దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త ఫార్ములా కనిపెట్టారు. 80ల్లో వచ్చిన సినిమాలను ఈ జనరేషన్ టేస్ట్ కు, తన మాటల మ్యాజిక్ జోడించి, కొత్తగా వదలడం. అంటే పాత పాటలు రీమిక్స్ చేసినట్లు, పాత సినిమాలు రీమిక్స్ చేయడం అన్నమాట. ఆ మధ్య అ..ఆ సినిమాతో ఈ తరహా ప్రయోగం చేసారు. బ్లాక్ అండ్ వైట్ లో తక్కువ బడ్జెట్ లో తీసిన మీనా సినిమాను భారీ సినిమాగా, రంగుల హరివిల్లుగా అందంగా మార్చి చూపించారు.
ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయోగమే అజ్ఞాతవాసితో చేయబోతున్నారని టాక్. ఈ సినిమా లైన్ హాలీవుడ్ సినిమా నుంచి తెచ్చుకున్నా, కథనం మాత్రం 80ల్లో వచ్చిన రాఘవేంద్రరావు చిరంజీవి రౌడీ అల్లుడు టైపులో వుంటుందట. చాలా సినిమాల్లో చూసిందే.
హీరో వచ్చి విలన్ బ్యాచ్ ను 'నీ భరతం పడతా చూడు' అనే టైపులో నానా అల్లరి చేయడం. చలం దగ్గర నుంచి చిరంజీవి దాకా అందరూ చేసింది ఇప్పుడు తివిక్రమ్ స్టయిల్ లో పవన్ చేస్తున్నారన్నమాట. విలన్ లు హీరోయిన్ అమ్మ, నాన్నల్ని డెన్ లో కట్టేయడం, తన వారి కోసం హీరోయిన్ హీరోను మోసం చేయడం ఇలాంటివి 80ల నాటి సినిమాలను గుర్తుకు తెస్తాయంటున్నారు.
ఇక త్రివిక్రమ్ కు పాత సినిమాలు అంటే ఇష్టం. మాయా బజార్ లో శర్మా.. శాస్త్రీ అంటూ ఇద్దరు లక్ష్మణకుమారుడి పక్కన వుండి హల్ చల్ చేస్తారు. ఆ పేర్ల స్పూర్తితో శర్మా.. వర్మ అంటూ మురళీ శర్మ, రావు రమేష్ ల పాత్రలు తయారుచేసారని టాక్. రాఘవేంద్రరావు సినిమాలో కూడా రావుగోపాలరావు పక్కన ఎప్పుడూ రెండు కామెడీ పాత్రలు వుండేవి. అల్లు రామలింగయ్య, సత్యనారాయణ, గిరిబాబు లాంటి వాళ్లు ఆ పాత్రలు పోషించేవారు.
అ..ఆ సినిమాకు చిన్న ఎక్స్ టెండెడ్ క్లయిమాక్స్ ఎంత అట్రాక్షన్ గా మారిందో తెలిసిందే. అదే విధంగా ఈ సినిమాలో కూడా లిఫ్ట్ లో హీరో, ఇద్దరు కమెడియన్లు వుండి, ఏ హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటాడు హీరో అన్న డిస్కషన్ లో వుండగా కరెంట్ పోయి, ది ఎండ్ కార్డ్ పడిపోతుందట.
సినిమాలో ప్రధానమైన ట్విస్ట్ లు రెండు మూడు వుంటాయని తెలుస్తోంది. అందులో మంచిగా వుంటూ, సడెన్ గా విలన్ అని తెలిసే ట్విస్ట్ ఒకటి అని తెలుస్తోంది.
ఇదికాక ఫస్ట్ లుక్ లో, చాలా పోస్టర్లలో కనిపిస్తున్న పవన్ మెడలోని ఆంజనేయస్వామి లాకెట్ కు కూడా సినిమాలో కీలకమైన పాయింట్ వుంటుందని వినిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ సారి పవన్-త్రివిక్రమ్ ద్వయం సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది.