ఆంధ్ర జనాలపై మీడియా పాత్ర ఇంతా అంతా కాదు, వున్న మీడియాల్లో తొంభై శాతం ఏం చెబితే అదే మన జనాలు నమ్మే వ్యవహారం ఇవ్వాళ నిన్నటిది కాదు. గడచిన పాతిక ముఫై ఏళ్లుగా వస్తోంది. మీడియా వలన, మీడియా చేత, మీడియా అనుకూల పార్టీ కొరకు అన్నట్లు మన రాష్ట్రాంలో విషయాలు డిసైడ్ అవుతాయి.. నడుస్తాయి..ప్రచారంలోకి వస్తాయి. అది కుక్క అంటే కుక్క..మేక అంటే మేక. ఓటర్లు అనబడే ప్రజానీకం మాత్రం అది ఎటు తిరగమంటే అటు తిరగడమే తప్ప, ఎందుకు అనేది మన దగ్గర తక్కువ. నచ్చిన వారిని రాజును, నచ్చని వారిని బూచిని చేయడంలో మన మీడియాను మించిన గొప్పోడు లేడు మరి.
భారతీయ జనతా పార్టీ ఆంధ్ర, తెలంగాణల్లో మాత్రం అది ఆడిన నాటకం ఇప్పుడు భలే బెడిసికొడుతోంది. ఎప్పుడో ఆంధ్ర గడ్డ అయిన కాకినాడలోనే భాజపాకు ఓటు వేస్తే, రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తాం అని ప్రకటించింది. దీన్ని ఆంధ్ర జనాలు మరిచిపోయి, కాంగ్రెస్ ద్రోహి అని ముద్రవేయడంలో ఘనత వహించిన మన మీడియా పాత్ర బోలెడు వుంది. సరే, అలా ఒక ఓటుకు రెండు రాష్ట్రాలు అని చెప్పిన తరువాత భాజపాకు తెలంగాణలో వచ్చిన మైలేజీ లేదు, ఆంధ్రలో వున్నదీ, పోయిందీ లేదు. అయితే ఈ ఊపుతో తెలంగాణలో ఏదో సాధిద్దాం అని కిందా మీదా పడింది.
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెరాసతో సమానంగా భాజపా కూడా ఫైటింగ్ చేస్తూ వచ్చింది. ఎందుకంటే మార్కిస్టులు, కాంగ్రెస్ ఈ విషయంలో ముందుకు రాలేదు కాబట్టి. తేదేపా తెలివైనది కాబట్టి, సమన్యాయం, రెండు కళ్లు అంటూ రకరకాల కబుర్లు చెబుతూ వచ్చింది. ఓ దశలో పార్టీ చీలుతుందేమో అని భయమేసి, తెలంగాణకు తెదేపా అనుకూలమే అని లేఖ ఇచ్చారు. ఇలా తెలంగాణ ఏర్పాటుకు తేదేపా ససాక్ష్యంగా మద్దతు ఇచ్చిన సంగతిని కూడా మన ఘనత వహించిన మీడియా తెరవెనుక వుంచడానికి ఎంత చేయాలో అంతా చేసింది. తెలుగదేశం పార్టీ కూడా తెలంగాణకు మద్దతు పలికిందహో…అని ఒక్కసారి కూడా జనాలకు టముకేసి చెప్పిన పాపాన పోలేదు.
ఇలా తేదేపా, భాజపా వ్యవహారాలను మబ్బులో పెట్టి, విభజన వరకు వచ్చిన తరువాత మొత్తం పాపాన్ని కాంగ్రెస్ ఖాతాలోకి వేసేసింది మన మీడియా. పైగా విభజన అనంతరం, భాజపాను హీరోను చేసే ప్రయత్నం చేసింది. అసలు భాజపా లేకుంటే కాంగ్రెస్ ఆంధ్రకు ఎంతటి అన్యాయం చేసేదో, భాజపానే హీరోచితంగా తలుములు మూసిన పార్లమెంటు లోపల, ఫైట్ చేసి, ఆంధ్రకు ఎన్ని సాధించి పెట్టిందో అన్న కలర్ భయంకరగా పూసింది. అక్కడితో ఆగక, ఈ హీరోచిత పోరాటానికి సేనాని, కమాండర్, అన్నీ ఘనత వహించిన వెంకయ్య నాయుడుగారే అని జనం ముందు సెవెన్టీ ఎమ్ ఎమ్ సైజులో వుంచింది.
అంతే మన జనాలకు కాంగ్రెస్ పై పీకల లోతు కోపం వచ్చేసింది. లేఖ ఇచ్చిన తెలుగుదేశం తప్పు కానరాలేదు. ఓటు వేస్తే, రెండు ముక్కలు చేస్తామని ఆంధ్ర గడ్డపైనా భాజపా తీర్మానం చేసిన సంగతి గుర్తురాలేదు. మీడియా భూతద్దంలో ఎదురుగుండా కాంగ్రెస్ మాత్రమే కనిపించింది. దాన్ని తుంగలో తొక్కారు. ఇప్పటికీ పొరపాటున కాంగ్రెస్ తల కాస్త ఎత్తితే, మన మీడియాలో 'తుంగలో తొక్కడం' లాంటి పడికట్టు పదాలు మళ్లీ విస్తారంగా వాడబడతాయి.
