కెవి: రైతు ప్రతినిథులుగా వ్యవసాయ నిపుణులు

ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరపై ఆధారపడ వలసిన అవసరం లేకుండా వ్యవసాయాన్ని కిట్టుబాటు వ్యవహారంగా చేయడం ఎలా?

2024లో జయశంకర్‌ అగ్రికల్చరల్‌ యూనివర్శిటీ విద్యార్థులను ఉద్దేశించిన ప్రసంగ వ్యాసమిది. భారతదేశం పారిశ్రామికంగా ఎదుగుతున్నా, సేవారంగంలో అంతర్జాతీయంగా ప్రఖ్యాతి తెచ్చుకుంటున్నా, అది ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడిన దేశం. జనాభాలో 70% మంది యిప్పటికీ వ్యవసాయంపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆధారపడుతున్నారు. ఐఐటిలు చేసినవారు, ఐఐఎమ్‌ పట్టభద్రులూ కూడా ఆర్గానిక్‌ ఎగ్రికల్చర్‌లోకి, ఫుడ్‌ ఇండస్ట్రీలోకి వస్తున్నారు. ఏ రాజకీయవేత్తా రైతు సంక్షేమం గురించి మాట్లాడకుండా తన ప్రసంగాన్ని ముగించలేడు.

వ్యవసాయరంగం ఎంత ముఖ్యమైనదో నొక్కి వక్కాణించ నక్కరలేదు. కానీ ఆ రంగానికి సంబంధించిన నిపుణులు సరైన దిశలో పయనిస్తున్నారా అనే సందేహం నాకు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. నా మాటలకు నొచ్చుకునే వారు కాస్త నిదానిస్తే నా వాదన వినిపిస్తాను. ఇంజనీరింగు రంగం కానీ, వైద్యరంగం కానీ ఆ యా రంగాలలో ఉత్పాదకులు, అంటే ఇంజనీరింగ్‌ ప్రోడక్ట్‌స్‌ తయారు చేసేవారు, వైద్యపరికరాలు తయారు చేసేవారు, ఔషధాలు అమ్మేవారు… వీరందరూ దినదినాభివృద్ధి చెందుతున్నారు. కానీ వ్యవసాయం రంగంలో ఉత్పత్తిదారు, అనగా రైతు అభివృద్ధి చెందుతున్నాడని చెప్పగలమా?

అభివృద్ధి చెంది ఉంటే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నాడు? ఋణగ్రస్తుడు ఎందుకవుతున్నాడు? తన ఋణాలు మాఫీ చేస్తాననే రాజకీయ నాయకుడి పట్ల ఆశగా ఎందుకు చూస్తున్నాడు? మద్దతు ధర కోసం, సబ్సిడీల కోసం ఎందుకు అర్థిస్తున్నాడు? తన కుమారుణ్ని వ్యవసాయంలో దిగవద్దని ఎందుకు వారిస్తున్నాడు? కారణాలు రాయబోతే పేజీకి ఇటూఅటే కాదు, మరో ఎడిషనల్‌ షీటు తీసుకోవాల్సి వస్తుంది. కర్ణుడి చావుకి ఆరుగురే కారణం కానీ, రైతు చావుకి అరవై కారణాలు కనబడతాయి. నకిలీ విత్తనాల నుంచి మొదలుపెడితే మార్కెటింగు సౌకర్యాల లేమి దాకా, మార్కెట్‌ ఆటుపోట్లు తట్టుకోలేక గుండెపోటు తెచ్చుకోవడం దాకా కారణాలే కారణాలు. వ్యవసాయం జూదంగా మారిన యీ రోజుల్లో రైతు భూమి ఎందుకు సాగు చేస్తున్నాడు అంటే అది అతనికి ఒక వ్యసనంగా మారిందనే సమాధానం వస్తుంది. వ్యసనం కారణంగా దివాలా తీసినవాడు ఉరేసుకున్నట్లు, రైతు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాడు, గతంలో ఎన్నడూ లేనట్లు! ఇది మారాలి.

ఒక వ్యవసాయ నిపుణుడికి, అగ్రికల్చర్‌ గ్రాజువేట్‌కి రైతే కదా కేంద్రం. మరి రైతు పరిస్థితి యింత దీనంగా, దయనీయంగా ఉంటే వీళ్లేం చేస్తున్నట్లు అనే అనుమానం వస్తోంది నాకు. ఎవరైనా ఒక పూట అన్నం పెడితేనే ‘అన్నదాతా సుఖీభవ’ అని దీవిస్తాం కదా! ఏడాదంతా అన్నం పుట్టడానికి కారకుడైన అన్నదాతను సుఖంగా ఉంచే మార్గం గురించి వీళ్లు ఆలోచించటం లేదా? వీళ్ల చదువు వీళ్లకు ఆ విద్య, ఆ ఆలోచనా ధోరణి, ఆ ఒడుపు నేర్పటం లేదా? అంతెందుకు నకిలీ విత్తనాలను గుర్తించే సాధనం యిప్పటిదాకా కనుక్కోలేదా? కడుపులో ఉన్న బిడ్డలో ఏ లోపాలున్నాయో కూడా స్కాన్‌ చేసి చెప్పేస్తున్నారే! విత్తనం యొక్క నాణ్యతను నాటడానికి ముందే చెప్పలేరా!?- అని సందేహం వచ్చి ఒక నిపుణున్ని అడిగితే అయ్యో యూనివర్శిటీలో సీడ్‌ టెక్నాలజీ వింగ్‌ ఉందండీ అన్నారు. కానీ దాని సేవలను ప్రభుత్వశాఖలు ఉపయోగించు కోవాలి కదా! ..అని చేర్చారు.

