బాహుబలిని ఎవరూ ఏమనకూడదా..?

ఇదే మనోళ్లతో వచ్చిన సమస్య. మాస్‌ హిస్టీరియా.. ఎక్కువమంది జనాలకు ఏదైనా బాగా ఎక్కిందంటే.. అంతే, దాన్ని ఏమైనా అంటే తట్టుకోలేరు. అందులోని లోటుపాట్లను, తప్పొప్పులను ఎంచితే.. సహనంతో ఉండలేరు. అది తమకు గొప్ప…

ఇదే మనోళ్లతో వచ్చిన సమస్య. మాస్‌ హిస్టీరియా.. ఎక్కువమంది జనాలకు ఏదైనా బాగా ఎక్కిందంటే.. అంతే, దాన్ని ఏమైనా అంటే తట్టుకోలేరు. అందులోని లోటుపాట్లను, తప్పొప్పులను ఎంచితే.. సహనంతో ఉండలేరు. అది తమకు గొప్ప అనిపించింది కాబట్టి.. దాన్ని అంతా గొప్పా అనాలంతే. లేకపోతే మీదపడి రక్కుతారు. ఇలాంటి జీవితాలను ఎవడూ మార్చలేడు. సినిమాను సినిమాగా గాక, హైప్‌తోనో.. అభిమానంతోనో.. తామేదో ఇతిహాసాన్ని చూస్తున్నామనే భ్రమతోనే చూస్తే.. అందులోని తప్పొప్పులు కనిపించకపోవచ్చు.

బాహుబలి వీక్షణకు విందు, వీనులకు విందు.. ఇక ఆ సినిమాను వందల కోట్ల రూపాయల కలెక్షన్లను ఇట్టే సంపాదించేస్తోంది కాబట్టి.. ఆ సినిమాను ఏమీ అనకూడదు. అందులోని తప్పొప్పులు ఎంచకూడదు. ఈ తీరు మనకు కొత్తేమీకాదు. గతంలో కూడా చాలా సినిమాల విషయంలోనూ జరిగింది. ఇప్పుడు రాజమౌళి సినిమా విషయంలోనూ జరుగుతోంది. పదేళ్ల కిందట 'హ్యాపీడేస్‌' అనే సినిమా వచ్చింది. ఆనంద్‌ తీసిన శేఖర్‌ కమ్ముల ఆ సినిమాను తీయడంతో.. విడుదలకు ముందే హైప్‌ పెరిగింది.

స్టూడెంట్స్‌ సినిమా కావడంతో ఫుల్‌క్రేజూ కనిపించింది. ఆనంద్‌ సమయంలో శేఖర్‌ను ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు.. కేవలం మంచి సినిమాలను ప్రోత్సహించే వాళ్లే ఆ సమయంలో శేఖర్‌ను ప్రశంసించారు. ఆనంద్‌ను ఆదరించారు. హ్యాపీడేస్‌ వద్దకు వచ్చేసరికి.. 'ఆనంద్‌'ను అమితంగా ఇష్టపడ్డవారిలో కొందరు పెదవి విరిచారు. 'హ్యాపీడేస్‌' సినిమా చూడబుల్‌, కానీ.. మరీ కళాఖండం ఏమీకాదు.. కనీసం ఆనంద్‌ స్థాయిలో సగంస్థాయి సినిమా కూడా కాదు అని నాటి మీడియా ద్వారా వీరు అభిప్రాయాన్ని వినిపించసాగారు. అంతే, అప్పుడు కూడా మీదపడి రక్కేసే బ్యాచ్‌ రెచ్చిపోయింది. 'హ్యాపీడేస్‌' సినిమాను ఏమైనా అంటారా.

