అల్లు అర్జున్‌ రికార్డుకు ఎసరు పెడుతున్న అజిత్‌!

దక్షిణాది ఊరమాస్‌ ఎంటర్‌టైనర్లకు హిందీలో మంచి మార్కెట్‌ ఉందని కొత్తగా వివరించాల్సిన పనిలేదు. గత పదేళ్లలో సౌత్‌ సినిమాలు హిందీలోకి డబ్‌కావడం చాలా పెరిగింది. ఈ సినిమాల హిందీ వెర్షన్లు విడుదల అవుతూనే ఉన్నాయి.…

దక్షిణాది ఊరమాస్‌ ఎంటర్‌టైనర్లకు హిందీలో మంచి మార్కెట్‌ ఉందని కొత్తగా వివరించాల్సిన పనిలేదు. గత పదేళ్లలో సౌత్‌ సినిమాలు హిందీలోకి డబ్‌కావడం చాలా పెరిగింది. ఈ సినిమాల హిందీ వెర్షన్లు విడుదల అవుతూనే ఉన్నాయి. అలాగని ఏదో థియేటర్లలో కోట్ల రూపాయల వసూలు చేస్తాయని కాదు. కేవలం శాటిలైట్‌ రైట్స్‌ కోసమే ఈ సినిమాలను డబ్బింగ్‌ చేయడం మొదలైంది. ఏదో నామమాత్రంగా ఇవి థియేటర్లలో విడుదల అవుతాయి. తన సినిమా పోస్టర్‌ను బాంబేలో చూసి ఆశ్చర్యపోయాను అని ఆ మధ్య ఒక దక్షిణాది చోటా హీరో చెప్పుకొచ్చాడు. అతడే రామ్‌. తెలుగులో ఈ హీరో సినిమా 'జగడం' ఒక డిజాస్టర్‌.

సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా తెలుగు వాళ్లను ఆకట్టుకోలేదు. అయితే అది యాక్షన్‌ జోనర్‌ సినిమా కావడంతో దాన్ని హిందీలోకి అనువదించినట్టుగా ఉన్నారు. ఎప్పుడో బాంబేకు వెళ్లినప్పుడు అక్కడ తన సినిమా పోస్టర్‌ను చూసి రామ్‌ ఆశ్చర్యపోయాడట. ఇలా హీరోలకే తెలీకుండా వారి సినిమాలు హిందీలోకి అనువాదం అవుతున్నట్టుగా ఉన్నాయి. ఇక వీటికి పెట్టే టైటిల్స్‌ కూడా చిత్రంగా ఉంటాయి. సబ్జెక్ట్‌తో పనిలేకుండా సినిమా ఊరమాస్‌ అనిపించుకునే టైటిల్స్‌ను పెడుతూ ఉంటారు. ఒక్కో హీరో సినిమాకు ఒక్కో టైటిల్‌ను ఫిక్స్‌ చేసి.. వన్‌, టూ, త్రీ అంటూ సీక్వెల్స్‌లా విడుదల చేస్తూ ఉంటారు. ఇంకొన్ని సార్లు అయితే.. డైరెక్టుగా తెలుగు, తమిళ టైటిల్స్‌ను యథాతథంగా వాడుకొంటూ ఉంటారు.

ఆ టైటిల్‌ ఉన్నది తెలుగు భాషలో అయినా అదే టైటిల్‌ను హిందీలోనూ పెట్టేసి డబ్‌ చేసేస్తూ ఉంటారు. ఒక్కసారి టీవీలో హిందీ ఛానళ్లను పెట్టామంటే.. అందులో వచ్చేవన్నీ దక్షిణాది అనువాద సినిమాలే. హిందీలో ఇరవై నాలుగంటల సినిమా చానళ్లు చాలానే ఉన్నాయి. పదిహేనేళ్ల కిందట వరకూ వీటిసంఖ్య నాలుగైదుగా ఉండేది. అప్పట్లో మంచి మంచి హిందీ హిట్‌ సినిమాలు, క్లాసిక్స్‌ వేసేవాళ్లు. రోజుకు నాలుగు సినిమాల చొప్పున వేసేవాళ్లు. అరుదుగా మాత్రమే అనువాద సినిమాలు ప్రదర్శితం అయ్యేవి. అయితే రానురాను పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ ఇరవై నాలుగు గంటల సినిమా చానళ్లలో ఇప్పుడు డైరెక్ట్‌ హిందీ సినిమాలు ప్రదర్శితం కావడమే అరుదైపోయింది.