ఏడు చేపల కథలో లాగ, అన్ని రకాల ఫిర్యాదులు చివరకు ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఆగుతాయి. అగ్రికల్చరల్‌ యూనివర్శిటీలు అనేక హైబ్రిడ్‌ పంటలను, టెక్నాలజీలను డెవలప్‌ చేసాయని, తన ఎక్స్‌టెన్షన్‌ సర్వీసుల ద్వారా రైతుల దాకా అది చేర్చాయనీ విన్నాను. రైతులకు సేవలందించడానికి యీ విశ్వవిద్యాలయ విద్యార్థులు, శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నారు. వాటి అవసరమున్న రైతులూ సిద్ధంగా ఉన్నారు. అనుసంధానం చేయవలసిన ప్రభుత్వం తన బాధ్యత నిర్వర్తిస్తోందా అన్నదే తెలియకుండా ఉంది.

వ్యవసాయ విద్య అంటే దిగుబడి ఎలా పెంచడం, ఏ రకమైన నేలలో, ఏ సీజనులో ఏ పంట వేయాలి, ఏ రకమైన విత్తనం వేయాలి, ఎరువు ఎంత వేయాలి, ఏ పెస్టిసైడ్‌ ఎంత మోతాదులో వేయాలి, లాబరేటరీలో ప్రయోగించి చూసిన కొత్త రకాలు పొలాల్లో పండిరచడానికి ఏ విధానాలు ఆచరించాలి, యిలాటివి నేర్పడమే అని అనుకుంటే సరిపోతుందా? అనే ప్రశ్న ఉదయించినప్పుడు లాబ్‌ టు ల్యాండ్‌తో బాటు ల్యాండ్‌ టు మార్కెట్‌ అనే కాన్సెప్ట్‌ కూడా జోడిరచాలి అని తోస్తుంది. మార్కెట్‌ అనగానే ఉత్పత్తి చేసినది అమ్మడమొకటే కాదు, మన ఎంటర్‌ప్రైజ్‌ మార్కెట్లో నిలబడాలంటే ఏం చేయాలి, అవసరం పడితే ఎవరితో, ఏ మేరకు చేతులు కలపాలి అనేది కూడా తెలుసుకోవాలి.

ఎంటర్‌ప్రెనార్‌గా గడిచిన అనుభవంతో చెప్తున్నాను – దేన్నయినా తయారు చేయడం ఒక ఎత్తు, దాన్ని మార్కెట్‌ చేయడం రెండు ఎత్తులు! కంటికి కనబడని హెపటైటిస్‌-బి వైరస్‌తో పోరాడి దానికి వ్యాక్సిన్‌ కనుక్కోవడానికి పడిన శ్రమ కంటె ఆ వ్యాక్సిన్‌ను మార్కెట్‌ చేయడానికి పడిన శ్రమ పదింతలు ఎక్కువ. మార్కెట్లో వైరస్‌లు కూడా కంటికి కనబడవు. వ్యవస్థ మొత్తమంతా అల్లుకుని ఉంటాయి. తీగల్లా కాళ్లకు చేతులకు చుట్టేసుకుని దిగ్బంధం చేసేసి అడుగు ముందుకు పడనివ్వవు. అంతేకాదు, పెట్టిన పెట్టుబడి తిరిగి రాక, ఋణాల ఊబిలోకి నెడతాయి.

రైతు పరిస్థితీ అంతే. ఒక సైంటిస్టుకి తన పరిశోధన పూర్తయ్యేవరకు టెన్షనే. ప్రయోగం సఫలమౌతుందో, విఫలమౌతుందో సస్పెన్సే. రైతుకీ అంతే. పంట వేసినదాకా ఉండి వర్షం వస్తుందో రాదో తెలియదు. మన దేశంలోని రైతులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఋతుపవనాల మీద ఆధారపడే రైతులు, ఇరిగేషన్‌ సౌకర్యం ఉన్న రైతులు. ఈ గ్లోబల్‌ వార్మింగ్‌ ధర్మమాని, నిపుణులు కూడా మాన్‌సూన్‌ ఎప్పుడు వస్తుందో, ఎంతకాలం ఉంటుందో చెప్పలేక పోతున్నారు. ఒక పక్క చూస్తే చంద్రయాన్‌, మంగళయాన్‌ అంటూ రోదసిలో విన్యాసాలు చేస్తున్నాం. మనం నివసించే నేలపై బీళ్లకు యిరిగేషన్‌ సౌకర్యం ఏర్పాటు చేయలేక పోతున్నాం. ప్రభుత్వాలకు ప్రాధాన్యతలు అలా ఉన్నాయి. వాటిని ఏమీ చేయలేం కాబట్టి రైతుల జీవితాలు వాన రాకడపై ఆధారపడకుండా చేసేట్లా యూనివర్శీటీలు పరిశోధనలు చేయాలి.