మీ కళ్లు పోతాయ్‌.. అంటూ వీరు శాపనార్థాలు పెట్టారు. మరి పదేళ్లు గడిచాయ్‌… ఇప్పుడు జనాలకు ఉన్నంతలో గుర్తున్నది 'ఆనంద్‌' నా, లేక 'హ్యాపీడేస్‌' నా? అనేది అందరికీ తెలిసిందే. ఇప్పటికీ టీవీలో ప్రసారం అయితే, ఆనంద్‌ వద్ద రిమోట్‌ ఆగుతుందా, హ్యాపీడేస్‌ సినిమా దగ్గర ఆగుతుందా? అనేది వివరించాల్సిన అంశంకాదు.

పై రెండు సినిమాలూ కేవలం ఒక ఉదాహరణ అంతే. ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.. ఇప్పుడు బాహుబలి, బాహుబలి-2ల విషయానికి వస్తే, ఈ సినిమాలను ఏమైనా అంటే అది మహాపరాధం అనే దగ్గరతో మొదలుపెట్టి.. మీకు కులపిచ్చి.. అందుకే ఇలా మాట్లాడుతున్నారు, అనేంత వరకూ వెళ్లిపోతున్నారు. పాపం.. ఎంత సెన్సిటివ్‌గా తయారయ్యారో. అసలు ఈ సినిమా విషయంలో 'కులం' ప్రస్తావన వస్తోందో.. అంతుబట్టని విషయం. ఎప్పుడైతే 'మా కమ్మ వాడు కాబట్టే రాజమౌళి ఇంత గొప్ప సినిమా తీశాడు..' అని కొంతమంది సోషల్‌ మీడియాకు ఎక్కారో.. వారే, ఈ సినిమాను కులం కుళ్లులో ముంచెత్తడం మొదలుపెట్టారు. ఈ సినిమాను కమ్మవాడిగా తీశానని కానీ, కమ్మవాళ్ల ఘనతను చాటి చెప్పడానికి తీశానని కానీ రాజమౌళి ఎక్కడా చెప్పలేదు. ఆయను కులం కుళ్లులోకి లాగిన వారు.. ఈ సినిమాలోని లోటు పాట్లను ఎంచే వారికి కూడా కులం కుళ్లును అంటగడుతున్నారు. బురదలో పంది చందం వీరిది.

పోలిక కాదు కానీ, సినిమా స్క్రిప్ట్‌ అంటే ఎలా ఉంటుందో.. తెలియజెప్పడానికి ఒక సినిమాను ప్రస్తావించుకోవాలి. దీనికోసం ఏ హాలీవుడ్‌ సినిమానో.. మరేదో దేశం సినిమానో కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. విక్రమ్‌.కె కుమార్‌ దర్శకత్వంలో వచ్చిన '24' సినిమానే చాలు.. సినిమా స్క్రిప్ట్‌లోని బిగి అంటే, ఎలా ఉండాలో, ఉంటుందో తెలియజెప్పడానికి. ఆ సినిమా బాగా పాపులర్‌, ఎంటర్‌ టైనర్‌.. అదే సమయంలో.. కనీసం అరనిమిషం సీన్‌ కూడా వ్యర్థంగా కనిపించని సినిమా. ఆఖరికి సీన్‌లోని మనుషుల వెనుక కనిపించే కాకికి కూడా కథతో సంబంధం ఉంటుంది, కాకి ఈక కూడా సినిమాను మలుపు తిప్పుతుంది. అదొక ఫిక్షనల్‌ సినిమానే. కానీ.. అన్నీ హద్దుల్లోనే ఉంటాయి. నేలను వదిలి విహారం చేయడంకాదు.. బిగించి పట్టినట్టుగా.. అదే సమయంలో అత్యంత సాఫీగా సాగుతుంది ఆ సినిమా స్క్రిప్ట్‌.

