సంక్రాంతికి మహేష్‌బాబు, అల్లు అర్జున్‌ల చిత్రాల మధ్య ఎంత గ్యాప్ వుండాలనే దానిపైనే ఇంతవరకు సదరు నిర్మాతలు ఒకమాట మీదికి రాలేదు. సంక్రాంతి రేసులోకి వెళ్లడం ఏ సినిమాకి అయినా ప్రమాదం అనిపిస్తూ వుండడంతో మధ్య శ్రేణి చిత్రాలన్నీ డిసెంబర్ రేసుకి బారులు తీరుతున్నాయి. డిసెంబర్ థర్డ్ వీక్ రిలీజ్‌కి ఇప్పుడు సంక్రాంతి కంటే భారీ పోటీ ఏర్పడింది.
నితిన్ భీష్మ, రవితేజ డిస్కోరాజా, సాయిధరమ్ తేజ్ 'ప్రతిరోజూ పండగే', శర్వానంద్ 96 చిత్రాలు మొదట్నుంచీ డిసెంబర్ రేసులోనే వున్నాయి. అయితే సడన్‌గా 'వెంకీ మామ' కూడా డిసెంబర్ రేసులోకి రావడంతో ఇప్పుడు అడ్జస్ట్‌మెంట్ కుదరడం లేదు. దీపావళికి అనుకున్న వెంకీమామ వాయిదా పడడంతో డిసెంబర్‌కి ప్లాన్ చేసుకున్న సినిమాల్లో కనీసం రెండయినా పక్కకి జరగాల్సిన పరిస్థితి వచ్చింది.
వెంకటేష్, చైతన్యల 'వెంకీమామ' రాకతోనే ఇబ్బంది ఏర్పడితే బాలకృష్ణ సినిమా కూడా డిసెంబర్‌కే వస్తుందని వార్తలు వస్తూ వుండడంతో ముందునుంచీ ఈ డేట్ అనుకున్న సినిమాలకి ఇప్పుడు తగిన రిలీజ్ డేట్ దొరకని పరిస్థితి వచ్చింది. జనవరి 26 కూడా ఆదివారం కావడంతో రిపబ్లిక్ డే రిలీజ్‌కి కూడా ఎవరికీ ఆసక్తి లేకపోయింది. మరి ఇన్ని సినిమాలలో ఎన్ని డిసెంబర్‌లో వస్తాయో, వీటిలో ఎన్నిటికి ఆదరణ దక్కుతుందో చూడాలి.