వర్షం వచ్చినా వస్తే తగుమాత్రంగా వస్తుందో, కుంభవృష్టి కురిసి పంటంతా కొట్టుకుపోతుందేమో తెలియదు. ధాన్యం తడిసిపోతే అమ్ముడు పోతుందో లేదో తెలియదు. కేంద్రం, రాష్ట్రం మధ్య రాజకీయ కారణాలతో తగవులు పుట్టుకుని వచ్చి కొనే పని మీదంటే మీదని వాదులాడుకుంటారేమో తెలియదు. ఇవన్నీ చూసి రైతు ఎందుకొచ్చిన వ్యవసాయంరా బాబూ, తప్పుకుంటే పోలేదా, సాగు చేసే బదులు ఎంతో కొంత ఎడ్వాన్సు తీసుకుని రియల్‌ ఎస్టేటు కంపెనీకి అప్పచెప్పేస్తే వాళ్లు ప్లాట్లుగా చేసి అమ్ముకుంటూ అప్పుడప్పుడు కాస్తకాస్త చేతిలో పెడతారు చాలు అనుకుంటున్నాడు. రాబడి సంగతి సరే, దశాబ్దాలుగా తను సాధించిన వ్యవసాయకళ ఉపయోగానికి రాకుండా పోతోందే, తనకూ వ్యాపకం లేకుండా పోతోందే అనే బాధ అతన్ని కలచివేస్తోంది.

నిజానికి యిది చిత్రమైన పరిస్థితి. వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండు పోనుపోను పెరుగుతూనే పోతోంది. జనాభా నిత్యం పెరుగుతోంది. కుటుంబ నియంత్రణ అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు పన్ను వసూళ్లలో తమ వాటా తగ్గిపోవడం చూసి, నాలిక కరుచుకుని, ఉత్తరాది రాష్ట్రాలతో సమానంగా జనాభా పెంపు కోసం యికపై ప్రోత్సహించవచ్చు. కొందరు నాయకులు పిల్లల్ని కనండి, ఎంతమంది పిల్లలుంటే అంత ఎక్కువగా సంక్షేమ పథకాలు యిస్తాం అంటూ జనాల్ని ఊదర గొడుతున్నారు. అందువలన రాబోయే రోజుల్లో మన దేశ జనాభా మరింత పెరుగుతుందనుకోవచ్చు.

జనాభా సంఖ్యాపరంగా పెరగడమే కాదు, తిండీ ఎక్కువగా తింటున్నారు. ఒకప్పుడు పెళ్లి విందులో ఒక 15 ఐటమ్స్‌ ఉంటే గొప్ప. ఇప్పుడు 50, 60 కనీసం ఉంటున్నాయి. ఇళ్లల్లో వంటిళ్లు కొన్ని సమయాల్లోనే యాక్టివ్‌గా ఉండేవి. ఇప్పుడు స్విగ్గీ వాడు 24 గంటలూ సప్లయి చేస్తున్నాడు కాబట్టి వేళాపాళా లేకుండా తినడానికి మరిగాం. ఒళ్లు పెరిగిపోతోందని అంటూనే కొత్తకొత్త రుచులంటే ఎగబడుతున్నాం. అది చూసే హోటల్‌ వాళ్లు వింత వింత పేర్లతో డిష్‌లు తయారుచేసి వదులుతున్నారు. కేవలం వంటల గురించి చెప్పడానికి కొన్ని టీవీ ఛానెళ్లు వెలిశాయి. యూట్యూబు చూడబోతే వేలాది వీడియోలు – ఏ వంటకం ఎలా చేయాలి అని.

ఫుడ్‌ మార్కెట్‌ యింత విపరీతంగా పెరుగుతున్నపుడు మరి సప్లయిర్‌ కుదేలు కావడం ఎలా సాధ్యం? మద్యం మార్కెట్‌ బాగా పెరిగింది. డిస్టిలరీలు బాగా సొమ్ము చేసుకుంటున్నాయి. మరి రైతుల పరిస్థితి మాత్రం యిలా ఉందేం? షెఫ్‌లు ఈ డిష్‌ల్ని మెటల్స్‌తోనో, కెమికల్స్‌ తోనో తయారు చేయడం లేదు కదా! పండిన వాటితోనే కదా చేసేది! మరి పండించినవాడి డొక్కలు ఎండిపోవడమేమిటి? వింతగా లేదా? ఎందుకిలా జరుగుతోంది అని మీరు ఆశ్చర్యపడ్డారా? దీన్ని సవరించడం ఎలా అని మైండ్‌ అప్లయి చేశారా? వ్యవసాయాన్ని లాభసాటిగా ఎలా నిర్వహించాలి? ఎలా విస్తరించాలి? అనే విషయంలో మీరు రైతుకి చెప్పగలుగుతున్నారా?

