రికీ పాంటింగ్ స్లెడ్జింగ్ చేస్తోంటే.. హర్భజన్‌సింగ్ రివర్స్ కౌంటర్ ఇచ్చేస్తోంటే.. అబ్బో ఆసీస్ ` టీమిండియా జట్ల మధ్య క్రికెట్ మహ రంజుగా వుండేది. ఫాస్ట్ బౌలింగ్‌తో ఆసీస్, స్పిన్ బౌలింగ్‌తో టీమిండియా.. మైదానంలో బంతులతో నిప్పులు కురిపించింది. మాథ్యూ హెడెన్, అడమ్ గిల్ క్రిస్ట్ చెలరేగిపోతోంటే.. సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ వీరవిహారం చేస్తుంటే.. మైదానంలో బంతికీ బ్యాట్‌కీ మధ్య పోరు రసవత్తరంగా సాగేది.
మెక్‌గ్రాత్, బ్రెట్‌లీ, షేన్‌వార్న్.. ఆస్ట్రేలియా బౌలింగ్‌కి కొండంత బలంగా నిలిస్తే, టీమిండియాలో కుంబ్లే, జహీర్‌ఖాన్ తదితరులు బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌కి బలంగా వుండేవారు. బ్యాటింగ్‌లో ఇరు జట్లూ పోటా పోటీగా వుండేవి. ఆసీస్‌లో టీమిండియాకి చుక్కలు కన్పిస్తే, ఇండియాలో ఆస్ట్రేలియాకి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేది.
ఆనాటి స్టార్స్ ఇప్పుడు ఇరు జట్లలోనూ లేరు. దాదాపు ఇరు జట్లలో అందరూ కొత్తవారే. అప్పటిలా మ్యాచ్‌ని నిలబెట్టే వీరులు ఇప్పుడెవరు? అని ఆలోచిస్తే.. ఆ స్థాయి స్టార్లు లేకపోయినా, ఇప్పటి క్రికెట్ కండిషన్స్‌కి తగ్గ ఆటగాళ్ళు మాత్రం ఇరు జట్లలోనూ మెండుగానే వున్నారు. ఒకప్పటి స్లెడ్జింగ్ ఇప్పుడు లేకపోయినా, రెచ్చగొట్టుకునే ధోరణి మాత్రం ఇంకా ఎంతో కొంత మిగిలే వుంది. వెరసి, పాకిస్తాన్ ` టీమిండియా మధ్య జరిగే ‘దాయాది’ పేరు తరహాలోనే ఆసీస్ ` టీమిండియా మధ్య దాయాది పోరు వుంటుందన్నది కాదనలేని వాస్తవం.
ఆసీస్‌తో ఈ నెల 26న వరల్డ్ కప్ సెమీస్‌లో తలపడనుంది టీమిండియా. ఈ మ్యాచ్‌పై ఇండియా, ఆస్ట్రేలియాల్లోనే కాక, ప్రపంచంలోని క్రికెట్ ఆడే అన్ని దేశాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొని వుంది. కారణం, టీమిండియా డిఫెండిరగ్ ఛాంపియన్. అదే సమయంలో సొంత గడ్డపై టైటిల్ అందుకోవాలని చూస్తోంది ఆస్ట్రేలియా. ఈ జట్ల మధ్య పోరు ఇంత ఇంట్రెస్టింగ్‌గా మారడానికి ఇంతకన్నా కారణం ఇంకేం కావాలి.?
మొత్తమ్మీద టీమిండియా ` ఆస్ట్రేలియా జట్ల మధ్య పోరు అత్యంత రసవత్తరంగా సాగనుందన్నమాట. ధోనీ, క్లార్క్ తమ జట్లను ఎలా నడిపిస్తారో, ఇరు జట్లలోని బౌలర్లలో ఎవరు సత్తా చాటతారో, బ్యాట్స్‌మన్ బంతులతో ఎలా ఆడుకుంటారో తెలియాలంటే 26వ తేదీ వరకూ ఆగాల్సిందే.
ఇదిలా వుంటే, వరల్డ్ కప్‌ని నిర్వహిస్తోన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. ఈ రెండు దేశాలూ ఇప్పుడు సెమీస్‌లో వున్నాయి. సౌతాఫ్రికా ` న్యూజిలాండ్ ఈ నెల 24న అంటే.. రేపే తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తో న్యూజిలాండ్ భవితవ్యం తేలిపోతుంది. 26వ తేదీన ఆస్ట్రేలియా మేటర్ డిసైడ్ అవుతుంది.