ఎమ్బీయస్‍: విఎకె ‘ఆలాపన’

మనసా నమ్మి వాచా అమలు చేసే వ్యక్తి. కానీ ఈ క్రమంలో అక్కడక్కడ దూకుడు కనబడుతుంది. దానికి అలవాటు పడి చదివితే యీ పుస్తకాలు ఎన్నో విషయాల గురించి ఎంతో సమాచారాన్ని అందిస్తాయి.

పాటల విశ్లేషణ అనగానే తన పేరు గుర్తుకువచ్చేట్లా చేసుకున్న సంగీత, సాహిత్య, నృత్య విమర్శకుడు వి.ఎ.కె. రంగారావు విశ్వరూపదర్శనం కోసం చదివి తీరవలసిన పుస్తకం ‘ఆలాపన’. ఆంధ్రపత్రిక (వీక్లీ)లో ‘సరాగమాల’ శీర్షిక ద్వారా ఆరు దశాబ్దాల క్రితమే ఈ ప్రక్రియను ప్రారంభించి ఒక తరం పాఠకులకు ఆరాధ్యుడిగా నిలిచారు రంగారావు. ‘మలయమారుతం’ (ఆంధ్రప్రభ వీక్లీ) ‘వినవేడుక’ (జ్యోతి మాసపత్రిక) ఇలా అనేక పత్రికలలో శీర్షికలు నడిపిన రంగారావు తర్వాత వచ్చిన సినిమాపాటలు రుచించకపోవడంతో వీటిని నడపడం మానేశారు. మళ్లీ 20 ఏళ్లకు ‘స్క్రీన్’ వారపత్రికలో ‘సౌండ్స్ ఆఫ్ మ్యూజిక్’’ శీర్షిక ద్వారా ఆంగ్ల పాఠకులకు చేరువయ్యారు. రెండేళ్ల తర్వాత అదీ మానేసిన మరో ఇరవై యేళ్లకు ‘‘వార్త’’ దినపత్రికలో ‘ఆలాపన’ ద్వారా తన అభిమానులను అలరించారు. ఆ వ్యాసాలను రెండు పుస్తకాలుగా తీసుకుని వచ్చారు.

రంగారావు గారి శైలిలో సంగీతాన్ని, సాహిత్యాన్ని, లోకంలోని అనేకానేక యితర విషయాలను స్పృశిస్తూ, విశ్లేషిస్తూ, వ్యాఖ్యానిస్తూ, విసుర్లు విసురుతూ, పాఠకులకు పరీక్షలు పెడుతూ, మందలిస్తూ, మెచ్చుకుంటూ సాగిన శీర్షిక ‘ఆలాపన’. ‘నీదు మార్గమున నీయంత నియంత లేడు’ అన్నట్టు రంగారావు శైలి రంగారావుదే! విజ్ఞాన సముపార్జనలో గాని, దాని ప్రదర్శనలో గాని, అభిప్రాయ వ్యక్తీకరణలో గాని ఆయన పద్ధతి ఆయనదే. ఆయనతో ఏకీభవించవచ్చు, విభేదించవచ్చు కానీ విస్మరించడం మాత్రం ఎవరితరం కాదు. ఈ రంగంలో ఆయన ఓ ‘కల్ట్ ఫిగర్’. రాసేటప్పుడు ఏ పొరబాటు దొర్లినా ‘ఇది రంగారావు కంటపడుతుందేమో, ఏమంటాడో ఏమో’ అని రచయితలు బెదిరే స్థానాన్ని ఆయన నిలువుకుంటూనే ఉన్నారు. ఆయన భావవ్యక్తీకరణలో కాఠిన్యాన్ని సహించలేని వారు సైతం ఆయన సత్యాన్వేషణను, కర్తవ్యనిష్ఠను మెచ్చుకోకుండా ఉండలేరు.