క్రాప్‌ డైవర్సిఫికేషన్‌ అవసరం మీరు అతనికి నొక్కి చెప్పారా? సాంప్రదాయ వ్యవసాయంతో పాటు హార్టికల్చర్‌, యానిమల్‌ హజ్బెండరీ కూడా చేపట్టడాన్ని ఇంటిగ్రేటెడ్‌ అగ్రికల్చర్‌ అంటున్నారు. ఒక దానిలో ఎగుడుదిగుళ్లు వచ్చినపుడు మరొకటి మిమ్మల్ని ఆదుకుంటుంది అని రైతుని కన్విన్స్‌ చేయగలుగుతున్నారా? ఏటా రూ.5 వేల కోట్ల చొప్పున ఐదేళ్ల పాటు 25 వేల కోట్లు ఖఱ్చు పెట్టగలిగితే ఆ తర్వాత నుంచి హార్టికల్చర్‌లో మంచి ఆదాయం వస్తుందని మీరు అతనికి చెప్తున్నారా? పైగా దానివలన నీరు, విద్యుత్తు కూడా ఆదా అవుతుందని అతనికి బోధపరుస్తున్నారా? మీ సిలబస్‌లో దానికి సంబంధించిన అంశాలున్నాయా?

కూలీల సమస్య అధిగమించడానికి, ఉత్పాదన పెంచడానికి యంత్రాల వాడకం పెంచాలని అతనికి చెప్పారా?

ఒక యింజనియర్‌ కాలేజీలో చదువుతో సరిపెట్టడు. బయటకు వెళ్లి ఒక పరిశ్రమలో పని చేసి ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసి సబ్మిట్‌ చేస్తేనే పట్టా యిస్తారు. ఒక డాక్టరు కూడా అంతే, హౌస్‌ సర్జన్సీ చేస్తేనే డిగ్రీ చేతికి వస్తుంది. మరి అగ్రికల్చర్‌ గ్రాజువేట్స్‌ కూడా పొలాల్లో రైతులతో కలిసి భుజంభుజం కలిపి పని చేస్తారా? నేటి రైతు ఎదుర్కునే ప్రధాన సమస్య – వ్యవసాయ కూలీల సమస్య. రైతులకు, కూలీలకు మధ్య ఘర్షణ ఎన్నో తరాలుగా ఉంది. కూలీలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు దొరకడంతో కూలీల లభ్యత అనేది యిబ్బందికరంగా మారుతోంది. నరేగా వంటి పథకం వలన మాకు కూలీలు దొరకకుండా పోయారంటారు రైతులు. అనావృష్టి ప్రాంతాల్లో అదే మాకు కొంతకాలమైనా తిండి పెడుతోంది అంటారు కూలీలు. ఈ పథకాన్ని ఎక్కడ అమలు చేయాలి, ఎక్కడ అమలు చేయనక్కరలేదు అనేది సమస్యపై పూర్తి అవగాహన ఉన్నవారు మాత్రమే చేయగలరు.

ఎరువులు విపరీతంగా వాడే దేశాల్లో ఇండియా ఒకటి. భూసారం పరీక్ష చేసి చూస్తే ఏ మేరకు ఎరువులు అవసరం పడతాయో అవగాహనకు వచ్చి ఎరువులపై ఖర్చు కూడా తగ్గుతుంది. సాయిల్‌ టెస్టింగ్‌ లేబ్స్‌ పెడితే వ్యవసాయ ఖర్చులూ మిగులుతాయి. అగ్రికల్చరల్‌ గ్రాజువేట్స్‌కు ఉద్యోగావకాశాలూ పెరుగుతాయి. ఇవన్నీ రైతులకు నచ్చచెప్పాలంటే విద్యార్థులు రైతులతో కలిసి కొంతకాలం పొలాల్లో పని చేయాలి. మట్టి అంటే అంటరానిది అనుకోకూడదు. ప్రాక్టికల్‌గా కొన్ని రోజులు రైతుగా పని చేసినవారికే సమస్య గురించి స్పష్టత వచ్చి, పరిష్కారాలు చూపగలరు. వారి సాధకబాధకాలేమిటో ప్రత్యక్షంగా అనుభవించి, తర్వాత సలహాలివ్వడం చూపగలరు.

ఇలాటి పథకం అమలులో ఉందా? అని సందేహం వచ్చి ఆరా తీసినప్పుడు ‘ఈ విషయాన్ని గుర్తించి జయశంకర్‌ అగ్రికల్చరల్‌ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌గా పని చేసిన రఘోత్తమ రెడ్డిగారు 1981లోనే RAWEP Programme అని ప్రవేశ పెట్టారని, అది తక్కిన యూనివర్శిటీలలో, విదేశాలలో కూడా అనుసరిస్తున్నార’ని ఒకాయన చెప్పారు. అది ఎంత ఎఫెక్టివ్‌గా పని చేస్తోందో ఆయన చెప్పలేక పోయారు కానీ రైతులతో ఇంటరాక్షన్‌ ఉంది కానీ ఇండస్ట్రీస్‌తో, ఏజన్సీస్‌తో మాత్రం లేదండీ అన్నారు.

గ్లోబలైజేషన్‌ తర్వాత ఇండస్ట్రీస్‌తో, కార్పోరేట్స్‌తో సంపర్కం అనివార్యమైంది. వ్యవసాయం కూడా ఒక వ్యాపారమే. సప్లయి-డిమాండు థియరీ ప్రకారమే వ్యాపారం సాగించాలి. కానీ రైతులకు యీ విషయంలో ఎవరూ గైడెన్స్‌ యిస్తున్నట్లు కనబడదు. పక్కవాడు ఏ పంట వేస్తే తనూ అదే వేసేస్తున్నాడు, ఈ ఏడాది ఫలానా పంటకు డిమాండు ఉంది కదాని వచ్చే ఏడాదీ అదే వేస్తున్నాడు. ఫలితంగా అందరూ ఒకే పంట వేసి, సప్లయి పెంచేసి, డిమాండు పడగొట్టి, నష్టపోతున్నాడు. టొమాటో ధర కిలో రెండు రూపాయలై పోయి, అమ్ముకోలేక రైతు టొమాటోలన్నీ వీధిలో పారబోసుకున్నాడు అని విన్నపుడు ప్రాణం ఉసూరు మంటుంది. పోనీ టొమాటో కిలో 60 రూ.లు అమ్మినపుడు అతను లాభపడుతున్నాడా? అదీ లేదే! దళారి బాగుపడుతున్నాడు అంటున్నారు.

టొమాటోలు అంత విరివిగా పండినప్పుడు వాటిని పారబోయకుండా సాస్‌ కిందో, జామ్‌ కిందో మార్చవచ్చుగా అనే ఆలోచన యీనాటిది కాదు. జిల్లా స్థాయిలో ఆగ్రో బేస్‌డ్‌ యిండస్ట్రీలు పెట్టి యీ సమస్యకు పరిష్కారం కనుగొనాలని నా చిన్నప్పణ్నుంచి వింటూనే ఉన్నాను. రాజీవ్‌ గాంధీ దీని గురించి చాలా మాట్లాడేవాడు. అవేమీ జరగలేదని అర్థమౌతోంది. ప్రభుత్వం దీని గురించి గట్టిగా ఆలోచించాలి. కనీసం సెకండరీ ప్రాసెస్‌ గురించైనా ఏదైనా చేయాలి.

సరే, దాని మాట ఎలా ఉన్నా డిమాండుకి, సప్లయికి మధ్య తూకం పాటించాలనే మినిమమ్‌ అవగాహన రైతుకి ఎందుకు కొరవడుతోంది? గతంలో అయితే రైతుల్లో నిరక్షరాస్యు లుండేవారు. కానీ అక్షరాస్యత పెరిగిన యీ రోజుల్లో వారిలో చాలామంది కనీసం టెన్తో, ఇంటరో చదివి ఉంటారని అనుకోవచ్చు. మరి వారికి తోచటం లేదా? ఎవరూ చెప్పటం లేదా? ఏ పంటలు వేయాలన్న విషయంపై తెలంగాణ ప్రభుత్వం ఏడాదో, రెండేళ్లో సూచనలిచ్చిందని చదివాను. తర్వాత ఎందుకు మానేసింది? ప్రజాస్వామ్యంలో అలాటి ఆదేశాలివ్వడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగకరమని ఎవరైనా అన్నారా?

పంట ఏది వేయాలో ప్రభుత్వం చెప్తే వాళ్లను నమ్మకపోవచ్చు. అది తమ బాగు కోసమే అని అనుకోక పోవచ్చు. అదే ఒక వ్యవసాయ పట్టభద్రుడు వాళ్ల మనిషిగా చెపితే? …ఔను! అతను రైతుల తరఫున ఉద్యోగిగా నిలబడాలి. అతను ప్రభుత్వోద్యోగిగా మారకుండా రైతుల తరఫున ఉద్యోగిగా మారాలనేదే నా ఆకాంక్ష. కాస్త స్పష్టంగా చెప్పాలంటే ఈ పట్టభద్రులందరూ తలో కురియన్‌ కావాలి. కురియన్‌ ప్రభుత్వోద్యోగి కాదు. ‘పాడి రైతులు తమ ఉత్పాదనను అమ్మి పెట్టడానికి నియమించుకున్న ఉద్యోగిని నేను’ అని గర్వంగా చెప్పుకునే వాడాయన.

ఆనంద్‌లో ఉన్న పాడి రైతులు సహకార సంఘంగా ఏర్పడి, తమ పాలను ఎలా మార్కెట్‌ చేయాలో తెలియక కొట్టుమిట్లాడుతున్నపుడు ఆయన వాళ్లకు మార్గాలు చూపాడు. వాళ్ల యంత్రాలను ఆధునీకరించాడు. వారి తరఫున ప్రభుత్వాలతో, విదేశీ కంపెనీలతో పోట్లాడాడు. తాము చేస్తున్నది ఎంత గొప్ప పనో, రాష్ట్రాధినేతలను, దేశాధినేతలను, విదేశీ నిపుణులను కన్విన్స్‌ చేశాడు. కొత్త రకమైన మార్కెటింగు టెక్నిక్స్‌ ప్రవేశపెట్టాడు. అమూల్‌ బేబీ అనే మేస్కట్‌ను తయారు చేసి, ఊరూరా హోర్డింగులు పెట్టించి, అమూల్‌ను ఒక బ్రాండ్‌గా తీర్చిదిద్దాడు. ఇవన్నీ రైతులు, రైతు నాయకులు చేయలేరు కాబట్టి యీయన వంటి ప్రొఫెషనల్‌ అవసర పడ్డాడు. ఆయన కారణంగా దేశంలో క్షీర విప్లవం వచ్చింది. పాలు దిగుమతి చేసుకునే దశ నుంచి ఎగుమతి చేసే స్థితికి వచ్చాం.

