రోడ్డు ప్రమాదాలు నిత్యం అనేక మందిని విగతజీవులుగా మార్చేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు జరగని రోజు ఇటీవలి కాలంలో లేదంటే, ఎంతగా రోడ్లు ‘బలి’ కోరుకుంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. దాదాపు అన్ని రోడ్డు ప్రమాదాలకూ ‘బాధ్యతా రాహిత్యం’ ప్రధాన కారణమవుతోంది. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సుని నడిపాడంటే, దాని వెనుక పాలకుల బాధ్యతా రాహిత్యమే స్పష్టగా కన్పిస్తుంది. ఫిట్నెస్ లేని బస్సులు రోడ్డెక్కడం వెనుకా పాలకుల బాధ్యతా రాహిత్యం సుస్పస్టం.
ఏదన్నా ప్రమాదం జరిగితే, చటుక్కున డ్రైవర్‌పై కేసులు నమోదు చేస్తారు. అధికారులపై ఆ తర్వాత వేటు పడ్తుంది. ఆ తర్వాత షరా మామూలే. మెదక్ జిల్లా మసాయిపేట ఘటన నుంచి ఇటీవల తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన రోడ్డు ప్రమాదం దాకా.. అన్నిట్లోనూ ఒకటే తంతు. మొన్నామధ్యన అనంతపురం జిల్లాలో జరిగి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి కొందరు అధికారులపై చర్యలు తీసుకోవడంతోనే మమ అన్పించేసింది ఏపీ సర్కార్.
స్కూలు బస్సులైనా, ఆర్టీసీ బస్సులైనా, ప్రైవేటు వాహనాలైనా.. ఫిట్నెస్ లేకుండా రోడ్లెక్కడమంటే అధికార యంత్రాంగం వైఫల్యమే ప్రధాన కారణం. అధికార యంత్రాంగం వైఫల్యమవుతోందంటే, దానికి బాధ్యత వహించాల్సింది పాలకులే. దురదృష్టవశాత్తూ బాధ్యత ఎవరిది.? అన్న దగ్గరే చర్చ ఆగిపోతోంది తప్ప, ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంలో పాలకులు పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్నది నిర్వివాదాంశం.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన రోడ్డు ప్రమాదాన్నే తీసుకుంటే, ప్రమాదానికి కారణం స్కూలు బస్సు. కానీ, ఆ బస్సు ఓ ప్రైవేటు కార్యక్రమం కోసం వినియోగిబడిరది ప్రమాదం జరిగిన సమయంలో. అది కూడా ఓ రాజకీయ కార్యక్రమం. అయితే ఆ బస్సుకీ సదరు స్కూల్ యాజమాన్యానికీ సంబంధం లేదట. విద్యార్థుల్ని తరలించడానికి ఆ బస్సు యాజమాన్యంతో స్కూలు యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకుందట. స్కూల్ లేని సమయంలో, బస్సుని ఎలాగైనా వినియోగించుకోవచ్చు.. అని ఆ బస్సు ఓనర్ అనుకుని వుండొచ్చుగాక. ఇక్కడే స్కూల్ యాజమాన్యం తెలివిగా తప్పించుకుంది. ‘ఆ ప్రమాదంతో మాకు సంబంధం లేదు’ అని చేతులు దులుపుకుంది. ఇక, ఏ కార్యక్రమం కోసం అయితే బస్సును వినియోగించారో, ఆ కార్యక్రమ నిర్వాహకులకీ విచిత్రంగా ఆ ప్రమాదంతో సంబంధం లేదు. బస్సును నడిపిన వ్యక్తి తప్పతాగి వుండటం ఇక్కడ కొసమెరుపు.
మసాయిపేట ఘటన అయినా, అనంతపురం ఘటన అయినా, రాజమండ్రి ఘటన అయినా, ఇంకొకటైనా.. అనేక గుణపాఠాల్ని నేర్పుతోంది కానీ, పాలకులు మాత్రం వాటిని సీరియస్‌గా తీసుకోవడంలేదు. అత్యంత ప్రమాదకరమైన రీతిలో కల్వర్టులు జాతీయ రహదార్లపైనే వుంటున్నాయి. రోడ్లపై హెచ్చరికల బోర్డులుండవు. తప్పతాగి డ్రైవింగ్ చేయడం నేరం.. కానీ దాన్ని నివారించడానికి, అధికార యంత్రాంగం తగు రీతిలో పనిచేయదు, ప్రభుత్వమూ అధికార యంత్రాంగంతో సరైన రీతిలో పనిచేయించడంలో విఫలమవుతోంది.
ఒకరో, ఇద్దరో, పది మందో, పాతిక మందో.. రోడ్డు ప్రమాదాల్లో నిత్యం బలవుతూనే వున్నారు. బస్సులు తగలడతాయి.. కార్లు నుజ్జునుజ్జవుతాయి.. లారీలు ప్రాణాలు తోడేస్తాయి.. పొద్దున్న పేపర్ తిరగేస్తే రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వార్తలు ప్రతి జిల్లా ఎడిషన్‌లోనూ ప్రముఖంగా విన్పించడం సర్వసాధారణమైపోయింది. అయినా అదే బాధ్యతా రాహిత్యం. కోట్లు గుమ్మరించేస్తున్నారు రహదార్ల కోసం. భద్రతా చర్యల పేరిటా కోట్లు ఖర్చవుతున్నాయి. అయినా రోడ్లు బలికోరుకుంటూనే వున్నాయి.