వర్తమాన రాజకీయ పరిణామాలు అయితే.. సినీ హీరో పవన్ కల్యాణ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఒక గబ్బర్‌సింగ్ చిత్రం విడుదలై అత్యద్భుతమైన విజయాన్ని సాధించేసరికే… చాలాకాలం తర్వాత పవన్ సాధించిన సూపర్‌హిట్‌కు పరిశ్రమ నివ్వెరపోయింది. ఇప్పుడు అత్తారింటికి దారేది కూడా కలెక్షన్ల విషయంలో దూసుకుపోతూ.. మగధీర రికార్డుల్ని క్రాస్ చేసి.. కొత్త అధ్యాయాల్ని సృష్టిస్తుందని అనుకుంటున్నారు. అలాంటి సమయంలో ఈ సమయంలో గనుక ‘రాజకీయ పార్టీ పెట్టకుంటే పవన్ కల్యాణ్ మూర్ఖుడు’ అని రాంగోపాల్‌వర్మ కామెంట్ చేసే దశనుంచి.. పవన్ తెలుగుదేశం లో చేరి ప్రచారం చేస్తాడనే వ్యవహారాల వరకు రాజకీయంగా అనేకానేక పుకార్లు పుడుతున్నాయి. రెండు భారీ విజయాలకే పవన్ రాజకీయ తెరపై ప్రభంజనానికి సిద్ధం అవుతున్నాడని ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు ఎన్నికల్లోగా మరోసారి వెండితెరను షేక్ చేయడానికి పవన్ తన పనిలో తాను పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు.
గబ్బర్‌సింగ్ 2 చిత్రాన్ని ఈ డిసెంబరు 2 వ తేదీనాటికి షూటింగ్ మొదలుపెట్టేలా పవన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకుడు. అత్తారింటికి దారేది విజయాన్ని ఆస్వాదించేసిన తర్వాత.. బద్ధకంగా సేద తీరకుండా, పవన్ చాలా చురుగ్గా గబ్బర్2 చిత్ర స్క్రిప్టు వర్క్‌ను ముందుకు నడిపిస్తున్నాడట. డిసెంబరులో ప్రారంభిస్తే శరవేగంగా పూర్తిచేయాలనేది ఆయన ప్లాన్‌గా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఎన్నికల్లోగా విడుదలచేసి.. మరోసారి పవన్ మేనియా ఏమిటో తెలుగు ప్రజలకు చూపించాలని పవన్ ఉవ్విళ్లూరుతున్నాడుట. అదే నిజమైతే ఎన్నికల వేళకు మరో హాట్ టాపిక్‌గా పవన్ గబ్బర్ 2 కూడా తెలుగు రాష్ట్రంలో వీరవిహారం చేస్తూ ఉంటుందన్నమాట.
మధ్యలో పూరీ జగన్నాధ్ కెలికిన కె.గం.రాం. గనుక లేకపోయినట్లయితే.. పవన్ కెరీర్లో భారీ హిట్ల హ్యాట్రిక్ నమోదయ్యేదే!!