సీతారామశాస్త్రిగారు ‘నిశావిలాసమెంత సేపురా- ఉషోదయాన్ని ఎవ్వడాపురా’ అని రాస్తే అవును, చీకటిరాత్రి ఎక్కువకాలం వుండదుకదా అనుకుంటూ సంతోషించాం. కానీ నిశితో పాటు సిరివెన్నెల కూడా జారిపోతుందని తోచలేదు. మృత్యువును ఎవ్వడాపురా? అంటూ అనారోగ్యం 66 ఏళ్లకే శాస్త్రిగారిని తీసుకుపోయింది. తెలుగుజాతి ఘననివాళి అర్పించింది. ప్రముఖులందరూ వచ్చి అంజలి ఘటించారు. ఆయన అందరికీ యిష్టుడు. ఆయన సాహిత్యం, వ్యక్తిత్వం అనుపమానమైనవి. అన్ని రకాల సందర్భాలకు సూటయ్యే పాటలు సులువుగా పాడుకునే రీతిలో రాసి, సినీప్రేక్షకులందరికీ ఆత్మీయుడయ్యాడు. ఆరేళ్ల క్రితమే ఆయనకు లంగ్ కాన్సర్ వచ్చిందని మీడియాలో రాలేదు కాబట్టి, ప్రస్తుతం వచ్చినది న్యుమోనియా మాత్రమే కాబట్టి, ఆయన ఆస్పత్రి నుంచి తిరిగి వచ్చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ చనిపోయాక తెలిసింది- హృద్రోగం, అధిక బరువు సమస్య, కిడ్నీ సమస్య, లంగ్ యిన్‌ఫెక్షన్ కూడా ఉన్నాయని. అన్నీ కలిసి ఆయన్ను పొట్టన పెట్టుకున్నాయి. ఆయన కెంతో ఆత్మీయురాలైన భార్య శోకాన్ని, పిల్లల దుఃఖాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ వృద్ధురాలైన ఆయన తల్లి బాధను ఊహించుకోవడానికే కష్టంగా వుంది.
శాస్త్రిగారు ఎన్నో ఉత్తేజకరమైన, ప్రబోధగీతాలు రాశారు. ఓటమి ఒప్పుకోవద్దు, నిరాశనే నిరాశపర్చు అంటూ. రాయడం యీజీనే, కానీ తన దాకా వస్తే గుండెలు జారి, బేజారవుతారు చాలామంది. కానీ ఆయన మాత్రం ఆచరణలో పెట్టారు. ఆరేళ్లగా పడుతున్న బాధను ఎక్కడా వ్యక్తం చేయలేదు. కడదాకా ఉత్సాహంగానే కనబడ్డారు. పగలబడి నవ్వుతూనే వున్నారు. చివరి నిమిషం వరకూ చురుగ్గా పనిచేస్తూనే వున్నారు. మేధస్సుకు, కలానికి పని చెప్తూనే వున్నారు. ఆలోచనామృతాన్ని చిలుకుతూ, పంచుతూనే వున్నారు. ఆయన కవిత్వం గురించి రాయడానికి నాకు శక్తి చాలదు. పాటలో ప్రతీ మాటా ఆయన తెగ చెక్కుతాడు. ఒక్కొక్క మాట వెనక ఎంత నేపథ్యముందో ఆయనకే తెలుసు. వాటిని వివరిస్తూ పుస్తకం రాస్తున్నాడు. రెండు వేల పేజీలు దాటిపోయినట్లుంది. ఇప్పుడిక ఆయన శిష్యులెవరైనా దాన్ని పూరించాలి.