ఆయన నడిపిన ‘సరాగమాల’ వంటివి పుస్తకరూపంలో రాకపోయినా ‘ఆలాపన’ మాత్రం డాక్టర్ ఆర్. భార్గవిగారి వల్ల ఆ భాగ్యానికి నోచుకుంది. ఇందులో ఆయన తన గురించి తాను చెప్పుకున్నవి – “నేను ఇంటర్ ఫెయిలయిన తర్వాత మల్లాది రామకృష్ణశాస్త్రిగారి వద్దకు వెళ్లి కూర్చుని ఏడ్చాను. నా కిదిరాదు, అది రాదు, సంస్కృతం రాదు, వ్యాకరణం తెలియదు, కావ్యాలు రావు’ అంటూ. నన్నిలాగ ఓ పదినిమిషాలు ఏడవనిచ్చి ‘నాయనా నీకు తెలియనివి అయిదో, ఆరో చెప్పావు. ఇంకా నీకు తెలియనివి 108 వున్నాయి’ అన్నారు. ‘‘…నీకు లేనివి చెప్పావు. ఇంకా ఎన్నో ఉన్నాయి అని చెబుతున్నాను. నీకు ఉన్నవి నువ్వు చెప్పుకోలేదు. నీకు నాట్యం మీద ఇంటరెస్టు ఉంది. పదముల గురించి కొంత తెలుసు. పాత సినిమా పాటలంటే నీ కిష్టం. శ్రమ, శ్రద్ధ వీటిలోనే చూపిస్తే సరస్వతి నిన్ను వెదుక్కుంటూ వస్తుంది” అన్నారు.

రంగారావు అనగానే శ్రమ, శ్రద్ధ గుర్తుకు వస్తాయి. దానికి ఉదాహరణ ఈ పుస్తకంలోనే కనబడుతుంది. “బ్రహ్మ కడిగిన పాదము’’ అనే అన్నమయ్య కీర్తనలో ‘పామిడి తురగపు పాదము’ అన్న పంక్తి ఉంది. దాని గురించి రంగారావు రాసినది యిది – ‘బహుశ పామిడి అన్న ఊళ్లో కల్కి అవతారం ఆలయముందేమో అని రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ గారి నడిగితే ‘నాయనా, గుడి వున్నదని రూఢిపరుచుకున్న తరువాతనే ఆ మాట అనవలె’ అన్నారు. దర్యాప్తుపైన అలాంటిదేదీ లేదని తెలిసింది. తి.తి.దే.వారి అన్నమాచార్య ప్రాజెక్టులో పనిచేసే డా॥ కె.వాణిని ‘పామిడి’కి అర్థం అడుగగా, ‘ముక్కిడి యనగా ముక్కు లేనివాడు. పాము + ఇడి = పామిడి, పాము లేకుండా చేయువాడు. అనగా గరుడుడు. తురగమనగా వాహనమని అర్థము. ‘పాము వైరి యైన గరుత్మంతుని వాహనముగాగల విష్ణుమూర్తి అని గరుత్మంతుని వాహనముగాగల విష్ణుమూర్తి అని ఆ వాక్యమున కర్ధము’ అని చెప్పారు.

ఇది తర్కానికి అందని అసందర్భాలాపన అని తెలిసిపోయినా కాదని వాదించే స్తోమతు అప్పటికి లేక ఊరుకున్నాను. ఆ మాటకు సరియైన అర్థం యిప్పుడు సముద్రాల లక్ష్మణయ్య గారి పుస్తకం వలన తెలిసింది. ప్రామిడి= పామిడి= అడ్డమాక లేక ఉద్దండముగా సంచరించు గుఱ్ఱము గల పాదము అని. ఈ అర్థంలోనే మరొక అన్నమయ్య కీర్తన (‘పామిడి కోరికలకు బంటైన వారలు’) లో చూపించి లేశ సంశయాన్నీ దూరం చేశారు.’ చదువు‘కొన్న’ వారిమీద, పేరు చివర పొడి అక్షరాలకై ప్రాకులాడేవారి పైన, అరకొర జ్ఞానంతో అహంకరించే వారి పైన రంగారావు ఒంటికాలిపై ఎందుకు లేస్తారో ఇలాటి సంఘటనలు తెలుపుతాయి. తను వాడే భాష ఎంత పరుషంగా ఉంటుందో తెలిసే ఆయన ఉపయోగిస్తారని ఈ క్రింది వాక్యాలు తెలుపుతాయి –

