ఎమ్బీయస్‍: టామ్ సాయర్‌ను మనవాడే అనిపించిన నండూరి

30 గజాల పొడుగూ, తొమ్మిది అడుగుల ఎత్తూ గల ఆ గోడ చూడగానే టామ్ గుండె జారిపోయింది. జీవితం నిరర్థక మనిపించింది.

తన 84వ ఏట 2011లో కన్ను మూసిన నండూరి రామమోహనరావు గారి వర్ధంతి యీ నెలలోనే జరిగింది. ఆయన సంపాదకత్వ ప్రతిభ, సైన్సురచనలు, వేదాంతరచనలు ఇవన్నీ ప్రఖ్యాతి చెందినవే. వీటితోబాటు అనువాదకుడిగా కూడా ఆయనకు చాలా పేరుంది. అందునా ఆయన అనువాదానికి ఎంచుకున్నది- దాదాపు 150 సంవత్సరాల క్రితం వెలువడి ప్రపంచ భాషలన్నింటిలోనూ అనువదింపబడి అనేక ముద్రణలు పొందిన (ద ఎడ్వెంచర్స్ ఆఫ్) టామ్‌ సాయర్, (ఎడ్వంచర్స్ ఆఫ్‌) హకల్‌బెరీ ఫిన్, ద ప్రిన్స్ అండ్ ద పాపర్ వంటి విశ్వవిఖ్యాత నవలలు. రమారమి 75 ఏళ్ల క్రితం క్రితం వెలుగు చూసిన ఈ అనువాదాలు పునర్ముద్రణల ద్వారా ఇప్పటికీ పుస్తకరూపంలో లభ్యమవుతూ ఈ తరం పాఠకులను కూడా అలరిస్తున్నాయి. నండూరి వారి అనువాద ప్రజ్ఞపై ఒక సోదాహరణ పరిశీలన యిది.

సాధారణంగా చదివే పుస్తకాలలో ఎన్ని పుస్తకాలు మన మనస్సుల్లో ముద్ర వేసుకుంటాయి? జ్ఞావకం వచ్చినప్పుడల్లా మన పెదవుల మీదకు చిరునవ్వును తెచ్చే పుస్తకాలు ఎన్ని? చాలా తక్కువ! కారణం వాటిల్లో చాలా భాగం పెద్దవాళ్ల రాగద్వేషాలకు సంబంధించిన కథావస్తువులే కావడం! బాల్యపు ముచ్చటలతో మనకు హాయిని చేకూర్చి, తలచుకున్నప్పుడల్లా పెదాలపై చిరునవ్వు వచ్చేట్లా చేసిన నవలలు రాసిన మార్‌ ట్వేన్‌ను స్మరించిన వెంటనే వాటిని మనకు అందించిన నండూరి వారి గురించి ప్రస్తావించడం న్యాయం.

మార్క్ ట్వేన్ (1835-1910) ఏ పాఠశాల లోనూ చదువుకోలేదు. రకరకాల వృత్తులను చేపట్టి జీవితసారాన్ని వడగట్టాడు. మనుషుల్లోని మంచితనాన్ని ప్రేమించి, చిన్నపిల్లల సహజ లక్షణాలైన అమాయకత్వం, దుడుకు తనాల ద్వారా పాఠకులలో మానవీయతను పెంపొందించిన మహనీయు డాయన. బానిసత్వం నిర్మూలనకు ప్రజలు వత్తాసు పలకడానికి ఆయన “హకల్‌బెరీ ఫిన్” నవల ఎంతో ఉపయోగపడింది. అయితే ఈ మహత్కార్యానికి మార్క్ ట్వేన్ ఉపయోగించిన ఆయుధం – హాస్యం, వ్యంగ్యం! మనుష్యులు తమ బాల్యస్మృతులను ప్రేమిస్తూన్నంత కాలం ఆయన సృష్టించిన టామ్ సాయర్, హక్ ఫిన్‌లు చిరంజీవులే! సాహసం కోసమే సాహసాలు చేస్తూ చిక్కుల్లో పడే టామ్, సంఘం చేత చిన్నచూపు చూడబడే హక్ లను ఆ అమెరికన్ మనుషుల, ఊళ్ల పేర్లు లేకపోతే తెలుగు వాళ్లే అనిపించే విధంగా అనువదించారు నండూరి.