ఇప్పుడేమంటారు?
ఇలా భాజపా, తేదేపా వ్యవహారాల పరిరక్షణే ధ్యేయంగా వ్యవహరించిన మన మీడియా ఇప్పుడు ప్రత్యేక హోదా మీద కేంద్రం దాన్ని నడుపుతున్న భాజపా కుండబద్దలు కొట్టేసాక ఏమంటోంది..సింపుల్ గా హోదా లేనట్లే అని వార్త వేసి ఊరుకుంటోంది. అంతే కానీ మాట మార్చిన భాజపా, మౌనం వహిస్తున్నా, లేదా తెప్ప తగలేసిన వెంకయ్య, ఇలాంటి శీర్షికలు కనిపించవు. అదే ఆంధ్రకు హోదా అవసరం లేదు అని కాంగ్రెస్ అంటే, అప్పుడు ఎక్కడలేని అక్షర తూణీరాలు బయటకు వస్తాయి. ఇప్పుడు మాత్రం, ఆర్థిక సంఘం నిదులు పెంచింది కాబట్టి, హోదా సమస్య రాదు..హొదాపై తేదేపా పోరాడుతుంది, అసలు ఆంధ్ర వ్యవహారం వేరు ఇలాంటి సాప్ట్ టైటిళ్లు బయటకు వస్తాయి.
ఎన్నాళ్లిలా?
మన మీడియా వివిధ రాజకీయాంశాలపై ప్రజలను తమకు నచ్చిన దారి వైపు మళ్లించే వ్యవహారాలు ఎన్నాళ్లు కొనసాగుతాయో అర్థం కావడం లేదు. దీనికి తోడు ఇప్పుడు రెండేసి ఎడిషన్లు దాపురించాయి. గతంలో జిల్లాకో ఎడిషన్, మెయిన్ ఎడిషన్ వున్నపుడే, ప్రజల పాట్లు, సమస్యలు, జిల్లా ఎడిషన్ లోపలి పేజీకి అంకితం చేసి, మెయిన్ ఎడిషన్ కు మాత్రం అంతా బాగానే వుందన్న వార్తలే ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు రెండు రాష్ట్రాలు, రెండు ఎడిషన్లు కావడంతో, అక్కడ అస్సలు బాగాలేదని, ఇక్కడే అంతా బాగుందని ఓ దాంట్లో, అక్కడెంత బాగుందో, ఇక్కడే బాగోలేదని మరోదాంట్లో వేసుకుంటూ వెళ్లిపోతున్నారు. కేసిఆర్ లాంటి మొండోడితో ఇప్పుడెందుకు, ఎన్నికలు వచ్చాక చూసుకుందాం అని కాస్త చూసీ చూడనట్ల పోతున్నారు.
జనం తెలుసుకునేదెపుడో?
సాక్షి పత్రికకు అధికారికంగా జగన్ ఓనర్ కావడంతో, అది వైకాపా పత్రిక అని ప్రత్యేకంగా ముద్ర వేయాల్సిన పని లేకపోయింది. కానీ మిగిలిన పత్రికల వ్యవహారాలు అలా కాదు, అన్నీ తెరచాటు బంధాలే. జనాలు ..ట..ట..అని అనుకోవడం తప్ప, మరే ఇతరత్రామార్పు లేదు. అవి రాసినవి నమ్ముతున్నారు. అవి చూపించనవి చూడాలనే ప్రయత్నాలూ లేవు. అందువల్ల ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల ఆంధ్రలో ఏదో హడావుడి జరిగిపోతుందని, పోరాటాలు సాగిపోతాయని భయపడడానికలేదు. హైకోర్టు విభజన కోసమో, మరింకేమైనా బ్యాలెన్స్ వ్యవహారాల కోసమో తెలంగాణలో పోరు సాగచ్చు. ఎందుకంటే అక్కడ పోరు జనం డిసైడ్ చేస్తారు. మీడియా కాదు. ఇక్కడ పోరును మీడియా డిసైడ్ చేస్తుంది. సెక్షన్ 8 కోసం మొన్నామధ్య ఓ నెల రోజుల శాంపిల్ పోరాటాన్ని స్పాన్సర్ చేసారు కదా. మోడీతో తేదేపా బంధాలు తెగనంతకాలం మన మీడియా హోదాపై అంటీ ముట్టనట్లేవుంటుంది. అది తెగితే అప్పుడు మీడియా కూడా పుంజాలు తెంపుకుని, ముందుకు ఉరుకుతుంది. అంతవరకు ఇంతే..ఇంతే..
ఆర్వీ