నిజమే.. '24' సినిమా బాహుబలి అంత గొప్ప సినిమా కాదు(ఇప్పుడు ఊగిపోతున్న జనాల లెక్కలో). బాహుబలి అంతస్థాయి కలెక్షన్లు రాలేదు, బాహుబలి అంతా క్రేజ్‌ ఆ సినిమాకు లేదు. బాహుబలి ద్వితీయ భాగం కోసం ఎదురు చూసినట్టుగా ఆ సినిమా కోసం ఎవ్వరూ ఎదురు చూడలేదు. ఇక్కడ పోలిక కూడా.. ఈ విషయాల్లో కాదు. రచన విషయంలో.. బాహుబలి స్క్రిప్ట్‌లోని డొల్లతనాన్ని వివరించడానికి ముందుగా '24' సినిమాను ప్రస్తావించాల్సి వస్తోంది. ఎవరో చెబుతున్నారు.. బాహుబలితో మన సినిమా అంతర్జాతీయ స్థాయికి, హాలీవుడ్‌ను తలదన్నే రీతికి చేరిందని.. మరి ఏరకంగానో వారికి కూడా తెలియదు. ఏ క్రాఫ్ట్‌ విషయంలో బాహుబలి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందా అని.. ఒకటికి పదిసార్లు ఆ సినిమాను చూశాకా, అందులోని లోటుపాట్లు మరింత స్పష్టంగానే అర్థం అవుతాయి తప్ప.. ఎదిగిన వైనాలేవీ కనిపించవు.

ప్రపంచ స్థాయికి చేరిన సినిమాలో పామరుడికి కూడా తప్పులు దొరికితే ఎలా? పాత్రల స్వభావం కానీ, వచ్చిపోయే సీన్లు కానీ.. ఎందుకిలా? అనే సందేహాన్ని జనింపజేస్తే ఎలా? ఏ పాత్ర అయితే అద్భుతం అని చెబుతున్నారో.. అదే పాత్రనే ముందుగా ప్రస్తావించుకోవాలి. రాజమాత శివగామి దేవి పాత్ర.. ఏదో సినిమా సాగాలి కాబట్టి.. అలా ప్రవర్తిస్తుందా ఆమె? సినిమా ఆసాంతం ఆమె ఘనత గురించి గొప్పగా చెబుతారు కానీ తను పెంపకంలోని కొడుకు వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోలేదా? తల్లిదండ్రుల్లోని ఉత్తమ లక్షణం ఏమిటంటే.. తమ బిడ్డల గురించి చెప్పుడు మాటలు నమ్మకపోవడం.. వేరే వాళ్లెవరో చెబితే నమ్మేస్తే.

ఇక తల్లి గొప్పదనం ఎక్కడ? మరి ఆమెను సాధారణ తల్లిగా చూపారా అంటే, అదేమీ లేదు… మమతలతల్లి, రాజమాత, గొప్ప రాజనీతిజ్రాలు.. ఆమె గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువే అని సినిమాలో అడుగడుగునా చెప్పుకొంటూ వచ్చి.. ఆమె ప్రవర్తనలో మాత్రం అలాంటి గొప్పదనం కనిపించకపోతే.. క్యారెక్టర్‌ జస్టిఫికేషన్‌ ఎక్కడ? అంటే.. ఒకటి ఆమె గొప్పది అనే మాట అబద్ధం లేదా, పాత్రౌచిత్యం పూర్తిగా దెబ్బతిన్నట్టే!

ఇక్కడే మరోరకం పట్టుబడటం ఏమిటంటే.. శివగామి దేవి తన పాలు తాగి పెరిగి, తన చేతి ముద్దలు తిని, తన పెంపకంలో పెరిగిన బిడ్డను అనుమానిస్తుంది, చంపమని ఆదేశిస్తుంది. కానీ.. ఆ రాజ్యంలోని ప్రజలెవరూ.. సదరు హీరోని అనుమానించరు. అతడిపై అంచంచలమైన విశ్వాసంతోనే ఉంటారు వాళ్లంతా. నిస్వార్థంగా ప్రజలు అతడిని ప్రేమిస్తూ ఉంటారు. అతడి కోసం ప్రాణాళిచ్చేంత స్థాయి ప్రేమ వారిది.. మరి ఊళ్లో వాళ్లకు అర్థం అయినంత స్థాయిలో తల్లికే అర్థంకాలేదు బాహుబలి. మరి ఊళ్లో వాళ్లను అంతగా ఆకట్టుకోవడానికి కారణం ఏమిటో, తల్లిలో అంతగా ధ్వేషాన్ని రగల్చడానికి కారణం ఏమిటో..!

