బాలీవుడ్లో తెలుగు సినిమాల హవా ఏమిటనిపిస్తోందో, లేక అక్కడి ప్రొడక్షన్ హౌస్‌లు, స్టార్లనుంచి ఒత్తిళ్లు వస్తున్నాయో, కారణం ఏమైనా కానీ బాలీవుడ్ మీడియా సడన్‌గా సౌత్ సినిమాలని తొక్కే ప్రయత్నాలు చేస్తోంది. 'సాహో' చిత్రానికి జీరో, వన్ రేటింగులు ఇచ్చి అతి చెత్త చిత్రంగా చిత్రీకరించడంతోనే ఈ అనుమానాలు మొదలయ్యాయి. అంతకుముందు 'కబీర్ సింగ్' దర్శకుడు సందీప్ వంగాపై వ్యక్తిగత విమర్శలతో దాడి చేసిన సంగతి కూడా గుర్తుండే ఉంటుంది.
తాజాగా 'సైరా' చిత్రానికి బాలీవుడ్ టాప్ క్రిటిక్స్ ముఖం చాటేసారు. చిరంజీవి, చరణ్ ప్రచారానికి వెళ్లినపుడు ఎగబడి ఇంటర్వ్యూలు చేసిన వారే 'సైరా' విడుదలయ్యాక సమీక్షించడానికి మాత్రం ముందుకి రాలేదు. యష్‌రాజ్ ఫిలిమ్స్ 'వార్'తో పోటీగా రిలీజ్ అయిన 'సైరా'కి సరైన పబ్లిసిటీ ఇవ్వకుండా అక్కడి మీడియా ప్రముఖులు తమ వంతు చేయాల్సినది చేసారు.
తెలుగు అనువాద చిత్రాల సంఖ్య పెరిగితే, అందులోను సాహో, సైరా లాంటి భారీ చిత్రాలు దక్షిణాది నుంచి వస్తే బాలీవుడ్ మేకర్స్ ఆడియన్స్ దృష్టిలో చులకన అవుతారు. అందుకే మీడియా, ఫిలిం క్రిటిక్స్ సాయంతో పెద్ద సంస్థలు, బడా స్టార్లు మన సినిమాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్.ఆర్.ఆర్., కెజిఎఫ్ 2 చిత్రాలకి అక్కడ ఎలాంటి స్పందన వస్తుంది, మీడియా ఎంతవరకు సహకరిస్తుంది అనేది ఆసక్తికరం.