మార్క్ ట్వేన్ ఆవేదనలను, ఆలోచనలను సరైన రీతిలో అర్థం చేసుకుని మూలానికి న్యాయం చేస్తూ నండూరి చేసిన అనువాదాలు – అనుసృజనలు అనాలేమో – 1950 -53ల మధ్య ఆంధ్ర వారపత్రికలో వెలువడిన రోజుల్లో పిన్నలను, పెద్దలను విశేషంగా ఆకర్షించాయి. అవి చదువుతున్నంత సేపు మిసిసిపీ గలగలలలో గోదావరి గలగలలు వినిపిస్తాయి. టామ్‌ సాయర్ కథ ‘నా కథే’ అనిపిస్తుంది ప్రతీ పాఠకుడికీ! తెలుగు, ఇంగ్లీషు రెండు భాషల్లో చదివిన వారికి కూడా, తెలుగు అనువాదాలు మళ్లీ మళ్లీ చదువుతూనే ఉండాలనిపిస్తుంది. చదివిన ప్రతీసారీ అదే ఆనందం! అందులోని సన్నివేశాలు పక్కవాళ్లకి చదివి వినిపించి, వాళ్ల పెదవులపై మెరిసే చిరునవ్వు చూడాలనే తహతహ! ఆ రచనల ద్వారా బాల్యాన్ని నెమరు వేసుకోడానికి అభ్యంతరం ఉండేవాళ్లు ఉండరేమో! చదవని వాళ్లుంటే వాళ్లకోసం కాస్త వివరణ:

‘టామ్‌ సాయర్’ నవల ఓ పదేళ్ల అల్లరి కుర్రాడి గాథ. తల్లీ తండ్రీ లేరు. పెద్దమ్మ (ఆవిడ పేరు పోలీ పెద్దమ్మ) దగ్గర పెరుగుతూంటాడు. సిడ్ అనే కజిన్ కూడా ఆ ఇంట్లోనే ఉంటాడు. వాడు పెద్దవాళ్ల దృష్టిలో బుద్ధిమంతుడు కానీ కుళ్లు బుద్ధి. మనకు టామ్ హీరో కాబట్టి వాడు విలన్‌లా అనిపిస్తాడు. హకల్‌బెరీ ఫిన్ (హక్) అనే దేశద్రిమ్మరి కుర్రాడితో మాట్లాడకూడదని ఇంట్లో వాళ్ల ఆంక్షలు. ఎందుకంటే వాడికి చదువూ, సంధ్యా లేదు, తండ్రి తాగుబోతు. ఇంట్లో వాళ్లు వద్దన్నారు కాబట్టి వాడితో మాట్లాడాలనే ఆరాటం టామ్‌ లాటి కుర్రాళ్లకి. అప్పుడే ఎదుగుతున్న వయసు, ఇంకా సరిగా ఎదగని బుద్ధి, ఏదో చెయ్యాలనే తపన సహజం కదా ఆ వయసులో!

పదేళ్ల కుర్రాడు కాబట్టి ఓ గర్ల్ ఫ్రెండు. ఆమె దృష్టిని ఆకర్షించడానికి వెర్రివేషాలు వేస్తాడు. ఇంట్లోంచి పారిపోయి సముద్రపు దొంగ అయిపోవడం జీవితలక్ష్యం కాబట్టి ఓ సారి పారిపోతాడు కానీ రెండు రోజులకే స్వేచ్ఛ బోరుకొట్టి, ఇంటి మీద బెంగ పుట్టేస్తుంది. టామ్ అల్లరిలో దుష్టత్వం లేదు. సరదాకి ఏదో చేసి పెద్దవాళ్ల చేత తిట్లు, చివాట్లు తినడం, బుద్ధిగా ఉండాలని అనుకోవడం, మళ్లీ బుద్ధి వక్రించడం, మధ్యమధ్యలో గడుసుతనం. సన్నివేశాలను పూర్తిగా చెప్పడానికి స్థలం చాలదు కాబట్టి సందర్భం చెప్పి నండూరి వారి వర్ణనను బోల్డ్‌లో యిస్తున్నాను. దాన్ని బట్టి ఆయన కథనాన్ని ఎంత తెలుగైజ్ చేశారో తెలుస్తుంది.