వ్యవసాయ పట్టభద్రులు కురియన్‌లు కావాలనడంలో నా ఉద్దేశం అది! నిజానికి కురియన్‌ పాడి రంగానికి చెందినవాడు కాదు. మెటలర్జీ ఇంజనియర్‌. అనుకోకుండా ఆనంద్‌ వెళ్లి అక్కడ పాల సహకారోద్యమ నాయకుడు కోరగా వారి యంత్రాలు పరీక్షించడానికి వెళ్లినవాడు. మరి మీరు? మీకు వ్యవసాయ రంగం క్షుణ్ణంగా తెలుసు. అందుచేత కురియన్‌ కంటె మీకు హెడ్‌స్టార్ట్‌ ఎడ్వాంటేజి ఉంది. కావలసినది ఆ దిశగా వెళ్లాలనే ఆశయమంతే!

ఆనంద్‌లో లక్షలాది పాడి రైతులు సహకార సమాఖ్యగా ఏర్పడ్డారు కాబట్టి కురియన్‌ ఏమైనా చేయగలిగాడు, ఇక్కడ అటువంటి వ్యవస్థ ఏముంది అని అనే ప్రశ్న వస్తుంది. నిజమే, గుజరాత్‌, మహారాష్ట్రలలో కో ఆపరేటివ్‌ వ్యవస్థ యిప్పటికీ బలంగా ఉంది. మన తెలుగు రాష్ట్రాలలో ఒకప్పుడు ఉండేది కానీ రాజకీయాలు చొరబడి అవన్నీ నాశనమయ్యాయి. సహకార వ్యవసాయం, కోఆపరేటివ్‌ ఫార్మింగ్‌ అనేది కమ్యూనిస్టులు, సోషలిస్టుల కల. కానీ ఆచరణలో అది నడవలేదు. పక్కవాడు చేస్తాడులే అని అందరూ కాళ్లు జాపుకుని కూర్చుని, రాజుగారి పాల పాత్రలో అందరూ నీళ్లే పోసిన చందంగా తయారైంది.

అందువలన కోఆపరేటివ్‌ వ్యవస్థ మళ్లీ రావాలి అని నేను ప్రవచనాలు చెప్పడం లేదు. చిన్న తరహా కమ్యూనిటీకి యీ పట్టభద్రులు సేవలు అందించవచ్చనే చెప్తున్నాను. ఇప్పుడు గేటెడ్‌ కమ్యూనిటీలున్నాయి. వాళ్లందరకూ కలిసి ఒక సూపర్‌వైజర్‌ను పెట్టుకుంటున్నారు కదా, ఒక ఉమ్మడి సెక్యూరిటీ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు కదా. ఉమ్మడి వాటర్‌ ట్యాంకు కట్టించుకున్నారు కదా! విడివిడిగా అయితే వాళ్లు సూపర్‌వైజర్‌ను, వాచ్‌మన్‌ను ఎఫోర్డ్‌ చేయగలిగేవారా?

అదే రీతిగా కొందరు రైతులు సమూహంగా ఏర్పడి వీరిని కన్సల్టెంట్‌లుగా పెట్టుకోవాలి. అప్పుడే వీరికి తగిన జీతాన్ని యివ్వగలుగుతారు. ఏ ఒక్క రైతూ విడిగా వీరిని భరించలేడు. ఒకసారి వీరి సేవల వలన లాభాన్ని వాళ్లు చవి చూసినప్పుడు యితర సమూహాలు కూడా ముందుకు వస్తాయి. సెక్యూరిటీ సంస్థ వాడు వివిధ గేటెడ్‌ కమ్యూనిటీలకు తమ టీములను పంపించినట్లు, వీరు వారి సహచరులకు, శిష్యులకు ఆ పని అప్పగించవచ్చు. వీరిలో వీరు సంప్రదింపులు చేసుకున్నపుడు గ్రూప్‌ సినర్జీ ద్వారా సమయం, శ్రమ ఆదా అవుతుంది.