కేవలం ఒక శ్రోతగా చెప్పాలంటే నేను ఆయనను హిందీ గేయకవి సాహిర్‌తో పోలుస్తాను. కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, ఆత్రేయ అందరూ సాహిర్‌లో కనబడతారు. అలాగే శాస్త్రిగారిలో కూడా! అన్ని రకాల గీతాలు రాసి మెప్పించాడు. ఇక్కడ గమనించవలసిన దేమిటంటే సాహిర్ రాసిన కాలం 50ల నుంచి 80ల వరకు. అది హిందీ సినిమా సంగీతానికి స్వర్ణయుగం. ఆ కాలంలో సాహిత్యం, సంగీతం సమపాళ్లలో వుండడం చేత అవి యిప్పటికీ డిమాండులో వున్నాయి. 60, 70 ఏళ్ల తర్వాత కూడా వాటిని పాడుకుంటూనే వున్నారు. సాహిర్ ఉన్నతమైన భావాలను ఉదాత్తమైన పదాలలో అమర్చినా, ఆ కాలం కాబట్టి, చెల్లిపోయింది. మరి శాస్త్రిగారు రంగంలో ప్రవేశించినది 1986లో. అప్పటికే సినిమాలు, సినీసాహిత్యం విలువల రీత్యా భ్రష్టు పట్టివున్నాయి. పాతకాలంలో చెత్త లేదా అంటే వుంది, కానీ వాటి శాతం బాగా తక్కువ. మెయిన్ హీరోహీరోయిన్లు ఆమోదించేవారు కాదు. కానీ 1980ల నుంచి, హీరో పాత్రచిత్రణే మారిపోయింది. సినిమాల సంఖ్య పెరిగింది కానీ మంచి సినిమాల శాతం గతంలో కంటె తగ్గింది.
సినీసాహిత్యం విషయంలో, సంభాషణల విషయంలో హిందీతో పోలిస్తే తెలుగు సినిమాల్లో దిగజారుడుతనం ఎక్కువై పోయింది. ప్రజలు మెచ్చుతున్నారు అనే పేర అశ్లీలాన్ని పెంచి, ప్రజలకు అర్థం కాదు అనే పేర సాహిత్యపు విలువలను పలుచన చేసి, మామూలు పదాలతోనే పాటలు రాసేసి, వాయిద్యఘోషలో వాటిని వినబడకుండా చేసి, సినిమాపాట అంటే ఓ 40 మంది డాన్సర్లతో కలిసి చేసే సామూహిక కసరత్తు తప్ప మరేదీ కాదనే నిర్వచనం వచ్చేట్లా చేశారు. ఒక గాయకుడు రోజుకి 15 పాటలు పాడేడంటే దాని అర్థం ఆ పాటలెంత అర్జంటుగా కంపోజ్ చేసి వుంటారు, ఎంత యమర్జంటుగా ట్యూన్‌లో మాటలు పొదిగేసి వుంటారు? అందుకే ఆ పాటలకు ఆయుర్దాయం తక్కువై పోయింది. పబ్లిక్ మెమరీ నుంచి అతి త్వరగా తప్పుకున్నాయి. వాటికి డిమాండూ పెద్దగా లేదు. ఇలాటి వాతావరణంలో ఎవరైనా కవి సాహిర్ స్థాయిని అందుకోగలిగాడంటే జోహార్ అనాల్సిందే!
శాస్త్రిగారు 35 ఏళ్ల కెరియర్‌లో రాసినది 3 వేల పాటలు. అంటే సగటున నెలకు 7! సగటున ఏడాదికి 120 స్ట్రయిట్ సినిమాలు, 50 దాకా డబ్బింగు సినిమాలు విడుదలైన యీ కాలంలో ఒక్కోదానిలో 5, 6 పాటలుంటూన్నపుడు 850 పాటలున్నాయనుకుంటే యీయన చేత 85 రాయించుకున్నారన్నమాట. అంటే 10 శాతం పాటలే యీయనకు వచ్చాయి. దానికి కారణం ఆయన ఏర్పరచుకున్న పరిధే కారణమా? ఆ పరిధి విస్తరించక పోవడానికి అభిరుచి లేని దర్శకనిర్మాతలు, ప్రేక్షకులు కారణమా? ఇలా ఎందుకనాల్సి వస్తోందంటే ఆయన ఏ తరహా అయిన పాటైనా రాయగలడని, కానీ. అశ్లీలం జోలికి వెళ్లడనీ అందరూ ఒప్పుకుంటారు. (నా మట్టుకు నాకు ‘బలపం పట్టి..’ పాట పై అసంతృప్తి వుంది) ‘హీరో, హీరోయిన్లు న్యూజిలాండ్‌లో ఫారిన్ డాన్సర్స్‌తో కలిసి స్టెప్పులేసే పాట ఒకటి ప్లాను చేశాం, మా మ్యూజిక్ డైరక్టరు ఫోన్లో ట్యూన్ చెప్తాడు, రేపు ఉదయానికల్లా లిరిక్ యిచ్చేయగలరా?’ అని అడిగితే ఈయన ‘కథా, సందర్భం చెప్పకపోతే పాట పుట్టదు’ అని కరాఖండీగా చెప్తాడనీ అందరికీ తెలుసు.