‘సోమవారం వచ్చింది. సోమవారం వచ్చిందంటేనే టామ్‌కి బాధ. బడికి వెళ్లాలి. ఆలోచిస్తూ పడుక్కున్నాడు. ఈ పళాన్ని తనకి ఏదో జబ్బు రాకూడదూ?’ అని. అనుకున్నాక ఒళ్లంతా పరీక్షించి చూసుకున్నాడు. ఎక్కడా ఏ కాస్త నొప్పి లేదని తేలింది. ఇంతలో పై పళ్లలో ఏదో ఒకటి కొంచెం కదుల్తోందని మూలగబోయి, పెద్దమ్మ వచ్చి పీకుతా నంటుందేమోనని భయం వేసి ఆగాడు.

ఇంతలో ఎప్పుడో ఒక డాక్టరు చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చింది. అదొస్తే రెండు మూడు వారాలు మంచమెక్కుతారట. మరైతే దీని లక్షణాలేమిటో టామ్‌కి తెలియదు. అయితే అయింది. ప్రయత్నం చేయాలనుకున్నాడు. అక్కడనుంచి గట్టిగా మూలగడం మొదలెట్టాడు. పక్కనే పడుక్కున్న కజిన్ సిడ్ లేవలేదు. గట్టిగా మూలిగాడు. సిడ్‌కి మెలకువ రాలేదు. గుర్రు పెడుతున్నాడు కూడా. ఇంక లాభం లేదని టామ్ నోరెత్తి అబ్బో అమ్మో అని గట్టిగా అరిచి చూశాడు. ఉహుఁ, సిడ్ కదలట్లేదు. టామ్‌కి ఒళ్లు మండుకొచ్చింది. సిడ్‌ని ఒక్క గుంజు గుంజాడు. వాడు లేచాడు. కళ్లు నులుముకుని చూసేటంతలో గట్టిగా మూలగడం, గట్టిగా రొప్పడం మొదలు పెట్టాడు టామ్.

“అరె ఏమిట్రా, ఏమయింది?”

టామ్ జవాబివ్వలేదు. మరీ గట్టిగా మూలిగి చేతులు కాళ్లూ గిజగిజ కొట్టుకుంటున్నాడు. సిడ్‌కి భయం వేసింది. “అరె టామ్, ఇదిగో చూడు, ఏమయింది, నాకు చెప్పు”

“ఉండరా బాబూ. నన్ను ముట్టుకోకు. చచ్చిపోతున్నాను”.

“ఛ, అదేమిటి, అసలు బాధేమిటో చెప్పరా…. కాస్సేపు మూలగడం ఆపేయ్. ఏమిటో నాకు చెప్పు.”

“వొద్దులేరా వుండు. అదే తగ్గిపోతుంది. ఎవర్నీ పిలువకు.”

“అదేమిటి, అనలెంత సేవట్నుంచి?”,

“అబ్బో చాలా సేపట్నుంచి”,

“మరి నన్నెందుకు లేపలేదు?”

“పోనీలేరా. ఇంతవరకూ నువ్వు చేసిన వాటినన్నిటికీ నిన్ను క్షమించాను సిడ్. నేను పోయినప్పుడు… ఏం వద్దురా సిడ్. అందర్నీ క్షమించాను. అలాగని అందరితోను చెప్పు… నా ఒంటి కన్ను పిల్లిని ఆ కొత్త అమ్మాయి కిచ్చెయ్యి. ఆ అమ్మాయితో చెప్పు..”

