'బాహుబలి' ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలను నమోదు చేస్తున్న చారిత్రాత్మక తెలుగు సినిమా. ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో ఎన్ని కొత్త రికార్డులను నమోదు చేస్తుందో ఇంకా ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇంత భారీ హిట్ చిత్రాన్ని టీవీలో ప్రసారం చేసే అవకాశం ఎవరు దక్కించుకోగలరు.. అనే విషయంలో బోలెడు ఆసక్తి ఉండడం సహజం. ఎంటర్టైన్మెంట్ శాటిలైట్ టీవీ ఛానెళ్లు అన్నీ కూడా దీనికోసం పోటీపడడమూ సహజం. అయితే ఈ విషయంలో ఈటీవీ గ్రూపు అధినేత రామోజీరావు విజయం సాధించినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.
రామోజీ రావు బాహుబలి చిత్రం మేకింగ్‌కు అనల్పమైన సాయం చేసినట్లుగా ప్రచారం ఉంది. బాహుబలి చిత్రంలో చాలా భాగాల్ని రామోజీ ఫిలిం సిటీలోని స్టుడియోల్లోనే చిత్రీకరించారు. అంతే కాకుండా.. ఈసినిమాకు రామోజీరావు ఫైనాన్స్ చేసినట్లు కూడా ప్రచారంలో ఉంది. నిజానిజాలు ఎలా ఉన్నా ఆయన చాలా సహకారం అందించిన మాట నిజం. అందుకే.. టైటిల్స్‌లో ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేశారు.
ఈ ఫైనాన్షియల్ డీలింగ్స్ సెటిల్ అవుతున్న సమయంలో.. అందులో భాగంగా.. సుమారు 15 కోట్ల రూపాయల విలువకు సరిపడా బాహుబలి శాటిలైట్ హక్కుల్ని రామోజీరావు చేజిక్కించుకున్నట్లు చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఈటీవీలో ప్రకటనలు వచ్చిన తర్వాత గానీ స్పష్టత రాకపోవచ్చు. సాధారణంగా సూపర్ హిట్ చిత్రాలకు భారీ రేట్లు ముట్టజెప్పి కొనడం పట్ల పట్టీపట్టనట్టు ఉండే ఈటీవీ బాహుబలిని మాత్రం ఇంత భారీ ధరకు తీసుకోవడం విశేషమే.