ప్రస్తుత ఇరాక్ సంక్షోభానికి కారణం – ఐయస్‌ఐయస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ అల్-షామ్ (గ్రేటర్ సిరియా) అనీ, జిహాద్ పేర శత్రువులను పరిమార్చడంలో ఆ సంస్థ అల్ ఖైదాను మించిపోయిందని, దాని నాయకుడు ఆబూ బకర్ అల్ బాగ్దాదీ బిన్ లాడెన్‌ను కంటె దారుణమైన వాడని అందరికీ తెలుసు. ఆ సంస్థ సిరియాలో అంతర్యుద్ధాన్ని ప్రారంభించి, రాకా వంటి కొన్ని ప్రాంతాలను వశపరుచుకుని అక్కడ షరియా పేరుతో క్రూరమైన శిక్షలు వేస్తోంది. తమను ఎదిరించినవారిని బహిరంగంగా ఉరి వేయడం, క్రైస్తవులపై రక్షణ పన్ను విధించడం జరుపుతోంది. అంతేకాదు, అల్ ఖైదాతో సంబంధం వున్న మరో జిహాదీ సంస్థ నస్రాతో కలిసి తక్కిన ప్రాంతాలలో బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే లక్షా ఏభైవేల మంది సిరియన్లు హతులయ్యారు. 2.30 కోట్ల జనాభాలో మూడోవంతు మంది వూరు వదిలి పారిపోవలసి వచ్చింది. లక్షలాది మంది సిరియన్లు జోర్డాన్, లెబనాన్, ఇరాక్‌లలో శరణార్థులుగా తలదాచుకున్నారు. ఇలాటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి మద్దతు యిచ్చి మతోగ్రవాదులను అదుపు చేయడం సమంజసం.
కానీ అమెరికాకు ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడుపుతున్న అధ్యకక్షుడు బషర్ అల్ అసాద్ అంటే గిట్టదు. అతను అలావీ తెగకు చెందినవాడయినా జనాభాలో 60 శాతం వున్న సున్నీలు అతని నేతృత్వాన్ని సమర్థిస్తారు. అతని బాత్ పార్టీలో 30 లక్షలమంది సభ్యులుంటే అత్యధికులు సున్నీలే. ప్రజలు తన పక్షాన వున్నారు కాబట్టే అతను అనేక జిహాదీ సేనలను అదుపులో వుంచుతూ వచ్చాడు. పాశ్చాత్యదేశాలు, కొన్ని ధనిక అరబ్ దేశాలు యీ వాస్తవాన్ని గుర్తించకుండా అతన్ని బలహీనపరచాలని చూస్తున్నాయి. ''ఫ్రీ సిరియన్ ఆర్మీ'' పేరుతో సైన్యాన్ని తయారుచేసి పాశ్చాత్యదేశాల నిపుణులతో వారికి తర్ఫీదు యిప్పించి సిరియా ప్రభుత్వంపై తిరుగుబాటు చేయించాయి. ఆ ఆర్మీ పనికిరాకుండా పోయాక ప్రస్తుతం వారినే ''ఇస్లామిక్ ఫ్రంట్'' అనే మరో పేరుతో సేన ఏర్పాటు చేసి, అమెరికా నిపుణులు పశ్చిమదేశాల సహాయంతో జోర్డాన్, టర్కీలలో క్యాంపులు నిర్వహిస్తూ సిరియా సైన్యంపై పురిగొల్పుతున్నారు. తమ పౌరులను కూడా వారితో భుజం కలిపి పోరాడమని ప్రోత్సహిస్తూ 'వీరు ఉదారవాదులు, సిరియా సైన్యంతోనే కాదు, నస్రా, ఐయస్‌ఐయస్‌తో కూడా పోట్లాడతారు' అని పైకి చెపుతున్నారు. అమెరికా ఇంటెలిజెన్సు ఏజన్సీల ప్రకారం సిరియాలో 26 వేల మంది తీవ్రవాదులున్నారు. వారిలో 7 వేల మంది విదేశీయులే. వారిలో బ్రిటిష్, ఫ్రెంచ్‌వారు చెరో 1100 మంది వుంటారు. బెల్జియం, హాలండ్, స్కాండినేవియాల నుండి కూడా సైనికులను పంపారు. 70 మంది అమెరికన్లు వున్నారు.