ఇది చదివితే మనకు ఎవరో గుర్తుకురారూ? అదే… మనమే, మనమూ స్కూలు ఎగ్గొట్టడానికి ఇలాటి వేషాలేగా వేశాం? ఇలా టామ్ అప్పగింతలు పెట్టేశాక పెద్దమ్మ వస్తుంది. ఏమిటని అడిగితే చితికిన కాలి బొటనవేలు చూపిస్తాడు. ఓస్‌ ఇంతేనా అంటే నోరు జారి ‘‘ఈ నొప్పితో పన్ను నొప్పి కూడా మర్చిపోయాను” అంటాడు టామ్. దెబ్బకి పెద్దమ్మ పట్టుతాడుతో పన్ను మంచం కోడుకు బిగించి, కొరకంచు పట్టుకొచ్చి టామ్ ముక్కు మీద పెట్టబోతుంది. వాడు గుంజుకోవడంలో పన్ను ఊడివస్తుంది. …అంటే అన్ని దేశాలలో పెద్దవాళ్లూ ఇంతేనన్నమాట అనిపిస్తుంది.

ముక్తాయింపు ఏమిటంటే పన్ను పోయినందుకు టామ్ పెద్ద బాధ పడలేదట. ఇదీ ఒక మంచికే వచ్చింది. నోటి నిండా నీళ్లు పోసుకుని తొస్సిలో నుంచి జంయ్మని ధార వదలచ్చు. దర్జాగా ఆమడ దూరానికి కూడా గురి చూసి ఉమ్మి వేయవచ్చు. స్కూల్లో ఈ గొప్ప చూపించ దలచుకున్నాడు. టామ్‌లో తెలుగు కుర్రాడు లేడంటే ఎలా నమ్మగలం?

టామ్ పెయింటింగ్ కాండ ప్రపంచ బాలసాహిత్యంలోనే ఒక ప్రకరణం అయిపోయింది. – ఓ శనివారం నాడు ఇంటి బయట చెక్క గోడకు పెయింట్ వేసే పని వాళ్ల పెద్దమ్మ అప్పచెప్పింది. 30 గజాల పొడుగూ, తొమ్మిది అడుగుల ఎత్తూ గల ఆ గోడ చూడగానే టామ్ గుండె జారిపోయింది. జీవితం నిరర్థక మనిపించింది. కాస్త పనిచేసి, రంగు పూసిన మేర చూస్తే సముద్రంలో కాకి రెట్టలాగ వుంది. ఈలోగా వాడి ఫ్రెండు వస్తాడు. టామ్‌ని చూసి “హి, హీ, అణిగింది అబ్బాయి గారి తిక్క” అంటాడు. కానీ టామ్ గొప్ప ఎత్తు ఎత్తుతాడు. రంగువేయడం పని కాదని, ఆ అవకాశం రమ్మన్నప్పుడల్లా రాదనీ పోజు కొడతాడు.

దాంతో ఆ ఫ్రెండుకి నోరూరుతుంది. తనను పెయింట్ చేయనిమ్మనిమని బతిమాలుతాడు. టామ్ గునుస్తూనే, లంచం పుచ్చుకుని మరీ చేయిస్తాడు. వాడిని చూసి ఇంకో ఫ్రెండు, ఆ తరువాత మరోడు ఇలా పనిని పనిగా చూపకుండా ఒక అరుదైన అవకాశంగా చూపించి ఊరిస్తే మోజు పెరుగుతుందన్న మేనేజిమెంట్ టెక్నిక్ ఉపయోగించి టామ్ బోల్డంత పని చేయించుకోవడమే కాక పెద్దమ్మ దగ్గర ఇంప్రషన్ కొట్టేస్తాడు. ఇక్కడ నండూరి వారు రాసినది- ‘వాడు చేసిన పనికి ఆవిడ, పాపం ఎంతో సంతోషించి వాడికి మంచి ఆపిల్‌ పండు ఏరి ఇస్తూ, బుద్ధిమంతులుగా వుండి చెప్పిన మాట వినే పిల్లలు ఎట్లా బాగుపడతారో చిన్న ఉపన్యాసం ఇచ్చింది. ఈ సందడిలో టామ్ ఆవిడకు తెలియకుండా ఒక అప్పచ్చి చేతివాటు వేశాడు.’

