టీజర్ రిలీజ్ సందర్భంగా హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ ఇచ్చారు. ఈ సినిమాకు దర్శకుడు మారిన విషయాన్ని బయటపెట్టారు. చార్మినార్ లాంటి సెట్స్ వేసిన విషయాన్ని కూడా వెల్లడించారు. 2 భాగాలుగా కూడా రాబోతున్నట్టు తెలిపారు. దీంతో పాటు మరో అప్ డేట్ కూడా ఇచ్చారు.
హరిహర వీరమల్లు సినిమాను ఈ ఏడాదిలోనే విడుదల చేస్తారట. ఈ ఏడాది చివర్లో హరిహర వీరమల్లు సినిమా థియేటర్లలోకి వస్తుందని చెబుతున్నారు. దీన్ని చాలామంది జోక్ గా ఫీలవుతున్నారు.
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కొన్నేళ్లుగా సెట్స్ పై నడుస్తూనే ఉంది. ఈ ఆలస్యాన్ని తట్టుకోలేక అర్జున్ రాంపాల్ లాంటి నటుడు తప్పుకున్న సంగతి తెలిసిందే. ఏకంగా దర్శకుడు క్రిష్ కూడా కొంచెం సైడ్ అయ్యాడు. ఎప్పటికప్పుడు పవన్ ఈ సినిమాను వాయిదా వేస్తూ వస్తున్నాడు.
ఎన్నికల ప్రహసనం పూర్తయిన తర్వాత కూడా పవన్ ఈ సినిమాకు డేట్స్ ఇస్తాడన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే, దీని కంటే ముందు అతడు ఓజీ పూర్తిచేయాల్సి ఉంది. లిస్ట్ లో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రెడీగా ఉంది.
ఓజీ సినిమాను సెప్టెంబర్ లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. పవన్ కేవలం 20 రోజులు కాల్షీట్లు ఇస్తే సరిపోతుంది. అయినప్పటికీ ఆ తేదీకి వస్తుందా రాదా అనే అనుమానం ఉంది. ఇలాంటి టైమ్ లో హరిహర వీరమల్లును ఈ ఏడాది చివరి నాటికి విడుదల చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా అనిపిస్తోంది.
అయితే ఇక్కడో చిన్న విషయాన్ని కొట్టిపారేయలేం. ఈ సినిమాను 2 భాగాలు చేశారు. కాబట్టి ఇప్పటివరకు షూట్ అయిన ఫూటేజ్ తో పార్ట్-1ను విడుదల చేసే ఆలోచనలో యూనిట్ ఉందనే విషయం అర్థమౌతూనే ఉంది. పోనీ అలా అనుకున్నప్పటికీ పార్ట్-1కు సరిపడేంత షూటింగ్ చేశారా అనేది మరో పెద్ద డౌట్.