మరీ ప్రీమియం చానళ్లను పక్కన పెడితే, పేరున్న టీవీ నెట్‌వర్క్స్‌లో ఎప్పుడూ సౌత్‌ డబ్బింగ్‌ సినిమాలే ఆడుతూ ఉంటాయి. అసలు తెలుగు టీవీ చానళ్లే పట్టించుకోని సినిమాలను కూడా హిందీ చానళ్లు వేసుకొంటూ రోజులు గడుపుతూ ఉన్నాయి. డైరెక్టు హిందీ సినిమాల టెలివిజన్‌ ప్రసార హక్కులు భారీస్థాయిలో ఉన్నాయని, అందుకే వాటిని కొనడానికి బదులు ఈ తెలుగు, అరవ, కన్నడ డబ్బింగ్‌ సినిమాలతో హిందీ చానళ్లు బండి లాగిస్తున్నాయని తెలుస్తోంది. మరి ఇలా చానళ్ల వాళ్లంతా దక్షిణాది డబ్బింగ్‌ సినిమాల మీద పడిపోతే.. హిందీ సినిమా వాళ్ల పరిస్థితి ఏమిటో. ఈ రోజుల్లో సినిమాలకు టెలివిజన్‌ రైట్స్‌ కూడా చాలా కీలకం. ఇలాంటి సమయంలో దక్షిణాది అనువాదాలు హిందీ సినిమాల టీవీ రైట్స్‌ వ్యాపారాన్ని చాలావరకూ దెబ్బకొడుతున్నట్టే అని చెప్పాలి.

టీవీలంటే ఏదో తక్కువ రేటుకు దొరుకుతున్నాయని దక్షిణాది సినిమాలను హిందీలోకి అనువదించి ప్రసారం చేసుకుంటాయని అనుకోవచ్చు. అయితే ఇక్కడ టీవీ వ్యాపార రహస్యమే కాదు.. జనాల ఆసక్తి కూడా దక్షిణాది అనువాద సినిమాల మీదే ఉందని స్పష్టం అవుతుంది. అందుకు సాక్ష్యం తెలుగు, తమిళ అనువాద సినిమాలు యూట్యూబ్‌లో సాధిస్తున్న వ్యూస్‌. ఇక్కడి యాక్షన్‌ ఎంటర్‌ టైనర్లు హిందీలోకి అనువాదం అయ్యి.. యూట్యూబ్‌లోకి అప్‌లోడ్‌ అవుతున్నాయి. ఆ వీడియో బ్లాగింగ్‌ సైట్లో ఈ డబ్బింగ్‌ బొమ్మలకు అత్యంత భారీ వ్యూస్‌ లభిస్తున్నాయి. డైరెక్టు హిందీ సినిమాలకు, అక్కడి స్టార్‌ హీరోల సినిమాలకు యూట్యూబ్‌లో వచ్చే వ్యూస్‌కు మించిన స్థాయిలో అనువాద యాక్షన్‌ ఎంటర్‌టైనర్లకు వ్యూస్‌ వస్తూ ఉండటం గమనార్హం.

ఈ జాబితాలో ఇప్పటి వరకూ అల్లుఅర్జున్‌ సినిమా 'సరైనోడు' ముందుంది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదనే చెప్పాలి. డబ్బులైతే వచ్చి ఉండవచ్చు కానీ.. ఇందులోని పాటలు, ఫైట్లు, డ్యాన్సులు.. నవ్వుకోవడానికి పనికొచ్చే మెటీరియల్‌ అనిపించుకున్నాయి. ఈ సినిమా వాళ్ల మాటల్లోనే చెప్పాలంటే.. ఇది ఊరమాస్‌. కాబట్టి ఆ తరహా సినిమాలను ఇష్టపడేవాళ్లు తప్ప మిగతావాళ్లు ఈ సినిమాను పెద్దగా పట్టించుకోలేదు. హిందీలో ఈ ఊరమాసే దీనికి కలిసొచ్చింది. ఈ సినిమాను దాదాపు ఏడాది కిందట యూట్యూబ్‌లో పెట్టారు. ఇది అక్కడ ఇప్పటి వరకూ సాధించుకున్న వ్యూస్‌ సంఖ్య దాదాపు 18.5 కోట్లు! యూట్యూబ్లో అన్నిసార్లు ప్లే అయ్యింది ఈ సినిమా.

