‘మా’లో మాకే సరిపడదు

మా.. . సుమారు 750 మంది సభ్యులున్న నటీనటుల సంఘం ఇది. దీనికి చిరకాలం నుంచీ మురళీ మోహన్ అధ్యక్షుడిగా వుంటూ వస్తున్నారు. ఈసారి ఆయన ఎంపీగా వున్నారు. ఇంకా పలు కీలక వ్యవహారాల్లో…

మా.. . సుమారు 750 మంది సభ్యులున్న నటీనటుల సంఘం ఇది. దీనికి చిరకాలం నుంచీ మురళీ మోహన్ అధ్యక్షుడిగా వుంటూ వస్తున్నారు. ఈసారి ఆయన ఎంపీగా వున్నారు. ఇంకా పలు కీలక వ్యవహారాల్లో తలమునకలై వున్నారు.ఈసారి మళ్లీ ఎన్నికలు వచ్చాయి. దాంతో మా లో హడావుడి మొదలైంది. పానెళ్లు, అభ్యర్థులు..హడావుడి. 

అసలు మా లో ఏం జరుగుతోంది. చిరకాలంగా మా అధ్యక్షుడిగా వుంటూ వస్తున్న మురళీ మోహన్ ఈసారి కూడా పరోక్షంగానైనా మా పై ఆధిపత్యం వదులుకోరాదని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? సీనియర్ నటుడిగా, హీరోగా గతంలో ఓసారి ఓడిపోయిన రాజేంద్ర ప్రసాద్ తాను అధ్యక్షుడిగా వుండాలనుకుంటున్నని బాహాటంగా చెప్పినా కూడా ఎందుకు సమ్మతించలేకపోతున్నారు. 

అంటే తెలుగు సినిమా కళాకారులంతా ఒకటే అన్నది ఒట్టి మాటేనా? వారిలో వారికే సరిపడదా? వారిలో పార్టీ బేధాలు కూడా వున్నాయా? ఇలా అనేక ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.

మా సంఘ కార్యవర్గంలో తెలుగుదేశం అనుకూల నటవర్గం ఎప్పడూ ఎక్కవగా వుంటూ వస్తోంది. మురళీమోహన్, దివంగత నటులు మల్లికార్జున రావు, ఎవిఎస్ వీరంతా తెలుగుదేశానికి సంబంధించిన వారే. ఇప్పుడు జయసుధ ప్యానల్ లో వున్న ఆలీ కూడా తెలుగుదేశానికి చెందిన వారే. ఇక మంచు ఫ్యామిలీ సంగతి చెప్పనక్కరలేదు. అలాంటిది ఇప్పుడు ఉన్నట్లుండి జయసుధను రంగంలోకి దింపారు. 

జయసుధ కాంగ్రెస్ లో వుండి, ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తరువాత వైకాపాలోకి, కాంగ్రెస్ లోకి అటు ఇటు తిరిగారు. ఇప్పుడు ఈమెను తెరపైకి తేవడం వెనుక ఏమైనా రాజకీయం వుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  జయసుధకు కనీసం ఇంతో అంతో ఓట్ బ్యాంక్ సికిందరాబాద్ ప్రాంతంలో వుంది. మంత్రి గా వున్న తలసాని శ్రీనివాస యాదవ్ త్వరలో ఎమ్మెల్యే పదవికి పోటీ చేయాల్సి వుంది. అలాగే హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు వున్నాయి. ఇక్కడ కూడా జయసుధ అక్కరకు వస్తుంది. అందుకే ముందుగానే ఆమెను ఈ ఎన్నికల ద్వారా తెలుగుదేశం వైపు తిప్పుతున్నారా అన్నది డిస్కషన్ పాయింట్ గా వుంది.

సరే, ఈ సంగతి పక్కన పెడితే, అసలు రాజేంద్ర ప్రసాద్ కు ఎందుకు మోకాలు అడ్డుతున్నారన్నది మరో పాయింట్. వినిపిస్తున్న సమాచారం ప్రకారం, రాజేంద్ర ప్రసాద్ సినిమా పెద్దలు అని అనుకునేవారిని ఎవరినీ సంప్రదించకుండానే, తనంతట తానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించడమే, ఆయన చేసిన తప్పిదమని తెలుస్తోంది. రాజేంద్ర ప్రసాద్ మురళీ మోహన్, దాసరి లాంటి పెద్దలను కలిసి, తన కోరిక చెప్పి, సహకరించమని కోరి వుంటే మరోలా వుండేది. కానీ అలా చేయలేదు. 

పైగా నాగబాబును తోడు తీసుకుని ప్రెస్ మీట్ పెట్టారు.పైగా ఇన్నాళ్లు అధికారం వెలగబెట్టిన వారు కళాకారులకు ఏమీ చేయలేదన్నట్లు మాట్లాడారు. ఇప్పుడు కేవలం ఒక్కరికి మాత్రమే పింఛను ఇస్తున్నారని తాను అధ్యక్షుడిని అయితే 50మంది పింఛను ఇస్తానని అన్నారు. అంటే మురళీమోహన్ సరిగ్గా చేయలేదనేగా? ఇవన్నీ మా లోని ఓ వర్గానికి కాస్త కోపం తెప్పించాయి. అందుకే పోటీ చేయకూడదనుకున్న, మురళీ మోహన్ స్ట్రాటజీ మార్చి, తను తెరవెనుక వుండి జయసుధన ను రంగంలోకి దింపారు. అంతే కాదు, అన్ని వర్గాలను కలుపుకుంటూ సరైన ప్యానెల్ తయారుచేసారు.

దీనికి తోడు రాజేంద్ర ప్రసాద్ ఎప్పడూ తెలుగుదేశానికి దగ్గరగా లేరు. పైగా చెన్నారెడ్డి, జనార్థనరెడ్డి టైమ్ లో కాంగ్రెస్ వైపు కాస్త మొగ్గు చూపారు. ఇవన్నీ ఇప్పుడు కౌంట్ లోకి వస్తున్నట్లుంది. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ వెనుక పోటీకి కూడా జనాలు లేనట్లున్నారు. వున్నా బాహాటంగా పోటీకి ముందుకు రాలేదు. ఎందుకంటే దాసరి, బాలయ్య, మురళీ మోహన్ అందరూ జయసుధకు అనుకూలంగా వున్నారు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ తరపున పోటీకి దిగి ఈ పెద్దలకు దూరం కావడం ఎందుకు..అందుకే ఎవ్వరూ పెద్దగా బయటకు రాలేదు . దీంతో మంచులక్ష్మి, తనికెళ్ల భరణి వంటి జయసుధ ప్యానెల్ వారు ఏకగ్రీవం అయిపోయారు.

ఇక అధ్యక్షపదవికి నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్ ఒంటరి పోరు సాగిస్తున్నారు. మా ఎన్నికల్లో విజయం దాదాపు ఒకవైపేలా వుండే సూచనలు కనిపిస్తున్నాయి. పైకి చెప్పకున్నా అగ్రనటులంతా జయసుధకే వత్తసు పలుకుతున్నట్లు తెలుస్తోంది. కనీసం మూడు వందల ఓట్లు వచ్చినా ఆమె గెలుస్తారు. ఎందుకంటే నూటికి నూరు శాతం పోలింగ్ జరుగుతుందా అన్నది అనుమానం.

మొత్తానికి సినిమావాళ్లంతా రాజకీయాల్లో ఏక్టివ్ గా వుండడం వల్ల మా ఎన్నకలు కూడా మాంచి రసవత్తరంగా మారుతున్నాయి.

'చిత్ర'గుప్త