‘‘ఈ వయసులో నాకు వ్యక్తుల మీద కోపతాపాలు ఉండకూడదు. వారి దుశ్చింతనపై, దుష్కార్యాల పైన ఉంటుంది. ఇది సాహిత్యాన్ని గౌరవించే వారందరికీ ఉండాలి. వారివారికి వీలయిన ధోరణిలో యీ దుండగీడుతనాన్ని ఎదుర్కోవాలి. ఇదీ సాహిత్య సేవే. త్రికరణశుద్ధిగా ప్రజాహిత కర్మ చేయబడినప్పుడు వేనోళ్ల కొనియాడ గలను. అహంకారంతో (నాకీ విషయం తెలుసూ అని) ఆ విషయాన్ని యితరులకు తెలియ జెప్పగలను. అలాగే పెద్ద పీటలపై ఆసీనులైన వారు చేయకూడనిది చేస్తే రేవుకి తీసుకు వెళ్లి ఉతకగలను… దీనికి వెరచేవారు బలహీనతలున్న వారే! చేయవలసినంత శ్రద్ధతో పని చేయనివారే!’’

రంగారావు స్వయంగా డాన్సర్, డాన్స్ క్రిటిక్. రెండు ఆలయాలలో నాలుగు దశాబ్దాల పైబడి నృత్యం చేశారు. తెలుగు సినిమాలలో ఆయన కిష్టమైన నర్తకీమణులెవరని అడిగితే “కమలాలక్ష్మణ్, ఎల్.విజయలక్ష్మి చాలా బాగా చేశారు. ‘‘విప్రనారాయణ’’లో, ‘‘చింతామణి’’లో భానుమతి చాలా గొప్పగా చేశారు. అభినయం ఆవిడ ముఖంలో వలికినట్టుగా, భావాలు ఒలికించినట్లుగా ఏ డాన్సరు ముఖంలో పలకడం నేనెరుగను.” అన్నారు.

సంగీతం, నృత్యంతో బాటు రంగారావు సాహిత్యాన్ని కూడా ఔపోసన పట్టారు. అహల్య రాయి అయిందన్న పుక్కిటి పురాణం గురించి రాస్తూ ‘వాల్మీకి రామాయణమే అసలు సిసలు రామాయణమని నా ఉద్దేశం. అందులో గౌతముని శాపం అహల్య రాయివి కమ్మని కాదు. వాయుభక్షా, అదృశ్యరూపా, భస్మశయ్యా గా ఉండమని. అంటే దుమ్ములో పడి వుండమని. రాముని ఆశ్రమ ప్రవేశంతో విమోచనమన్నాడు. అన్నమయ్య కూడా ‘కామిని పాపము కడిగిన పాద’మని (‘బ్రహ్మ కడిగిన పాదము’లో) అన్నాడు.’అంటూ రాశారు. అందుకే ముందుమాటలో ముళ్లపూడి రమణ గారు రాసినట్టు రంగారావు ‘మ్యూజికాలమిస్టే కాదు, మ్యూజికాలజిస్టూ, లిటరేచరాలజిస్టూ కూడా!’