శాస్త్రిగారితో వచ్చిన చిక్కేమిటంటే ఆయన సృజనాత్మకత వున్న దర్శకులతోనే పనిచేయగలడు. కథ ఒకటి ముందే అనుకుని, పాటలు వచ్చే సందర్భాలు ముందుగా ప్లాను చేసుకుని ఆయన దగ్గరకు వెళ్లాలి. కథ ఏదో చెప్పేసి వెళ్లిపోతే కుదరదు. ఆయనతో కలిసి కూర్చోవాలి. సిరివెన్నెల రాత్రే కురుస్తుంది కాబట్టి రాత్రే కూర్చుందామంటాడు. ఆ వెన్నెల వెళ్లేదాకా కబుర్లు చెప్తూనే వుంటాడు. కథను క్షుణ్ణంగా తెలుసుకుంటాడు. తరచితరచి ప్రశ్నలు అడుగుతాడు. కథ గురించి, కథలో డైరక్టరు, రచయితా అనుకోని కోణాల గురించి, లోకంలో వున్న సమస్తమైన విషయాల గురించి, వాటి వెనకాల వున్న తాత్త్వికత గురించి.. యిలా ఎన్నోఎన్నో మాట్లాడతాడు. ఆయనతో మాట్లాడిన తర్వాత కథపై అవగాహన పెరిగి, మరింతగా ఇంప్రూవైజ్ చేసినవాళ్లు, చర్చల సందర్భంలో ఆయన మాట్లాడిన మాటల్ని డైలాగులుగా మలచుకున్న వాళ్లూ చాలామంది ఉన్నారు. మేధోమథనం అంటే అలాయిలా కాదు, ఆయన బుర్రా, ఎదుటివాడి బుర్రా అతలాకుతలం అయిపోతుందన్నమాట!
ఇక దానిలోంచి అమృతం తయారుకావడం ప్రారంభిస్తుంది. ఎంతో గంభీరమైన భావాన్ని యీనాటి శ్రోతకు అర్థమయ్యే మాటల్లోనే చెప్పగల సమర్థుడాయన. ఇందాకా సాహిర్‌తో పోల్చాను కదా! నా మట్టుకు నాకు సాహిర్ కవిత్వం బాగానే అర్థమవుతుంది. కైఫీ ఆజ్మీ, గుల్జార్ పాటల్లో పదాల అర్థం తెలిసినా, ఏదో మార్మికత, గహనమైన భావం తెలుసుకోలేక మిస్సయినట్లు ఫీలవుతాను. శాస్త్రిగారి కొన్ని పాటలు అలాగే అనిపిస్తాయి. ఏదో చెప్తున్నాడు, పట్టుకోలేక పోతున్నాను అనిపిస్తాయి. సాధారణంగా కవులు పల్లవి గురించే తాపత్రయ పడతారు. పల్లవి వచ్చేస్తే చరణాలదేముంది? ఆటోమెటిక్‌గా వచ్చేస్తాయి అంటూంటారు. కానీ శాస్త్రిగారు పల్లవినే కాదు, ప్రతి చరణాన్ని, దానిలో ప్రతి పదాన్ని చెక్కుతూ పోతాడు. వేలాది పాటలు విని వుంటాం కాబట్టి ఒక లైను వినగానే తర్వాతి లైను స్ఫురిస్తూ వుంటుంది. కానీ యీయన పాటల్లో అది కుదరదు. చటుక్కున ఎక్కడిదో పోలిక తెస్తాడు. పదాల అమరిక కూడా కొత్తగా వుంటుంది. ఇవన్నీ ట్యూన్‌కి రాసినవే అంటే ఆశ్చర్యం వేస్తుంది.
