సినిమాలకు రిలయన్స్ బై బై?

రిలయన్స్ సంస్థ సినిమా నిర్మాణాల్లో పాలు పంచుకోవడం ఆపేసినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా అటు హిందీ, ఇటు తెలుగు, తమిళ భాషల్లో రిలయన్స్ సంస్థ పలు సినిమాలు, ఇక్కడి నిర్మాతల భాగస్వామ్యంతో నిర్మించింది. అదే సమయంలో…

రిలయన్స్ సంస్థ సినిమా నిర్మాణాల్లో పాలు పంచుకోవడం ఆపేసినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా అటు హిందీ, ఇటు తెలుగు, తమిళ భాషల్లో రిలయన్స్ సంస్థ పలు సినిమాలు, ఇక్కడి నిర్మాతల భాగస్వామ్యంతో నిర్మించింది. అదే సమయంలో బిగ్ సినిమా పేరుతో మల్టీ ఫ్లెక్స్ లు కూడా నిర్వహించింది. ఇటీవల ఈ మల్టీ ఫ్లెక్స్ లు ఇతరులకు ఇచ్చేస్తున్నట్లు వినికిడి. 

అదే విధంగా సినిమా నిర్మాణాలు కూడా ఆపేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది తాత్కాలికమా, శాశ్వతంగానా అన్నది తెలియడం లేదు.  తెలుగులో  భోగవిల్లి ప్రసాద్ తో కలిసి రిలయన్స్ సాహసం, అత్తారింటికి దారేది లాంటి సినిమాలు నిర్మించింది. అలాగే నాగార్జునతో కలిసి భాయ్, మనం లాంటి సినిమాలు రూపొందించింది. ప్రస్తుతం భోగవిల్లి ప్రసాద్ దర్శకుడు సుధీర్ వర్మ, హీరో నాగ చైతన్య కాంబినేషన్ లో నిర్మిస్తున్న దోచేయ్ సినిమాకు కూడా రిలయన్సే సమర్పణ. 

త్వరలో సుకుమార్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో అదే నిర్మాత తీయబోయే సినిమాకు కూడా రిలయన్స్ భాగస్వామ్యం వుంటుదనుకున్నారు. కానీ ఇప్పుడు అది అనుమానంగా వుంది. ఇక్కడ రెండు వెర్షన్లు వినవస్తున్నాయి. ఒకటి రిలయన్స్ సంస్థ ఈ సినిమాకు 40 కోట్ల నిర్మాణ వ్యయాన్ని క్రాస్ చేయకూడదని కండిషన్ పెట్టిందని ఒకటి. రిలయన్స్ ఇంకా ఏ విషయం నిర్ణయించుకోలేదని, భోగవిల్లి ప్రసాదే పూర్తి నిర్మాతగా వుంటారని. సినిమా నిర్మాణమైతే ఆగదని, మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ వుంటుందని యూనిట్ వర్గాల బోగట్టా. 

నిజానికి రిలయన్స్ సంగతి అలా వుంచితే నలభై కోట్ల బడ్జెట్ దాటితే ఎవరికైనా కష్టమే,. ఎందుకంటే అంత హిట్ టాక్ ను స్వంత చేసుకున్న టెంపర్ కూడా నలభై కోట్ల మార్కు దాటడానికి కిందా మీదా అవుతోంది. పోనీ ఈ సినిమాతో మళ్లీ ఎన్టీఆర్ మార్కెట్ పుంజుకుంది అనుకున్నా, రాబోయే సినిమా అమ్మకాలు అన్నీ కలిపి ఆ నలభై కోట్ల రేంజ్ లోనే వుంటాయి. 

అందువల్ల రిలయన్స్ గీత గీసినా గీయకున్నా నలభై కోట్ల లోపు బడ్జెట్ అయితే సేఫ్ బెట్టింగ్ అవుతుంది. ఇదిలా వుంటే ఒకవేళ రిలయన్స్ సంస్థ కనుక సినిమాలకు స్వస్తి చెబితే, సుకుమార్-ఎన్టీఆర్ ప్రాజెక్టులో పాలు పంచుకోవాలని యూరోస్ సంస్థ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో సుకుమార్ తీసిన నేనొక్కడినే కు యూరోస్ సంస్థ భాగస్వామిగా వ్యవహరించింది.