ఆ కారణం చేతనే కాబోలు, ఈ పుస్తకంలో కనబడే వ్యాసాలు సంగీతానికే పరిమితం కాలేదు. పుస్తక సమీక్షలు, జానపద కళారూపాలు, దర్శనీయ క్షేత్రాలు, ఇతర పత్రికలలో వచ్చిన వ్యాసాలపై వ్యాఖ్యలు – అన్నీ కనబడతాయి. ‘నరాగమాల’ రాసే రోజుల్లో సమకాలీన చిత్రాల పాటల గురించి రంగారావు వ్యాఖ్యల గురించి ఎదురుచూసేవారు. ‘ఆలాపన’కు వచ్చేసరికి ఆ సౌలభ్యం పోయింది. ఏ వారం ‘ఆలాపన’లో ఏమొస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి వచ్చింది. ఈ వారం ‘ఆవారా’ గురించి రాస్తే వచ్చేవారం ‘కృష్ణాతీరం’ గురించి కావచ్చు. ఆ పైవారం వరంగల్ కోటలో ఆయనకు ఆలయాలు చూపినతని గురించి కావచ్చు. అయితే ‘ఆలాపన’ అని పేరు పెట్టినందుకు కాబోలు అన్ని వారాల్లోనూ క్రమం తప్పకుండా ఓ పాట సాహిత్యం ఇచ్చారు. వాటి సూచిక చివర్లో ఇచ్చారు. అవన్నీ పాతవే కావడం చూసి రంగారావు గారికి కొత్తంటే పడదు కాబోలు అనుకుంటే పొరబాటు. ఆయన తన అభిరుచుల గురించి చెబుతారు కానీ అందరూ అదే పట్టుకు వేళ్లాడాలని అనరు. పాతవాళ్లందరూ ఘనులని పొగడరు. మచ్చుకు కొన్ని చెప్తాను.

*“సంగీతపరంగా స్వర్ణయుగం అనేది మనిషి వయసును బట్టి మారుతుంది. మీ కొలమానాలు 12-19 సం॥ల మధ్య ఘనీభవిస్తాయి. నాకు 1938 నుండి 1951 వరకూ వచ్చిన సినిమా సంగీతం చాలా ఇష్టం, నేను దానిలో ప్రత్యేక పరిశ్రమ చేసినవాడిని కాబట్టి.” * “దేవదాసు’’లో ‘తానే మారెనా గుణమ్మే మారెనా’ ఎందుకూ పనికిరాని టెక్స్ట్. ముందుగా అరవంలో ‘అన్బే పావమా’ అని తయారు చేసుకుని దానికి తగ్గట్టు రాసేరు. తను మారడం వేరు, గుణం మారడం వేరూనా? సాహిత్యం, ట్యూను పడుగు, పేకలా ఉండాలి. ఏది సరిగా లేకపోయినా చీర బాగా లేదంటాం.”

* “పాశ్చాత్య పోకడలు కర్ణాటక సంగీతంలో వినిపించింది ఇళయరాజా కాదు. ఎ.ఆర్.రెహమాన్ కాదు. త్యాగరాజు, దీక్షితార్! బ్యాండ్ మేళం వినే త్యాగరాజు ‘శరశరసమరైక’ కుంతలవరాళిలో చేశారు. అలాగే దీక్షితార్!” * “చెంచులక్ష్మి’’లో టైటిల్ మ్యూజిక్‌గా సి.ఆర్.సుబ్బురామన్ లాటిన్ అమెరికన్ మ్యూజిక్ వినిపించాడు.” * “అదే సంవత్సరంలో ‘‘మంగమ్మా శపథం’’ అనే తమిళ సినిమాలో రాజేశ్వరరావు ‘మామా యూ కేరో..’ఇంగ్లీషు ట్యూన్స్‌ను కొంతవరకు ఎడాఫ్ట్ చేసుకుని వరుసలు చేశారు.” * “సుబ్బురామన్ వుండే మంచితనం, రాజేశ్వరరావులో లేనిదీ ఏమిటంటే ఆ యా కంఠాలకి తగిన సంగతులే వేయడం. రాజేశ్వరరావువి సేడిస్టిక్ వేషాలు. సింగర్ కంఠంలో ఏ సంగతి పడదో ఆ సంగతి వేసి వారు పాడలేకపోతూంటే ‘అమ్మాయి గారు అలా పాడటం లేదు సార్’ అనేవాడు. పెండ్యాల ఎవర్ని పెట్టుకుంటే వాళ్ల కంఠాలలో ఏ ఒదుగు అందంగా ఉంటుందో అదే పెట్టేవారు. సి.రామచంద్ర కూడా టు ఏ లార్జ్ ఎక్స్టెంట్ అంతే!”