ఈ కసరత్తుకి చాలా టైమే పడుతుంది. దర్శకుడు అంత ఓపిక పట్టగలిగితేనే ఆయన దగ్గరకు వెళ్లాలి. ఆయన పెద్ద సినిమాలకే కాదు, చిన్న సినిమాలకూ రాశాడు. మనిషి నచ్చాలంతే. అతనికి చిత్తశుద్ధి, డొక్కశుద్ధి వుందని యీయనకు నమ్మకం కుదరాలి. ‘‘పట్టుదల’’ అనే ఓ సినిమా వుంది. వచ్చినట్లు కూడా చాలామందికి తెలియదు. దానిలో ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి’ అనే అది గొప్పాతిగొప్ప పాట వుంది. ‘ఇంత మంచి పాట యీ చిన్న సినిమాపై ఖర్చు పెట్టడం దేనికి? వేరే ఏదో రాసిచ్చేసి ఏ చిరంజీవి సినిమాకో వాడుకోవచ్చుగా’ అని ఆయన అనుకోలేదు. డిమాండు ఉండగానే ఉధృతంగా రాసేసి, డబ్బులు పోగేసేద్దామనీ తహతహ లాడలేదు. తన స్థాయిని, స్థానాన్ని చివరిదాకా కాపాడుకుంటూనే వచ్చాడు. ఆయన రాసిన పాటల్లో ఆణిముత్యాలు అంటూ నేను జాబితా రాయడం మొదలెడితే కనీసం ఓ వంద తేలతాయి. అవి ఎందుకు గొప్పవో చెప్పాలంటే అదో పెద్ద థీసిస్ అవుతుంది. అందుకని ఆ టాపిక్ వదిలేసి, వ్యక్తిగా ఆయన ఎలాటివాడు, నాతో ఆయనకున్న పరిచయం ఏమిటి అనే విషయాలు రాస్తాను.
వ్యక్తిగా చాలా సరదా మనిషి. ఆత్మీయంగా పలకరిస్తాడు, మాట్లాడడం మహా సరదా. మాటల కంటె ఎక్కువగా అట్టహాసం చేయడం అలవాటు, అదీ నిష్కల్మంగా! నచ్చితే తెగ మెచ్చుకుంటాడు. చాలా చక్కటి చదువరి. అన్ని రకాల సబ్జక్టులూ చదువుతాడు. అహంకారం అనలేం కానీ, తనేమిటో, తన విద్వత్తు ఏమిటో ఎఱిక బాగా వుంది. అదే సమయంలో యితరుల ఘనతను శ్లాఘిస్తాడు. ఇతర కవుల పట్ల అసూయ లేదు. పని గట్టుకుని మెచ్చుకుంటాడు. పుస్తకాలు, సంగీతం, సినిమాలు అన్నీ యిష్టమే. అయితే ఆయనతో సంబంధబాంధవ్యాలు నెరపడం కష్టం. ఓ పట్టాన దొరకడు. నిశాచరుడనే కాదు, కనబడినప్పుడు కౌగలించుకుని వాటేసుకుంటాడు కానీ ఫోన్ చేస్తే ఎత్తడు, మెసేజిలకు జవాబివ్వడు. తన లోకంలో తనుంటాడు. సభలకు వస్తానని ఒప్పుకున్నా వచ్చేదాకా గ్యారంటీ లేదు. ఆ కారణంగా ఆత్మీయ మిత్రులెందరి చేతనో మాటపడినా, పంథా మార్చుకోలేదు. సోషల్ రిలేషన్‌షిప్స్‌లో మైనస్ మార్కులు పడతాయి. ‘అదో రకం తిక్క’ అనుకుని వూరుకుంటారు తప్ప కావాలని చేస్తున్నాడని ఎవరూ అనరు.
బయటి ప్రపంచంలో యిలా వుంటాడని స్వానుభవం ద్వారా, యితరులు చెప్పగా కూడా నాకు తెలుసు, కానీ సినిమావాళ్లెవరూ ఆయన గురించి ఫిర్యాదు చేయలేదు. నిర్మాతలతో డబ్బు పేచీలు కానీ, దర్శకులతో, సంగీతదర్శకులతో గొడవలు కానీ ఏమీ లేవు. అందరూ ఆయన్ని గౌరవించినవారే. ఆయన మరణించినపుడు చిత్రసీమకు చెందిన ఎందరు ప్రముఖులు వచ్చారో చూడండి. ఆరేళ్ల క్రితం ఆయనకు వచ్చిన లంగ్ కాన్సర్ సంగతి చాలామందికి తెలియకపోవడం వలన యిది అకాల హఠాన్మరణం లాగానే అనిపించింది. మద్యపానం సినీప్రముఖల నెందరినో బలి గొంది. ధూమపానానికి ఆహుతై పోయిన దురదృష్టవంతుడు ఈయనేనేమో!