లేదు.. ఇలాంటి లాజిక్‌లన్నీ అడగొద్దు.. బాహుబలి కలెక్షన్ల గురించి మాత్రమే మాట్లాడాలి, భారీ సెట్టింగుల గురించి.. వీఎఫ్‌ఎక్స్‌ను చూసి మాత్రమే మాట్లాడాలి, వాటిని గుర్తించి.. సినిమాను ప్రశంసించేయాలి.. పొగిడేయాలి అనొచ్చు. ఆ విషయాల గురించి మాట్లాడితే మాత్రమే.. బాహుబలి గొప్ప సినిమా, లేకపోతే కాదా? అదేనా ప్రపంచ స్థాయి.

బాహుబలి పార్ట్‌-1 అండ్‌ 2లను చూశాకా.. అంతుబట్టకుండా వచ్చిపోయే పాత్రలు, అర్థం లేకుండా వ్యవహరించే పాత్రలు… అంతూపొంతూ లేకుండా సాగే సీన్లు బోలెడన్ని అగుపిస్తాయి. సినిమాను ఆలోచించి చూసే వాళ్లకు పంటి కింద రాళ్లలా తగులుతూ ఉంటాయి. ముందుగా '24' సినిమాను ప్రస్తావించింది ఎందుకంటే.. సీన్‌కు సీన్‌కు కనెక్టివిటీ అంటే ఎలా ఉంటుందో, ఫిక్షన్‌ను కూడా లాజికల్‌గా ఎలా చూపించవచ్చునో.. తెలియజేసే సినిమా అది. మనందరికి బాగా ఎరిగిన సినిమా అది. అందునా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమా. మరి దానికీ దీనికి సంబంధంలేదు, అది సైన్స్‌ ఫిక్షన్‌, ఇది వేరే.. అనేయవచ్చు. ఇక్కడ పోలిక జోనర్‌ గురించి కాదు.

అసలు బాహుబలి ఏ జోనర్‌ సినిమా అంటే చెప్పడం కష్టమే.. పౌరాణికం కాదు, ఇతిహాసం కాదు, సాంఘికం కాదు, జానపదం అనుకోవచ్చా? బాహుబలి భక్తులే చెప్పాలి. అడవిలో అగుపించే ఒక అనామకుడిని యువరాణి తన అంత:పురంలోకి తీసుకెళుతుంది.. అతడు ఆమె నడుమును పట్టుకుంటాడు, ఆ పట్టును చూసి అతడు వీరుడని ఆమె తేల్చేస్తుంది..ఆశ్చర్యపోవద్దు. 'పట్టు' విషయంలో యువరాణికి ఎంత అనుభవం ఉందో మరి! మాహిష్మతి రాజ్యంలోని తాటి చెట్లు చాలా ప్రత్యేకం… మునగ చెట్లంత పెలుసు…. ఇలా వంచితే అలా వంగుతాయంతే!

ఫిక్షనల్‌ సినిమాలో ఇలాంటివి తప్పులు కాదు అనేవాళ్లు చాలా మందే ఉన్నారు, ఇలా ఎదురు ప్రశ్నించడానికి ముందు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. ప్రాథమిక నియమాల్ని మరిచినది ప్రపంచ స్థాయి సినిమా ఎలా అవుతుంది? గ్రాఫిక్స్‌ను, హైప్‌ను, మానియాను పక్కన పెట్టి చూస్తే… బాహుబలి ఒక డొల్ల స్క్రిప్ట్‌ కాదా? అందుకు రుజువు ఆ సినిమానే కదా!