టామ్‌కి ఇంత అల్లరి బుద్ధి ఉన్నా ఊళ్లో కొత్తగా పెట్టిన ‘బుద్ధిమంతుల సంఘం’లో చేరతాడు. చుట్టలు తాగనని, బూతులు మాట్లాడనని ప్రమాణం చేస్తాడు. చేసిన దగ్గర్నుంచీ వాటిమీదే ధ్యాస. అయినా ఒక ఆకర్షణ అతన్ని ఆపి వుంచింది. ఎవరైనా పెద్దవాళ్లు పోయినప్పుడు ఆ సంఘం వాళ్లు మంచి యూనిఫాం వేసుకుని ఊరేగవచ్చు. చావుబతుకుల్లో ఉన్న జడ్జి గారి మీద టామ్ ఆశపెట్టుకున్నాడు. రోజుకి నాలుగు సార్లయినా ఆయన అనారోగ్యం గురించి అడిగి చూసేవాడు. పోతున్నాడని అనిపించగానే ఆ యూనిఫాం వేసుకుని అద్దంలో చూసుకుని మురిసేవాడు. తగ్గిందనగానే నిరాశ పడేవాడు. ఇలా చాలాసార్లు జరిగాక ఆయనకు బాగా నెమ్మళించిందని రూఢి అయ్యాక సంఘానికి టామ్ రాజీనామా ఇచ్చేశాడు. ఆ రాత్రే జడ్జి చచ్చిపోయాడు. టామ్‌కి వెర్రికోపం వచ్చింది ఆయన మీద. జీవితంలో ఇంకెప్పుడూ జడ్జీలను నమ్మగూడ దనుకున్నాడు.

టామ్ జీవితలక్ష్యం రాబిన్ హుడ్‌లా బతకాలని. స్నేహితుల నూరించి గుప్తధనం కోసం తెగ వెతుకుతూంటాడు. నాయకత్వ లక్షణాలున్నాయి కాబట్టి ఇతరులను సులభంగా డబాయించగలడు. చచ్చిపోయిన చెట్ల కింద డబ్బు జాగ్రత్త పెడతారనీ, కాలవ పక్కన చచ్చిపోయిన చెట్లు చచ్చేన్ని ఉన్నాయని అంటాడు. ‘ఎవర్నయినా అడుగు కావలిస్తే. రాజుల దగ్గిర తట్టలు తట్టలుంటాయి రత్నాలు’ అని టామ్ అంటే హక్ ‘నేనెప్పుడూ రాజుల్ని చూడలేదు’ అంటాడు. ‘యూరప్ వెళ్లి చూడు. ఈగల్లా ముసురుతారు’ అని టామ్ అంటే హక్‌కి అనుమానం ‘రాజులు ఈగల్లా వుంటారా?’

ఈ పిల్లలిద్దరికీ అందరు పిల్లల లాగానే ఎన్నో మూఢ నమ్మకాలు. హక్ కొచ్చిన వులిపిరి కాయలు పోవడానికి చచ్చిన పిల్లిని చంకన పెట్టుకుని శ్మశానానికి వెళతారు. (దుర్మార్గుడైన వాడు చచ్చిపోయిన రాత్రి దెయ్యాలు వాడిని తీసుకెళుతూంటే ‘శవం వెంట పిల్లి, పిల్లి వెంట వులిపిరి కాయలు పోవాలి, పోవాలి’ అనాలట) ఈ గందరగోళంలో ఓ హత్య చూసి, కోర్టులో సాక్ష్యం చెప్పి ఆపదలు కొని తెచ్చుకుంటారు. తర్వాత టామ్, అతని గర్ల్ ఫ్రెండ్ కలిసి ఒక గుహలో ఇరుక్కు పోతారు. అతి కష్టం మీద బయట పడతారు. ఆ సందట్లో ఓ దొంగల ముఠా దాచిన నిధి టామ్ కంట బడుతుంది. టామ్, హక్ కలిసి తర్వాత ఆ నిధి బయటకు తెచ్చి చూపుతారు. వాళ్లే హక్కుదారులవుతారు.