స్వవిషయానికి వస్తే ఆయనను ప్రత్యక్షంగా కలవడం ఆయన యింట్లోనే! అప్పట్లో మేం ‘‘హాసం’’ పత్రిక నడిపేవాళ్లం. ఆయనకు ఆ పత్రికంటే చెప్పలేనంత యిష్టం. దానిలో ప్రతి ఆర్టికల్‌ను చదివి, వ్యాఖ్యానించేవాడు. ఆర్టికల్స్ పంపేవాడు. మా ఎడిటరు రాజా ఆయనకు చాలాకాలంగా తెలుసు కాబట్టి తరచుగా మాట్లాడుతూ ప్రోత్సహిస్తూ వుండేవాడు. నా రచనలు చదివేవాడు కానీ వ్యక్తిగతంగా నా గురించి ఏమీ తెలియదు. అమెరికాలో జంపాల చౌదరి అనే సాహిత్యప్రియుడు ఉన్నారు. 1995లో తానా సువెనీర్‌కు ఎడిటరుగా వున్నారు. బాపురమణలంటే చాలా యిష్టం కాబట్టి మద్రాసు వచ్చినపుడు నన్నూ కలిసి మాట్లాడారు. నేను రమణ గారి ‘‘ఛాయలు’’ కథకు చేసిన ఆంగ్లానువాదాన్ని ఆ సువెనీరులో వేశారు. బాపురమణలను ఆ ఏడాది తానా సభలకు పిలిచి సత్కరించారు. ఓ 20 ఏళ్లు గడిచాక ఆయన తానా అధ్యక్షుడు కూడా అయ్యారు. 2002 ప్రాంతంలో జంపాల చౌదరి హైదరాబాదు వచ్చి శాస్త్రిగారి యింటికి వచ్చి, డైరక్టరు కృష్ణవంశీని, నన్నూ, రాజాను కూడా ఆహ్వానించారు. అందరూ ‘‘హాసం’’ పత్రికను ప్రశంసిస్తూన్న సందర్భంలో శాస్త్రిగారు ‘‘పిజి ఉడ్‌హౌస్ అంటే మా నాన్నగారికి చాలా యిష్టం. (వాళ్ల నాన్నగారు యోగిగారు పండితులు, బహుభాషాకోవిదులు. మధ్యవయసులోనే పోయారు) హాసంలో ఉడ్‌హౌస్ కార్నర్ అని నడుపుతున్నారు.’’ అని మెచ్చుకున్నారు. అప్పుడు రాజా విధిలేక ‘అవన్నీ రాసేది యిదిగో యీయనే’ అని పరిచయం చేశాడు.
‘‘హాసం’’లో తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో హాస్యం, సంగీతానికి సంబంధించిన అన్ని అంశాలను డీల్ చేసేవాళ్లం. హాస్యం అంటే పుస్తకాల్లో, నాటకాల్లో, సినిమాల్లో వున్న హాస్యం. సంగీతం అంటే శాస్త్రీయ, జానపద, లలిత, సినిమా సంగీతం. వీటన్నిటి మీద మూడు భాషలకూ సంబంధించిన విషయాలపై సాధికారికంగా రాయగలిగే తెలుగు రచయితలు తక్కువ మందే ఉన్నారు. మేం ఎడిటరుగా పెట్టుకున్న రాజాకు తెలుగు సినిమా సంగీతం గురించి క్షుణ్ణంగా తెలుసు. తెలుగు హాస్యానికి సంబంధించి జోక్స్ శీర్షికలను నిర్వహించిన అనుభవం, కొన్ని హాస్యరచనలు చేసిన అనుభవం వుంది. అంతే! తక్కినవాటిలో కొన్నిటితో ముఖపరిచయం వుంది, మరి కొన్నిటితో అదీ లేదు. అయితే ఆయన అంతకు ముందు ‘‘వార్త’’ సినిమా సెక్షన్‌కు ఎడిటరుగా వుండటం చేత సినిమా వారితో, చాలాకాలం పత్రికలకు కంట్రిబ్యూటర్‌గా వుంటూ శీర్షికలు నడపడం చేత రచయితలతో గాఢ పరిచయాలున్నాయి. అవి చూసే ఆయన్ను ఎడిటరుగా పెట్టుకుని, నేను మేనేజింగ్ ఎడిటరు నయ్యాను.
