమె ప్రస్తావించింది. 'నాకేవో పొలిటికల్ కనక్షన్లు వున్నాయని అంటున్నారు. అంత కనక్షనే వుంటే మా ఆయనకు రాయబారిగా ఒకే ఒక్కసారి – అదీ రెండేళ్లపాటు, పైగా ఇరాన్‌లో – ఎందుకు వస్తుంది?' అని అడిగింది. సాధారణంగా రాయబారి పోస్టింగు మూడు, నాలుగేళ్లకు యిస్తారు. కొంతకాలం ఒక చోట చేసిన తర్వాత హెడ్‌క్వార్టర్స్‌కు వచ్చి పని చేశాక మళ్లీ యింకో చోటకి పంపిస్తారు. పలుకుబడి గల కొందరు హెడ్‌క్వార్టర్స్‌కు రాకుండా దేశం తర్వాత దేశానికి రాయబారిగా వెళ్లిపోతూ వుంటారు. సంజయ్ సింగ్‌కు ఆ భాగ్యం దక్కలేదంటే ఆమెకు పలుకుబడి పెద్దగా లేనట్టే లెక్క. ఆమెతో పనిచేసినవారు చెప్పేదాని ప్రకారం, ఆమె చాలా సమర్థురాలు. వాస్తవ పరిస్థితిని ధైర్యంగా, శషభిషలు లేకుండా పై అధికారులకు, నాయకులకు చెప్పే రకం. అది ప్రస్తుత ప్రభుత్వానికి నచ్చలేదని అర్థమవుతోంది. అవమానకరంగా అవతలకు పంపించే ముందు ఆమెపై సోషల్ మీడియాలో చాలా వ్యాఖ్యలు వెలువడ్డాయి. 'ఆమెకు ఏదీ చేతకాదనీ, మోదీ విదేశాంగ విధానం అమలు చేయడంలో విఫలమైందనీ..' యిలాటివి! దానితో అవకాశం రాగానే ఆమె దుమ్ము దులిపేసింది. రేపు మీ గతీ యింతే కావచ్చని సహచరులను హెచ్చరించింది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2015)