దాదాపు గత అయిదారేళ్లుగా దర్శకుడు త్రివిక్రమ్ గురించి తెలిసిన వారెవరైనా ఆయన హారిక హాసిని మినహా మరో సంస్థ దగ్గర అడ్వాన్స్ తీసుకుంటారు అని కానీ, సినిమా చేస్తారని కానీ ఊహించరు. పైగా అజ్ఞాతవాసి తరువాత ఆయన ఈ తరహా బాదర బంధాలను చాలా వరకు తెంచుకున్నారు.
మైత్రీ మూవీస్ వంటి సంస్థ కు పెద్ద మొత్తం వడ్డీ కట్టి మరీ అడ్వాన్సు ను తెగతెంపులు చేసుకున్నారు. కానీ ఒక్క దానయ్య మాత్రమే ఎప్పటికైనా తనకు సినిమా చేయండి కానీ అడ్వాన్స్ వెనక్కు తీసుకోను గాక తీసుకోను అని భీష్మించుకుని కూర్చున్నారు.
అలవైకుంఠపురములో సినిమా టైమ్ లో కూడా తమ బ్యానర్ మీద సినిమా చేయాలని గీతా సంస్థ పట్టుపట్టినా, కిందా మీదా పడి హారిక హాసిని తో జాయింట్ గానే సినిమా చేసారు తప్ప వేరు కాదు.
ఇలాంటి నేపథ్యంలో విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలిసింది ఏమిటంటే, నందమూరి కళ్యాణ్ రామ్ బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ దగ్గర త్రివిక్రమ్ కోటి రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారన్నది.
ఇది అరవింద సమేత షూటింగ్ జరుగుతుండగా జరిగిన ముచ్చట. అప్పట్లో మరి ఎన్టీఆర్ తన సోదరుడి బ్యానర్ కు ఓ సినిమా చేయమని అడిగారో? లేక అజ్ఞాతవాసి లాంటి సినిమా తరువాత తనతో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నందుకు కృతజ్ఞతతోనో, మొహమాటంతోనో ఆ బ్యానర్ కు సినిమా చేయడానికి తివిక్రమ్ అంగీకరించారని తెలుస్తోంది.
లేదా అప్పట్లో ఇల్లు కడుతున్నందున అడ్వాన్స్ అవసరమై కూడా వుండొచ్చు. మొత్తం మీద ఇప్పుడు త్రివిక్రమ్ కు హారిక కాకుండా రెండు కమిట్ మెంట్లు వున్నాయి.
అందుకే ఎన్టీఆర్ 30 వ సినిమాకు హారిక బ్యానర్ కు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ను కలిపి చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుతానికి ఆ సినిమా అబేయన్స్ లో పడింది. ఎప్పటికైనా త్రివిక్రమ్ ఓ సినిమా మాత్రం ఎన్టీఆర్ ఆర్ట్స్ కు చేయాల్సి వుంటుంది.