ఈ రాజీ అప్పడే చేసుంటే శ్రీనువైట్ల?

శ్రీను వైట్ల..పంతానికి మారుపేరు..కోరి కెలుక్కునేందుకు సరదాపడే మనిషి. కోన  వెంకట్ అండ్ కో తో సమస్య. ప్రకాష్ రాజ్ తో కయ్యం. పైగా సినిమా జనాలపై తన సినిమాలోనే సెటైర్లు. ఇలా అన్నీ చేసి…

శ్రీను వైట్ల..పంతానికి మారుపేరు..కోరి కెలుక్కునేందుకు సరదాపడే మనిషి. కోన  వెంకట్ అండ్ కో తో సమస్య. ప్రకాష్ రాజ్ తో కయ్యం. పైగా సినిమా జనాలపై తన సినిమాలోనే సెటైర్లు. ఇలా అన్నీ చేసి ఆగడు సినిమాను ఇంటికి పంపేసాడు. మహేష్ బాబుతో రెండో సినిమా చేస్తున్నాం.. అయిందేదో అయింది అని కోన వెంకట్ తో రాజీ పడలేదు. ప్రకాష్ రాజ్ ను నానా గత్తర చేసాడు. తన సత్తా చూపిస్తానని, కిందా మీదా పడి, హీరో ఫ్యాన్స్ హర్ట్ చేసాడు. 

ఇప్పుడు తన కెరీర్ ఢామ్ అనే సరికి, అన్నీ వదిలేసి, మీరెలా చెబితే అలా అని మెగాక్యాంప్ ముందు చేతులు కట్టుకు కూర్చున్నాడని, మహేష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.  మరి నిజంగానే పంతం వున్నవాడైతే, కోన వెంకట్ తో జతకట్టాల్సిందే అని మెగా హీరో అనగానే, వెనక్క వచ్చేయాలి కదా? అబ్బే..అలా వస్తే, సినిమా ఇచ్చేదెవరు? అందుకే సరే..అని అనేసి, కోన వెంకట్ తో జతకట్టి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు లాంటి మకుటాలన్నీ కోన వెంకట్ కు వదిలేస్తున్నట్ల బోగట్టా. 

తన పేర ముందు కేవలం డైరక్టర్ అన్న డిజిగ్నేషన్ మాత్రమే వుంచుకుంటాడన్నమాట. ఇప్పుడు ఆ సినిమా హిట్ అయితే క్రెడిట్ శ్రీను వైట్లకు ఎలా వస్తుంది? వీళ్లతో విడిపోయాక ఆగడు ఫ్లాపయింది. వీళ్లతో జతకట్టాక హిట్ వచ్చింది. అని అనుకోరా? అప్పుడు అసలు సత్తా శ్రీను వైట్లది కాదు..వాళ్లది అని డిసైడ్ అయిపోరా? మరి ఈ రాజీ యేదో మహేష్ సినిమా అప్పుడే పడి వుంటే ఆ సినిమా కూడా హిట్ బాట పట్టేది కదా? 

రేపు మెగా క్యాంప్ తమ సినిమాలోకి ప్రకాష్ రాజ్ ను కూడా తీసుకోవాలంటే శ్రీను వైట్ల ఏం చేస్తారు. సినిమా వదులుకోలేరు కదా..అహం వదులుకుంటారు. గతంలో ప్రకాష్ రాజ్ ను దర్శకుడు కృష్ణవంశీ అలాగే తీసుకున్నారుగా. ఇలా అన్ని విధాలా పడిన రాజీయేదో అప్పుడే పడితే ఇప్పుడు మరీ ఇంతలా కిందా మీదా పడాల్సిన పరిస్థితి వచ్చేది కాదేమో? అందుకే పంతాలు పోయేటపుడు కాస్త ఆలోచించాలి. అందునా నలుగురిని కలుపుకుని వెళ్తేనే విజయం సాధ్యం అని తెలిసినపుడు.