అంత గొప్ప రాజేశ్వరరావుపై ఇంత ఘాటు వ్యాఖ్యలా!? రమణగారు ముందుమాటలో అననే అన్నారు – ‘రంగారావు తినడం కోసం కాకుండా వినడం కోసం బ్రతికే ఋషి. గడ్డం పెంచని, గాంభీర్యం నటించని మహర్షి. ఆగ్రహం వస్తే దుర్వాసుడు. అనుగ్రహం వస్తే అశుతోషుడైన భోళాశంకరుడు. పేచీ, పంతం వస్తే శకునీ, చాణక్యుడూ, మేకియవిల్లీ మేనమామ.’

మల్లాదిరామకృష్ణ శాస్త్రి గారిపై వీరభక్తి చాటుకున్నా సముద్రాల-మల్లాది పాటల విషయంపై ‘నడిరేయి గడిచేనే చెలియా’ పాటపై రాసిన వ్యాసంలో రంగారావు తన అభిప్రాయం ఖచ్చితంగా రాశారు – “సముద్రాల జూనియర్ నాతో చెప్పిన ఒక విషయం గుర్తు చేసుకోవాలిక్కడ. “ఆ రోజుల్లో రచన మా నాన్నగారి పేరున ఉన్నా, నా పేరున ఉన్నా, దాంట్లో మల్లాది వారి హస్తం ఉండడానికి అవకాశం ఉంది.” దీనివలన ఆ తండ్రీ కొడుకుల పేరున వచ్చిన ప్రతిపాట మల్లాది వారిదే అనుకోవడం అనవసరం. పోకడను బట్టి నిర్ణయించుకోవాలి.”

రంగారావు ఆరాధించే మరో వ్యక్తి సి. రామచంద్ర. ఆయనను కలిసి మీరు పాడిన పాటలు చాలా బాగుంటాయని అంటే రామచంద్ర ‘సంగీతంలో మీ టేస్టు చాలా పూర్. మీరు చెప్పిన పాటల్లో నూటికి తొంభైశాతం వేరెవరో పాడాలని ప్లాను చేసినవి. ఆ మనిషి అప్పటికి రాకపోతే నేను పాడాను. అవి గొప్పగా ఉన్నాయంటున్నావ్ నువ్వు.” అని ఎగతాళి చేశాడు. దానికి రంగారావు ఇచ్చిన వివరణ చాలా బాగుంది. “ఆయన్ని వండర్‌ఫుల్ సింగర్ అన్నాను కానీ గ్రేట్ సింగర్ అనలేదు. నా తరంలో గ్రేట్ సింగర్స్ అంటే రఫీ, ఘంటసాల యిద్దరే. ఎం.ఎస్.రామారావు ఒక పదిపాటలు వండర్‌ఫుల్‌గా పాడాడు. అతన్ని గ్రేట్ సింగర్ అని ఎవరూ అనరు. నేనూ అనను.” తనకు ఏ మేరకు నచ్చినదీ తనకు తాను బాగా తెలుసుకొని, ఆ మేరకే మెచ్చుకోవడం రంగారావు పద్ధతి అని ఈ వాక్యాలు తెలుపుతాయి.