వినడానికి బాగానే ఉంది కానీ వీరి అవసరం తమకుందని రైతులను కన్విన్స్‌ చేయడం ఎలా? ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరపై ఆధారపడ వలసిన అవసరం లేకుండా వ్యవసాయాన్ని కిట్టుబాటు వ్యవహారంగా చేయడం ఎలా? అనే విషయంపై ఎందరో నిపుణులు ఎన్నో సూచనలు చేశారు. మినీ ట్రాక్టర్ల వంటి పరికరాలను ప్రభుత్వం కొని జిల్లా స్థాయి సెంటర్లలో ఉంచి, రైతులకు అద్దెకు యివ్వాలని, రైతులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అయ్యేట్లు చేయాలని, కాలువలు సకాలంలో తెరవాలని, గిడ్డంగులను అందుబాటులోకి తేవాలని, మార్కెట్‌ యార్డ్‌ల నిర్వహణ సక్రమంగా ఉండాలని… యిలా ఎన్నో ఉన్నాయి.

అవి అమలు కావటం లేదు. కానీ వాటి గురించి పోరాడే తీరిక, ఓపిక, నేర్పు రైతుకి ఉండవు. వారి తరఫున ప్రభుత్వంతో యిలా కన్సల్టెంట్లుగా పని చేసే వ్యవసాయ పట్టభద్రులు డీల్‌ చేయాలి. నిర్ణయాలు తీసుకోవలసిన బ్యూరోక్రాట్స్‌తో వారికి అర్థమయ్యే జార్గన్‌లో మాట్లాడి ఒప్పించాలి. మంత్రులతో వారికి తగిన రీతిలో మాట్లాడాలి. మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉపయోగించాలి. పత్రికలలో వ్యాసాలు రాసి, పబ్లిక్‌ను సెన్సిటైజ్‌ చేయాలి. అవసరమైతే ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లు పెట్టాలి, కోర్టులకు వెళ్లాలి. వాతావరణ శాఖ తప్పుడు సూచనలు చేస్తే వారిని నిలదీయ గలగాలి. మార్కెట్‌ యార్డులో మోసాలు జరుగుతూంటే సదరు దళారుల గుట్టు బట్టబయలు చేస్తూ పత్రికలలో కథనాలు వచ్చేట్లా చేయాలి. ఇదంతా ప్రొఫెషనల్‌గా చేయాలి.

ఇది కాకుండా మరొక కోణం కూడా వచ్చి చేరబోతోంది. బిజెపి ప్రభుత్వం సాగు బిల్లులను ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టింది కానీ, రాబోయే రోజుల్లో వాటిని అమలు చేసి తీరుతుందనే అనుకోవాలి. కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ అనేది ఒక రియాలిటీగా మారబోతోంది. కార్పోరేట్‌ల తరఫున ఉద్దండులైన లాయర్లు, ఆడిటర్లు పని చేస్తారు. వారు తయారు చేసిన అగ్రిమెంట్లపై సంతకం పెట్టవలసిన రైతులకు యీ విషయంలో పరిజ్ఞానం శూన్యం. అగ్రిమెంటులో ఏ క్లాజు వారికి హానికరమో తెలుసుకోవడం ఎలా? ఇలాటి కన్సల్టెంట్లు వారి తరఫున పని చేస్తూ వారికి శ్రేయస్కరమైన ఒప్పందాలు మాత్రమే అనుమతించాలి. అవతలి కార్పోరేట్‌ ఆర్థిక స్థితిగతులను, భవిష్యత్తులో అది సాధించ బోయే ప్రగతిని వీరు అంచనా వేయగలగాలి.

అఫ్‌కోర్స్‌, వీరే అవి స్వయంగా చేయగలరని నేనటం లేదు. లాయర్లను, ఆడిటర్లను సంప్రదించ వలసి వస్తుంది. అయితే వాళ్లు చెప్పేదాన్ని అర్థం చేసుకునే సామర్థ్యమైనా వీరికి ఉండాలి. ఫైనాన్షియల్‌ స్టేటుమెంట్స్‌ వేయడం తెలియక పోయినా, అర్థం చేసుకునే కనీస పరిజ్ఞానం ఉండాలి. దేశ, విదేశాల మార్కెట్ల గురించిన సమాచారాన్ని వీరు నిరంతరం శోధిస్తూ, విశ్లేషిస్తూ, ఫ్యూచర్‌ ట్రెండ్స్‌ను ఊహించ గలగాలి. ఒక్క మాటలో చెప్పాలంటే వీరే ఒక ఎంటర్‌ప్రెనార్‌ కావాలి. ఈ విద్యలన్నీ వీరు యూనివర్శిటీ లోనే నేర్చుకోవాలి. వీరి సిలబస్‌లో యివన్నీ ఉండాలి. వర్క్‌షాప్స్‌ ద్వారా, ప్రాక్టికల్‌గా కూడా వీరు తర్ఫీదు పొందాలి. టెక్నాలజీని, లేటెస్ట్‌ ట్రెండ్స్‌ని ఎప్పటి కప్పుడు అప్‌టుడేట్‌ చేసుకుంటూ ఉండాలి. దాన్ని ప్రాక్టికల్‌గా ట్రాన్సలేట్‌ చేయగలిగి ఉండాలి.