ఓ పక్క యిలా చేస్తూనే 'సిరియాలో అంతర్యుద్ధం జరుగుతోంది. మైనారిటీలైన అలావీలు, క్రైస్తవులకు, ముస్లిములకు మధ్య సాయుధపోరాటాలు జరుగుతున్నాయి. సిరియాలో ప్రభుత్వం దాన్ని అదుపు చేయలేకపోతోంది. అక్కడ తక్షణం అధికారం చేతులు మారాలి. లేకపోతే ఆ యుద్ధం సిరియా సరిహద్దులు దాటి యితర దేశాలకు పాకుతుంది' అని ఒబామా అంటున్నారు. సిరియా ప్రభుత్వం ఇరాన్, రష్యాల మద్దతుతో యీ తీవ్రవాదులతో పోరాడుతూ వారిని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేసింది. ఇలాటి పరిస్థితుల్లో సిరియాలో జూన్ 3 న అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. అసాద్ మళ్లీ ఎన్నిక కాకూడదని అమెరికా శతథా ప్రయత్నించింది. గతంలో అయితే ఒక పార్టీ అభ్యర్థి మాత్రమే ఎన్నికలలో పోటీ చేసే వీలుండేది. వివిధ పార్టీల వారు పోటీ చేయవచ్చంటూ 2007లో రాజ్యాంగాన్ని సవరించారు కాబట్టి యీ సారి హఫీజ్ హజ్జార్ అనే సిరియా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, హసన్ అబ్దుల్లా నౌరీ అనే వ్యాపారవేత్త నిలబడ్డారు. ఎన్నికలలో పాల్గొనడానికి సిరియన్లు ఎగబడ్డారు. ఇతర దేశాల్లో తలదాచుకున్నవారు కూడా సరిహద్దులు దాటి వచ్చి మరీ ఓటు వేశారు. 73% పోలింగు జరిగింది. పోలయిన ఓట్లలో 88.7% ఓట్లు అసాద్‌కు పడ్డాయి. మరో ఏడేళ్లపాటు అధ్యకక్షుడిగా వుండి దేశంలో శాంతి నెలకొల్పమని ఆ దేశప్రజలు అతనికి అవకాశం యిచ్చారు.
అయితే యీ ఫలితం పట్ల అమెరికా మండిపడింది. గత రెండేళ్లగా ఒబామా ''సిరియా అధ్యకక్షుడిగా అసాద్ రోజులు లెక్కపెట్టుకుంటున్నారు'' అంటూ వచ్చాడు. ఇటీవలే వెస్ట్ పాయింట్ మిలటరీ ఎకాడమీలో మాట్లాడుతూ ఒబామా ''తన ప్రజలను ఆకలిదప్పులతో మాడుస్తూ, వారిపైనే బాంబులు వేసే నియంత పాలనను కూలదోయడానికి సిరియన్ ప్రజలకు మనం అండగా నిలవాలి'' అన్నాడు. ఇప్పుడిలా జరగడంతో అమెరికా ప్రభుత్వపు సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెర్రీ ''ఈ ఎలక్షన్ పెద్ద గుండుసున్నా'' అని వర్ణించాడు. అంతర్యుద్ధం నడుస్తూండగా ఎన్నికలేమిటి అని ఎద్దేవా చేశాడు. ఉక్రెయిన్‌లో, నాటో సేనలు ఆక్రమించివున్న ఇరాక్‌లో, అఫ్గనిస్తాన్‌లో కూడా యిలాటి పరిస్థితే వున్నపుడు నిర్వహించిన ఎన్నికలు వారికి ఎబ్బెట్టుగా తోచలేదు. అవి చాలా న్యాయంగా జరిగాయని సర్టిఫికెట్టు యిచ్చారు కూడా. ఇప్పుడు ప్రజలు ఆమోదించిన అధ్యకక్షుణ్ని దింపడానికి కంకణం కట్టుకుంది. తాము ప్రోత్సహిస్తున్న 'ఇస్లామిక్ ఫ్రంట్'కు తర్ఫీదు యిచ్చి అత్యంత ఆధునిక సేనగా మార్చడానికి ఒబామా సిఐఏకు అధికారం యిచ్చినట్లు ''ద వాల్ స్ట్రీట్ జర్నల్'' రాసింది. అంతిమంగా యిది ఎటు దారి తీస్తుందో చూడాలి.
-ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2014)