ఈ విలక్షణ పత్రికకు ఆర్టికల్స్ సేకరించడం పెద్ద పనే అయింది. కొన్నిటికి కొందరు లబ్ధప్రతిష్ఠులు దొరికారు కానీ చాలావాటికి రాసేవాళ్లు దొరకలేదు. దాంతో నేనే చాలా శీర్షికలు రాయవలసి వచ్చేది. అయితే అన్నిటా నా పేరు కనబడితే ఎబ్బెట్టుగా వుంటుందని ‘‘కమ్యూనికేటర్ ఫీచర్స్’’ అనే పేరుతో చాలా రాసేవాణ్ని. కుటుంబసభ్యులు, స్నేహితుల, ఉద్యోగుల పేర్లు వాడుకునేవాణ్ని, కొన్ని పేరు లేకుండానే రాసేవాణ్ని. పత్రికలు నడిపినవారందరికీ యీ కష్టం తెలుసు. ఉడ్‌హౌస్‌పై నాకున్న అభిమానంతో ‘‘ఉడ్‌హౌస్ కార్నర్’’ అనే శీర్షిక తొలి సంచిక నుంచి నడిపాను. కానీ అక్కడ నా పేరుండేది కాదు. పైగా నేను తెర వెనుకనుండే పత్రికకు సంబంధించిన అన్ని పనులూ నిర్వహించేవాణ్ని. రాజాయే అందరికీ కనబడేవాడు. దాంతో ‘‘హాసం’’ అంటే ఆయన ఒక్కడే అనే అభిప్రాయం జనాలకు కలిగింది. అది నన్ను బాధించలేదు. పత్రిక కమ్మర్షియల్‌గా సక్సెస్ కావడం ముఖ్యం తప్ప, పేరుప్రఖ్యాతుల సంగతి తర్వాత చూసుకోవచ్చు అనుకునేవాణ్ని. నా గురించి ఎవరడిగినా రాజా ‘ఆయన బ్యాంకు ఉద్యోగం చేసి వచ్చారు. మేనేజింగే తప్ప ఎడిటరుషిప్ ఏమీ లేద’ని చెప్పేవాడు. తర్వాతి రోజుల్లో యిచ్చిన యింటర్వ్యూలలో ఆయన ‘‘హాసం’’ తన ఐడియాయే అనీ, ‘‘వార్త’’లో తన వ్యాసాలు చూసి వరప్రసాద్ స్వయంగా పిలిచి పత్రిక పెట్టమన్నారని (వాస్తవానికి వరప్రసాద్‌కు రాజా తెలియదు. పిలిచి ఉద్యోగం యిచ్చింది నేను) చెప్పేసుకున్నాడు. ‘‘హాసం’’లో నా అస్తిత్వమే లేదన్నట్లు మాట్లాడాడు.
అలాటిది శాస్త్రిగారి ఎదుట, రాజా ఉడ్‌హౌస్ విషయంలో క్రెడిట్ యివ్వాల్సి వచ్చింది. వెంటనే శాస్త్రిగారు ‘‘రచన’’లో ఉడ్‌హౌస్ తరహా కథలు ‘‘అచలపతి కథలు’’ వచ్చాయి. అది రాసిన ఎమ్బీయస్ ప్రసాద్ మీరేనా?’’ అని అడిగారు. ఔననగానే మురిసిపోయారు. అవేళ చాలాసేపు మాట్లాడుకున్నాం. తర్వాత నా పేర వచ్చిన రచనలన్నీ ఫాలో అవుతూవచ్చారు. ‘‘కిశోర్ జీవనఝరి’’ పేర కిశోర్‌కుమార్ జీవితగాథను నా భార్య ఎమ్మెస్ స్వాతి పేర ‘‘హాసం’’లో సీరియల్‌గా రాశాను. అది ఆయనకు విపరీతంగా నచ్చేసింది. రాజాను పదేపదే అడిగేవాడు – ఎవరీవిడ? అంటూ. రాజా వాయిదా వేసి, వేసి చివరకు ఒత్తిడి తట్టుకోలేక చెప్పేశాడు – ప్రసాద్ గారే అని! ‘అదీ సంగతి’ అంటూ శాస్త్రిగారు పకపకా నవ్వాడట, రాజాయే చెప్పాడు.