ఇదంతా ఎందుకు, ప్రభుత్వోద్యోగిగా ఉంటూ జిల్లా కేంద్రాలలో పని చేస్తూ మన దగ్గరకు వచ్చినవారికి సలహాలిస్తూ కాలక్షేపం చేయడం మా లక్ష్యం అని యీ పట్టభద్రులెవరైనా అంటే వారికో దణ్నం పెట్టి ఊరుకోవాలి. ప్రభుత్వోద్యోగం అనగానే రిజర్వేషన్లు, కోటాలు, ఎలిజిబిటీ టెస్టులు, అవి వాయిదా పడడాలూ, పేపరు లీకులు, స్కాండల్స్‌, రిక్రూట్‌మెంట్‌ ఏజ్‌ పెంచాలన్న ఆందోళనలు, ఆలస్యంగా చేరాం కాబట్టి, ఆలస్యంగా రిటైరవుతామంటూ మరో ఆందోళన చేయడాలు.. యీ రంధిలో పడిపోతారు.

దాని కంటె యిలాటి ప్రొఫెషనల్స్‌గా, రైతుల కన్సల్టెంట్లుగా మారితే రిటైర్‌మెంటే లేదు. దానికి గాను సంబంధిత రంగాల వారందరితో వారు సంబంధ బాంధవ్యాలు పెంచుకోవాలి. పట్టభద్రులందరూ యిదే వృత్తిలోకి రావాలని నేననను. వారిలో కొందరు బ్యూరోక్రసీలోకి వెళ్లాలి. ఇలాటి రైతుల కన్సల్టెంట్లు వారి దగ్గరకు వచ్చి తమ వాదనలు వినిపించినపుడు వాటి బాగోగులు అంచనా వేయగలగాలి. సమంజసమని తోస్తే అధికారాన్ని వినియోగించి, వారికి దోహదపడాలి.

మంత్రులు చాలామంది మేం రైతు కుటుంబాల నుంచి వచ్చినవాళ్లం, మాకు రైతుల కష్టాలు తెలుసు అంటూంటారు. కుటుంబ నేపథ్యం అనేది రెండు తరాల కిందటి మాట. ఈరోజున్న సమస్య ఏమిటి? దాన్ని ఎలా సాల్వ్‌ చేయాలి? అనేది తెలియాలంటే వీరి లాటి నిపుణుడు అక్కడ ఉండాలి. అందువలన కొందరు రాజకీయాల్లోకి కూడా వెళ్లాలి. ఇలా ఎన్నో రకాలుగా మనం రైతు సంక్షేమం కోసం కృషి చేయాలి. లేకపోతే ‘అన్నదాతా సుఖీభవ’ అనేది ఒట్టి నినాదంగానే మిగులుతుంది.

– కె.ఐ. వరప్రసాద్‌ రెడ్డి (శాంతా బయోటెక్నిక్స్‌)

6 Replies to “కెవి: రైతు ప్రతినిథులుగా వ్యవసాయ నిపుణులు”

  1. మైక్రోసాఫ్ట్ సీఈఓ నీ కలిస్తే మన రాష్ట్ర భవిష్యత్తు ఏదో మారిపోయింది అని డబ్బా కొట్టే జనాలు, అప్పులలో ఉన్న రాష్ట్రం కొత్త రాజధాని కట్టేస్తే అదే మనకి అన్నం పెట్టేస్తది అని నమ్మించే పొలిటీషియన్ నీ గుడ్డిగా నమ్మే జనాలు ఉన్నంత వరకు ఇలా ఓట్ల కోసం వాళ్ళు ఏదో ఒకటి చెప్పి నమ్మిస్తూ ఉంటారు. మన విజనరీ వచ్చాక GST వసూళ్లు కూడా కరోనా టైం కంటే దారుణంగా పడిపోయాయి అంటే పరిపాలన ఎంత దారుణంగా జరుగుతుందో. ఇలాంటి సిట్యువేషన్ లో కరువు కూడా మన చుట్టం అన్నట్లు సగం పైగా జిల్లాల్లో తాగడానికి నీరు కూడా కష్టం అవుతోంది. అయినా ఎక్కడో అమెరికా లో కూర్చుని పొలిటీషియన్ కి చిడతలు వాయించడమే పనిగా పెట్టుకున్నారు.

    1. మన పాలకులకు ఉండాల్సింది ఎవరో పది మంది బ్రతికే వ్యవస్థ కన్న దాదాపు 70 శాతం ఆధారపడిన వ్యవసాయాన్ని ఎలా లాభసాటిగా మార్చలో ప్రజలకి అవగాహన మరియు సబ్సిడీ పెంచాలి. అలా కాకుండా హైటెక్ మాటలతో జనాలని డైవర్ట్ చేసి ఎలా అయినా గెలిచేదాం అనుకుంటే మన దేశం ఎప్పటికీ కొందరు సంపన్నులు ఎందరో పేదవాళ్ళ దేశం గా మారిపోతుంది.

  2. Fantastic article Varaprasad sir.I Adore Versatility of your knowledge across completely diversified fields.

    May be that runs among friends / Students of Mullapudi garu.

    Only complaint i have is now i have to depend on toss to prioritise whether to read your articles or that of Sri MBS prasad sir.

    I request you to provide Matrupanchakam.. I’ve read about it in MBS sir’s article but now the link is dead it seems.

    🙇🏻♂️

Comments are closed.