చంద్రబాబు అధికారంలో ఉంటే చాలు రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుందనేది ఆయనపై ఉన్నవిమర్శ. మరి నిజంగానే చంద్రబాబు జాతకం బాగాలేదో ఏమోగానీ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు పెను భీకరంగా ఉన్నాయి. కరువుకు విలయాలు, విపత్తులు తోడై జనాలను విలవిల్లాడిస్తున్నాయి. ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు పగటిపూట బయటకురాలేని పరిస్థితి. ఒంగోలు, కావలి, గుంటూరు, విజయవాడలలో దాదాపు 50 డిగ్రీల ఎండ. వారం రోజుల్లోనే ఎండలు, వడగాలులకు తాళలేక రాష్ట్రంలో 200 మంది చనిపోయారంటే తీవ్రత చూడండి.
మరోవైపు ఉరుములు, పిడుగులు. గురువారం ఒక్కరోజే 5చోట్ల పిడుగులు పడ్డాయి. ఇద్దరు చనిపోయారు. సరే పగలు ఎలాగోలా వేగాం రాత్రయినా కనీసం ప్రశాంతంగా నిద్రపోదామంటే అదీలేదు. ఎడాపెడా కరెంటు కోతలు. ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి. 24గంటల కరెంటు అని ఒకవైపు సర్కారు చెప్పుకుంటుంటే మరీ కోతలు ఏంటిరా బాబూ అంటే ఎండలకు కరెంటు తీగలు కరిగి తెగిపోతున్నాయట. ఈ కారణంగానే గత రెండురోజులుగా ఉత్తరాంధ్రలో రాత్రంతా కరెంటులేదట. ఇంకేం చెప్పాలండి.
గ్రామాల్లో ఒక్క బోరులో కూడా నీళ్లు రావడంలేదు. ఇక బావులైతే ఎప్పుడో ఎండిపోయాయి.
చెరువులు ఎడారుల్లా కనిపిస్తున్నాయి. తాగేందుకు కూడా గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి. కరువును ఆసరాగా చేసుకుని నీటి మాఫియా రాజ్యమేలుతోంది. ఇరవై లీటర్ల క్యాన్ ఇరవై రూపాయాలు. మండిపోతున్న ఎండలకు ఎన్ని నీళ్లు తాగితే దాహం తీరుతుంది చెప్పండి. ఒక్కటంటే ఒక్క జలాశయం, ప్రాజెక్టుల్లో నీళ్లు లేవు. పదేళ్లలో ఎన్నడూ లేనంత దిగువకు నీటి మట్టాలు పడిపోయాయి. నాగార్జున సాగర్ పరిస్థితి మరీ దారుణం. కృష్ణానది బీడు వారిపోయింది.
కానీ తెలంగాణలో పరిస్థితి చాలా భిన్నంగా ఉందండోయ్. గతేడాది కురిసిన వర్షాలు, మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల బాగుతో మే నెల ఎండలలో కూడా జలాశయాలు నిండుగా ఉన్నాయి. చెరువులు, కుంటలు జలసిరితో కళకళలాడుతున్నాయి. హైదరాబాద్‌కు మంచినీరు అందించే గండికోటలో నిండుగా నీళ్లున్నాయి. మిషన్ భగీరధ పేరుతో ఇంటింటికీ కుళాయి ద్వారా నీరు అందించే ప్రయత్నం జరుగుతోంది. ఆంధ్రా ప్రజలను ప్రకృతి కరుణించి ఈసారైనా సకాలంలో నాలుగు వానలు పడకపోతే ఇక అంతే సంగతి.