దర్శకుడు విఎన్ ఆదిత్య తండ్రి నాకు ఫ్రెండు కావడం చేత, అతని పెళ్లికి వెళ్లాను. అక్కడ శాస్త్రిగారు కలిసి, మా ఆవిడతో ‘‘నాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ నేను మీ ఆయన ఫ్యాన్ని.’’ అన్నారు. ఇది నా గొప్పతనం చెప్పడానికి రాయటం లేదు. ఆయన ప్రశంసించే తీరుని, వినయశీలాన్ని ఉదహరించడానికి చెప్పాను. అలాగే ఆయన నిజాయితీని ఉటంకించడానికి మరొకటి చెప్పి ముగిస్తాను. ‘‘హాసం’’కు ఎంత పేరు వచ్చినా యాడ్స్ వచ్చేవి కావు. తెలుగు పత్రికల్లో ‘‘స్వాతి’’ వీక్లీకి తప్ప (మంత్లీకి కూడా రావు) మరి దేనికీ రావు. సర్క్యులేషన్ పెరిగిన కొద్దీ నష్టాలే తప్ప, పత్రిక నిలదొక్కుకునే పరిస్థితైనా రాదు. 39 నెలలు, 78 సంచికల తర్వాత పత్రిక మూసివేయవలసి వచ్చింది. మూసివేశాక రాజా శాస్త్రిగారి వద్దకు వెళ్లి ‘‘హాసం’’ వంటి పత్రిక పెడదామని ప్రపోజ్ చేశాడు. ఆయన సరేనన్నాడు.
ఇది నాకు చాలా ముచ్చట వేసింది. ఆర్థికంగా నష్టదాయకమైన ప్రాజెక్టుకి డబ్బు పెట్టడానికి ఆయన సిద్ధపడ్డాడు. తెలుగువారికి మంచి అభిరుచి మప్పే పత్రికను నిలబెట్టడానికి ఆయన ముందుకు వచ్చాడు. తనకున్న సినీ పరిచయాలతో యాడ్స్ తెప్పించగలనని అనుకున్నాడేమో తెలియదు. ఎంతకాలం నిలదొక్కుకునేవాడో తెలియదు. కానీ ఉద్దేశమైతే కలిగింది కదా! వరప్రసాద్ స్నేహితుల్లో ఎందరో పారిశ్రామికవేత్తలున్నారు, ఎన్నారైలు వున్నారు, ధనికులున్నారు. అందరూ సాయం చేస్తానన్నవారే తప్ప చేసినవారు లేరు. మొత్తం భారం ఆయనపై పడేశారు. వారెవ్వరికీ రాని సదూహ ఈయనకు వచ్చింది కదాని నాకు ముచ్చట వేసింది. అయితే శాస్త్రిగారి ఊహ కార్యరూపం ధరించపోవడానికి కారణం, అప్పటికే రాజా ప్రవర్తనతో విసిగిపోయిన నేను అతన్ని దూరం పెట్టేశాను. రాజా యీ మాట చెప్పగానే శాస్త్రిగారు ‘ప్రసాద్ తరహా వైవిధ్యం లేనిదే హాసం వంటి పత్రిక రూపు దిద్దుకోవడం అసంభవం. నీ పరిమితులు నాకు తెలుసు. పత్రిక పెట్టను.’ అని చెప్పారు. ఈ మాట శాస్త్రిగారే మూణ్నెళ్ల తర్వాత నాకు చెప్పారు.
ఆయన మరణవార్త వినగానే యివన్నీ గుర్తుకు వచ్చి మనసు కలత పడింది. ఒక గొప్ప కవి, ఒక మేధావి, ఒక మంచిమనిషిని తెలుగు సమాజం కోల్పోయింది. ఆయనకు యిదే నా హృదయపూర్వక బాష్పాంజలి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2021)