అమెరికా అధ్యక్షుడంటే మామూలు విషయమా.? నడిచే శ్వేత సౌధం ఆయనకు ఎప్పుడూ అందుబాటులో వుండాలి. గాల్లో తేలినా, ఎగిరే శ్వేతసౌధంలా ఆయనకు సకల సౌకర్యాలూ వుండాలి. అలా వుండాలంటే, అత్యంత అధునాతనమైన వాహనాలు ఆయనకు తప్పనిసరి. అందుకే ఆయన రోడ్లపై ఉపయోగించే బీస్ట్ అయినా, గాల్లో ఎగిరే ఎయిర్‌ఫోర్స్ వన్ అయినా అత్యంత ప్రత్యేకత కలిగినవై వుంటాయి.
ఇటీవలే భారతదేశానికి వచ్చి వెళ్ళిన అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా అతి త్వరలో కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ సొంతం చేసుకోనున్నారు. దానికి అయిన ఖర్చు అక్షరాలా 2286 కోట్లు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త ఎయిర్ ఫోర్స్ వన్‌ని అభివృద్ధి చేసినట్లు అమెరికా వర్గాలు వెల్లడిస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి. కనుసైగలతోనే ప్రపంచాన్ని శాసించగల శక్తి అమెరికా అధ్యక్షుడి సొంతం. అందుకే తమ అధ్యక్షుడి విషయంలో అస్సలేమాత్రం రాజీ పడదు అమెరికా. వేల కోట్లు, లక్షల కోట్లు అమెరికాకి పెద్ద లెక్కేం కాదు. అందుకే బీస్ట్ అయినా, ఎయిర్ ఫోర్స్ వన్ అయినా.. అత్యంత ఖరీదైనవిగా చరిత్రకెక్కుతుంటాయి. వీలైనంత త్వరగా బారక్ ఒబామాకి ఎయిర్ ఫోర్స్ వన్‌ని అప్పగిస్తారట.
క్షిపణి దాడులు, అణ్వస్త్ర దాడులు.. ఇలా ఏ దాడుల్ని అయినా తట్టుకునేలా ఎయిర్ ఫోర్స్ వన్‌ని రూపొందిస్తారు. ఎగిరే శ్వేత సౌధంగా ఎయిర్ ఫోర్స్ వన్‌ని అమెరికా అభివర్ణిస్తుంది. ఇందులోని సౌకర్యాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే సింపుల్‌గా ‘ఎగిరే శ్వేత సౌధం’ అనేస్తారు.