‘ఆలాపన’ శీర్షికలో రంగారావు పుస్తకాలనే కాదు, పత్రికలనూ సమీక్షించారు. 39 ఏళ్లగా కర్ణాటక సంగీతంపై వెలువడుతున్న ‘గానకళ’ గురించి, లలిత చిత్రసంగీత ప్రియులకై నడిచిన ‘రసమయి’ ఆంధ్రప్రభ వీక్లీలో నడిపిన ‘మధురగీతాలు’ ‘కళాదర్శనమ్’ ‘హరివంశబచ్చన్ ఆత్మకథ’ శీర్షికల గురించి రాశారు. మా ‘‘హాసం’’ని మెచ్చుకుని, ‘కొనండి, కొనిపించండి, చేయూత నివ్వండి’ అంటూ పాఠకులకు పిలుపునిచ్చారు. నచ్చిన చోట అడక్కుండానే ఇతరుల కృషిని ఇలా మెచ్చుకునే రంగారావు నచ్చని చోట అతి కర్కశంగా తిట్టిపోస్తారు. HMV కంపెనీ వారి గురించి ‘బ్రిటిషు ఈస్టిండియా కుంఫిణీలాగే యీ కుంఫిణీ కూడా కొల్లగొట్టుతున్నది. నిర్మాణసంస్థల పేర్లు వేయక వాటికి రావలసిన రాయల్టీ గడ్డివాము చేస్తున్నది. తానివ్వవలసిన రాయల్టీ ఎగగొట్టి తందనా లాడుతున్నది’ అంటూ విరుచుకు పడ్డారు.

ఈ ధర్మాగ్రహాన్ని అర్థం చేసుకోగలం, సమర్థించగలం. కానీ దీన్ని వ్యక్తపరిచే క్రమంలో ఆయన వాడే భాష మరీ తీవ్రంగా ఉందనిపిస్తుంది. దానికి కారణం ఆయన ఒక మిషనరీ. ‘చదువులు కొనే కొందరికీ, వాటినమ్మే కొందరికీ సినిమా అంటే ఉండే నిర్లక్ష్యం, దీని వలన ఉత్పన్నమయే తప్పులు బయటకు చెప్పాలి. నిర్లక్ష్యం చేస్తే వారి కర్మ అని ఊరుకోవచ్చు. తప్పులు వ్రాస్తే ఊరుకోకూడదు. వాటినెందరో తిరిగి రుబ్బుతారు. ఈ వాస్తవమేథాన్ని నేను ఆపలేక పోయినా అడ్డే ప్రయత్నమైనా చేయాలి.’ అని మనసా నమ్మి వాచా అమలు చేసే వ్యక్తి. కానీ ఈ క్రమంలో అక్కడక్కడ దూకుడు కనబడుతుంది. దానికి అలవాటు పడి చదివితే యీ పుస్తకాలు ఎన్నో విషయాల గురించి ఎంతో సమాచారాన్ని అందిస్తాయి. (ఫోటో – ఆలాపన పుస్తకం, విఎకె, భానుమతి, సి రామచంద్ర, ఎల్ విజయలక్ష్మి)

– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2025)

mbsprasad@gmail.com

8 Replies to “ఎమ్బీయస్‍: విఎకె ‘ఆలాపన’”

  1. వి ఏకే గారి గురించి ఎంత రాసినా తక్కువే…మీ అనుభవాలను కూడా పంచుకోండి…

    1. చాలా ఉన్నాయి. అవన్నీ పాఠకులకు ఆసక్తికరం అనుకోవటం లేదు. ఆయన గురించి యీ తరంలో చాలా తక్కువమందికి తెలుసు

  2. Thanks for the article sir. I’ve read about Sri VAK in your ‘బాపుకి బాష్పాంజలి’ ( Regarding Rodin sculptures you’ve mentioned VAK garu)

    After reading your ‘నాలుగు తరాలు నిలిచే భాగవతం’ I had the privilege of purchasing last copy of Mullapudi Gari Bhagavatam. Unfortunately that’s was not the case with this Alapana and Other books ( అందాల అ ఆ లు’ , ‘ శ్రీరామరాజ్యం స్క్రిప్ట్’ , ముళ్ళపూడి వారి సాహితీ సర్వస్వం’

Comments are closed.