అప్‌లోడ్‌ అయ్యీకావడంతోనే ఈ సినిమా వ్యూస్‌ రికార్డును బద్ధలుకొట్టింది. ఒక రకంగా వ్యూస్‌ విషయంలో దుమ్ము రేపింది ఈ సినిమా. తెలుగు టైటిల్‌తోనే విడుదల అయిన ఈ సినిమా ఇలా హిందీలో యూట్యూబ్‌లో రికార్డును క్రియేట్‌ చేసింది. ఇదే సినిమా తెలుగు వెర్షన్‌ కొన్నాళ్ల కిందట యూట్యూబ్‌లోకి అప్‌లోడ్‌ అయితే వచ్చిన వ్యూస్‌ వందల్లో ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వందల వ్యూస్‌ ఎక్కడ కోట్ల వ్యూస్‌ మరెక్కడ! అదలా ఉంటే క్రేజ్‌కా బాప్‌ అనిపిస్తున్న సరైనోడుకు పోటీగా మరో తమిళ సినిమా హిందీలోకి డబ్‌ అయ్యి వ్యూస్‌ విషయంలో దుమ్ము రేపుతోంది. అదే అజిత్‌ 'వివేకం'. ఈ సినిమా దక్షిణాదిన డిజాస్టర్‌. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా విడుదల అయ్యింది.

అజిత్‌ మంచి ఫామ్‌లో ఉన్న నేఫథ్యంలో ఇది ఆడుతుందని చాలామంది అనుకున్నారు. అయితే అంచనాలను తలకిందుల చేస్తూ ఈ సినిమా డిజాస్టర్‌ అయ్యింది. దీనికీ వందకోట్ల రూపాయల స్థాయి కలెక్షన్లు వచ్చాయని ప్రకటించుకున్నారు. అయితే ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమా. ఇప్పుడు ఈ సినిమా హిందీలోకి అనువాదం అయ్యింది. దాన్ని యూట్యూబ్‌లోకి అప్‌లోడ్‌ చేశారు. అలా అప్లోడ్‌ అయ్యిందో లేదో.. ఇలా కోట్లలో వ్యూస్‌ను సంపాదించేసింది ఈ సినిమా. అప్‌లోడ్‌ కాగానే సరైనోడు వ్యూస్‌ రికార్డును ఈ సినిబా బద్దలు కొట్టింది. మూడోరోజుకు ఈ సినిమాకు వచ్చిన వ్యూస్‌ కోటీ ముప్పై లక్షలకు పైగా ఉన్నాయి.

మూడురోజుల్లో ఒక సినిమా యూట్యూబ్లో ఇన్ని వ్యూస్‌ సంపాదించుకోవడం కొత్త రికార్డు అని ఆ సైట్‌ గణాంకాలు చెబుతున్నాయి. ఏ ట్రైలర్లో ఈ సంఖ్యలో వ్యూస్‌ పొందుతాయి కానీ, ఫుల్‌లెంగ్త్‌ సినిమాలకు ఇది రేర్‌ ఫీటే. అల్లుఅర్జున్‌ సినిమా ముందుగా రికార్డులను సెట్‌ చేస్తే, అజిత్‌ వివేకం వాటిని బ్రేక్‌ చేస్తోంది. ఈ దూకుడు చూస్తుంటే.. సరైనోడు సాధించిన 18.5కోట్ల వ్యూస్‌ను అతి త్వరలోనే అజిత్‌ వివేకం అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరో దక్షిణాది ఫెయిల్యూర్‌ సినిమా హిందీలో కొత్త రికార్డులను సెట్‌ చేస్తోందన్నమాట!