తన సినిమా ఫ్లాప్ అయితే.. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడు ఎన్టీఆర్. అసలు ఆ సినిమా గురించి అస్సలు మాట్లాడడు. కానీ టెంపర్ ఇచ్చిన ఉత్సాహంతో మెల్లిమెల్లిగా ఇంటర్వ్యూలు మొదలెట్టాడు. టెంపర్‌కి కథ అందించిన వక్కంతం వంశీ ఎన్టీఆర్‌ని ప్రత్యేకంగా ఓ వీడియో ఇంటర్వ్యూ చేశాడు. నెట్ ప్రపంచంలో ఆ వీడియో హల్ చల్ చేస్తోంది.
ఈ ఇంటర్వ్యూలో ఆంధ్రావాలా గురించి ఎన్టీఆర్ కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని పంచుకొన్నాడు. ఆంధ్రావాలా రిలీజ్ తరవాత పూరి కి ఫోన్ చేశాడట ఎన్టీఆర్. సినిమయా ఫ్లాప్ అయ్యింది, బయటకు వెళ్తే.. జనాలు కొట్టేలా ఉన్నారు.. అని చెప్పాడట. సినిమా పోయినా.. నీతో పనిచేయడం పిచ్చ హ్యాపీ. మనం కలసి మరో సినిమా చేద్దాం అని ఆంధ్రావాలా ఫ్లాప్ అయిన రోజే… ఎన్టీఆర్ పూరికి మాటిచ్చాడట.
అయితే వీళ్లిద్దరి నుంచి సినిమా రావడానికి 11 యేళ్లు పట్టింది. ఈ ఆలస్యానికి కారణం ఆంధ్రావాలే అంటున్నాడు ఎన్టీఆర్. ఆ సినిమా అంతలా భయపెట్టింది. ఈసారి ఎలాంటి పొరపాటు జరక్కూడదని భావించాం. అందుకే పదకొండేళ్లు కలవలేదు.. అని చెప్పుకొచ్చాడు. అంత జాగ్రత్త పడ్డారు కాబట్టే.. ఇప్పుడు ఇలాంటి రిజల్ట్ వచ్చింది. దూరం మంచిదే మరి.