లైగర్ అనే సినిమా పూరి- చార్మిలకు కర్మ ఫలం మాదిరిగా వెంటాడుతోంది. డబుల్ ఇస్మార్ట్ సినిమా విడుదల దగ్గరకు వస్తోంది. మరో నెలరోజుల్లో విడుదల. ఈ లోగా లైగర్ తగాదాలు అన్నీ సెటిల్ చేసుకోవాల్సి వుంది. ఈ లోగా రాజకీయాలు మొదలైపోయాయి. లీగల్ గా అయితే డబుల్ ఇస్మార్ట్ ను ఏమీ చేయలేరు. ఎందుకంటే అగ్రిమెంట్ లు పక్కాగా నాన్ రికవరబుల్ అడ్వాన్స్ అనే పద్దతిన వున్నాయి. అందువల్ల వేరే రూట్ లో వెళ్లాలి.
అందుకే నైజాం ఎగ్జిబిటర్లు అంతా తమ సభ్యులు ఎవరూ థియేటర్లలో డబుల్ ఇస్మార్ట్ ప్రదర్శంచకూడదు అనే తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. ఎగ్జిబిటర్లు నష్టపోయారు.. ఆందోళన సహజం. కానీ ఎగ్జిబిటర్లు డబ్బులు ఇచ్చింది వరంగల్ శ్రీనుకు. ఆయన డబ్బులు ఇచ్చింది పూరి- చార్మికి. డబ్బులు వెనక్కు ఇదే రూట్ లో రావాలి. కానీ ఎవరికీ ఎవరి మీదా నమ్మకం లేదు. డిస్ట్రిబ్యూటర్ నష్టపోలేదు. తమ డబ్బులే తమ దగ్గర తీసుకుని కట్టాడు కాబట్టి, తమకే నేరుగా ఇవ్వాలన్నది ఎగ్జిబిటర్ల డిమాండ్.
పూరి- చార్మి కూడా కౌన్సిల్ ద్వారా సెటిల్ మెంట్ చేసే ఆలోచనలోనే వున్నారు. కానీ ఇక్కడ ఒక లంకె లేదు.. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఇలా చాలా లంకెలు వున్నాయి. అవన్నీ తెగాల్సి వుంది.
ఈలోగా మరో రాజకీయం మొదలైంది. డబుల్ ఇస్మార్ట్ థియేటర్ హక్కుల కోసం పోటీ మొదలైంది. పలువురు బయ్యర్లు ఎంక్వయిరీ లు మొదలు పెట్టారు. ఇలాంటి టైమ్ లో తమకు ఇవ్వకుంటే, వేరే వాళ్లకు ఇచ్చి, ఎలా విడుదల చేస్తారో చూద్దాం అనే రాజకీయాలు కూడా మొదలైపోయాయి. పోనీ వీళ్లు తీసుకుంటారా అంటే రేటు ఎక్కువ అన్నది పాయింట్. సరే, వాళ్లు కొనుక్కుంటారేమోలే అంటే, తమకు ఇవ్వకుండా వాళ్లకు ఎలా ఇస్తారు అనే క్వశ్చను.
మొత్తానికి పూరి- చార్మికి లైగర్ తల నొప్పులు ఇప్పట్లో తీరేలా లేవు.