డగ్లస్ అమ్మగారు అనే ఆవిడ హక్ తనకు చేసిన ఉపకారానికి ప్రతిఫలంగా వాడిని దత్తుకు తీసుకుని ‘సంస్కరించ’బూనుతుంది. ఇన్నాళ్లూ స్వేచ్ఛగా తిరిగిన హక్‌కు అది మింగుడు పడదు. అక్కణ్నుంచే హకల్‌బెరీ ఫిన్ నవల ప్రారంభ మవుతుంది. దీంట్లో హక్, అతని సహచరుడు, నీగ్రో బానిస ఐన జిమ్ ప్రధాన పాత్రధారులు. చివరిలో టామ్ వచ్చి కాస్త సాహసం ప్రదర్శిస్తాడు. టామ్, హక్‌ల కుటుంబ నేపథ్యాలలో, స్వభావాలలో తేడా వుంటుంది. టామ్ మధ్యతరగతి వాడయితే హక్ అధోవర్గాలవా డనాలి. మానవత్వం ఉన్నవాడు కాబట్టి ఒక నీగ్రో పారిపోవడానికి సహాయ పడతాడు. కథనం ‘టామ్‌ సాయర్’ లో కంటె చమత్కారంగా ఉంటుంది.

హక్, జిమ్ పారిపోతున్నప్పుడు వాళ్ల పడవ మీదకు ఇంకో ఇద్దరు వచ్చి చేరతారు. ఇద్దరూ మోసగాళ్లే. ఒకడు మద్యం మానమని ఉపదేశాలు, ఉపన్యాసాలు ఇచ్చి డబ్బు గడించగలడు (కానీ సంపాదించింది తాగుడుకే సరిపోదు). ఇంకోడు వైద్యం చేయగలడు, ఎవరన్నా రహస్యంగా వివరాలన్నీ చెబితే జ్యోతిష్యం కూడా చెప్పగలడు. కొన్ని రోజులు గడిచాక ఒకడు తను జమీందారీ బిడ్డనని కోస్తాడు. హక్. జిమ్ వాడికి గౌరవం ఇవ్వడం చూసి ఇంకోడు కుళ్లుకుని తను ఏకంగా తప్పించుకుని పారిపోయిన ఫ్రెంచి చక్రవర్తినని చెప్పుకుంటాడు. వాళ్లిద్దరూ చేసే అడావుడి చదివితే పొట్టచెక్కలవుతుంది.

టామ్, హక్, జిమ్ పాత్రలతో మార్క్ ట్వేన్ వ్రాసిన మరో నవల ‘‘టామ్‌ సాయర్ ఎబ్రాడ్’’ను నండూరి వారు ‘‘టామ్‌ సాయర్ ప్రపంచయాత్ర’’గా అనువదించి ఆంధ్రపత్రికలో సీరియల్‌గా వెలువరించారు. దీనిలో మన హీరోలు బెలూన్‌లో ప్రపంచాన్ని చుడతారు. చమత్కారం కంటె సాహసం పాలు ఎక్కువగా ఉండి బాలలను ఉత్తేజ పరుస్తుంది. దీన్ని కూడా ఆంధ్ర ప్రచురణలు వారు పుస్తకరూపంలో వెలువరించారు కూడా. కానీ అది తర్వాతికాలంలో ఎక్కడా దొరక లేదు. టామ్సాయర్, హకల్‌బెరీ ఫిన్ పుస్తకాలను ఎన్నోసార్లు పునర్ముద్రించిన నవోదయా వారి వద్దకూడా ఆ పుస్తకం లేదు. నండూరి వారి వద్దకూడా ఆ ప్రతి లేదు. అయితే నాకు అది పి. సుబ్బారావు, రమాదేవి దంపతుల యింట్లో పేపరు కటింగుల్లో దొరికింది. 2006లో దాన్ని మేం ‘‘హాసం’’ తరఫున 2006లో ప్రచురించాం. నండూరి వారు ఎంతో సంతోషించి ముందుమాట రాశారు. అయితే ఆ పుస్తకం అంతగా ప్రజాదరణ పొందలేదు. దాని సంగతి ఎలా ఉన్నా టామ్‌సాయర్, హకల్‌బెరీ ఫిన్ పుస్తకాలు మాత్రం తప్పక చదవండి. (బాపు గీసిన టామ్‌ , హక్, రాజు-పేద, బాలి ముఖచిత్రంతో మేం పబ్లిష్ చేసిన పుస్తకం, పక్కన బాపు సోదరుడు శంకర నారాయణ గీసిన నండూరి పెన్సిల్ చిత్రం)

– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2024)

11 Replies to “ఎమ్బీయస్‍: టామ్ సాయర్‌ను మనవాడే అనిపించిన నండూరి”

  1. తమరు తెలుగైజ్ చేసిన ఇటాలియన్ శృంగార కధలు ఇంతకీ గుర్తు పెట్టుకోమంటారా?

    1. అది పాఠకుల అభిరుచిపై, యిష్టాయిష్టాలపై ఆధారపడుతుంది. రాసి నాలుగేళ్లయింది. ఇప్పటిదాకా మీరు గుర్తు పెట్టుకున్నారుగా. కొందరు మర్చిపోయి ఉండవచ్చు

  2. ఇప్పటికి ఎన్నిసార్లు ఛదివానో గుర్తులేదు. పోలీ పెద్దమ్మ పిల్లి కి మందు తాగించే scene బెకి టామ్ బొమ్మలగీయడం 🥰🥰🥰 నరావతారం కూడ పరిచయం చెయ్యండి

  3. మా నాన్న మా కిచ్చిన పుట్టినరోజు బహుమతులు ఈ పుస్తకాలు ఇప్పటికి ఎన్ని సార్లు చదివినో గుర్తు లేదు ఎప్పుడు చదివిన అంతే కొత్తగా ఏదో లోకం లోకి వెళ్లిపోయిన అనుభూతి కలుగుతుంది ఎక్కడ గచ్చు పగులు చూసిన పోలి పెద్దమ్మ పిల్లి గుర్తుకు వస్తుంది ఇప్పటి 🥰 మా పిల్లల మొదట గీచిన బొమ్మలు చూసినప్పుడు బేకి టామ్ బొమ్మలు గీసే scene గుర్తొచ్చింది🥰🥰🥰 నరావతారం కూడ పరిచయం చెయ్యండి

  4. చిన్నప్పుడు రష్యా వాళ్ళ సోవియట్ భూమి అనే పత్రిక వుండేది. దానిలో కథలు కూడా గమ్మత్తుగా వుండేవి, కాకపోతే ఆ రష్యా పేరులు (వ్లాదిమిర్ లాంటివి) కొరుకుడు పదేవి కాదు.

    దాని కాగితం చాలా మందంగా వుండేది.

    వాటిని టెక్స్టు బుక్క్ లకు అట్ట గా వేసేవాళ్ళం.

  5. సాహిత్య పరంగా రామోజీ గారు విదేశీ భాష, భారతీయ భాషల్లో కథలు నీ తెలుగు వారికి పరిచయం చేయడానికి ఒక పత్రిక పెట్టారు.

    చాలా మంచి జరిగింది దాని వలన.

    దాని వలన వేరే భాషలో నీ కథలు, స్కూల్లో తెలుగు మాస్టారు గారు ఒక్కో శనివారం తెలుగు క్లాస్ లో పిల్లల చేత క్లాస్ ముందు చదివించే వారు. ఆ రోజు వేరే పాఠాలు వుండేవి కాదు.

    ఇప్పుడు లేదు అనుకుంటా ఆ పత్రిక.

    1. ‘విపుల’’ ఇప్పుడు లేదు. దానిలో నా స్వతంత్ర కథలు, అనువాద కథలు చాలా వచ్చాయి. వాటి ద్వారా ఆ పత్రికకు ఎడిటర్లుగా పని చేసిన కీర్తిశేషులు చలసాని ప్రసాదరావు గారు, కెబి లక్ష్మిగారు మంచి మిత్రులయ్యారు.

Comments are closed.