మెల్లమెల్లగా తెరపైకి ఆ 3 వివాదాలు

తరుణ్-లావణ్య కేసు, జానీ మాస్టర్-శ్రేష్టి కేసు, మోహన్ బాబు కుటుంబ తగాదా కేసు ఈ ఏడాది కూడా హైలెట్ అవ్వడం విశేషం.

గతేడాది అత్యంత వివాదాస్పదమైన కేసుల్లో ముఖ్యమైనవి జానీ మాస్టర్ కేసు, రాజ్ తరుణ్ కేసు. ఈ రెండు కేసులు కొత్త ఏడాదిలో కూడా కొనసాగుతాయని అందరికీ తెలుసు. ఇప్పుడిప్పుడే ఈ వివాదాలు మరోసారి మెల్లమెల్లగా తెరపైకొస్తున్నాయి.

బెయిల్ పై బయటకొచ్చిన తర్వాత జానీ మాస్టర్ కేసు చల్లారుతుందని అంతా భావించారు. కానీ ఇప్పుడీ వివాదానికి సంబంధించి ఇంటర్వ్యూలతో కౌంటర్లు-ఎన్ కౌంటర్లు నడుస్తున్నాయి. ముందుగా జానీ మాస్టర్, తన భార్యతో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చాడు. తనపై కేసు పెట్టిన శ్రేష్టి వర్మపై పలు ఆరోపణలు చేశాడు.

దానికి కౌంటర్ గా శ్రేష్టి కూడా బయటకొచ్చింది. ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది. జానీ మాస్టర్ పై, అతడి భార్యపై ఆరోపణలు చేసింది. జానీ మాస్టర్ తనను వాడుకున్నాడు తప్ప, కెరీర్ పరంగా ఎలాంటి సహాయ-సహకారాలు అందించలేదంటూ చెప్పుకొచ్చింది. ఆమె మాటలకు కౌంటర్ ఎటాక్ గా ఆ తర్వాత జానీ మాస్టర్ భార్య కూడా స్పందించింది.

ఇలా జానీ మాస్టర్-శ్రేష్టి వివాదం మరోసారి తెరపైకి రాగా.. ఇప్పుడు రాజ్ తరుణ్ వివాదం కూడా మెల్లమెల్లగా రాజుకుంటోంది. అటుఇటుగా ఓ నెల రోజులు మాత్రమే గ్యాప్ ఇచ్చిన లావణ్య, మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. మస్తాన్ సాయిపై ఆమె ఫిర్యాదు చేసింది. నగ్న వీడియోలున్నాయని చెబుతున్న హార్డ్ డిస్క్ కూడా పోలీసులకు చేరింది.

మరోవైపు ఈ కేసులో ఒకప్పుడు బాగా నలిగిన శేఖర్ భాషాను హత్య చేసే కుట్ర కోణం కూడా తాజాగా బయటపడింది. లావణ్య స్నేహితురాలు, మరో వ్యక్తి మాట్లాడుకున్న ఫోన్ సంభాషణ లీక్ అయింది. “ముక్కలు ముక్కలు ముక్కలుగా నరికి శేఖర్ భాషాను చంపాలి” అంటూ ఆ యువతి మాట్లాడిన మాటల్ని మీడియా హైలెట్ చేస్తోంది.

ఈ రెండు వివాదాల కంటే ముందే మంచు ఫ్యామిలీ వివాదం తెరపైకొచ్చింది. సంక్రాంతి పండగ నుంచే రాజుకున్న ఈ వివాదం ప్రస్తుతం కోర్టుల చుట్టూ తిరుగుతుంది. ఆమధ్య ‘కుక్క’ అంటూ వేసుకున్న ట్వీట్లు, పెట్టుకున్న కేసులకు అదనంగా మరింత మసాలా రాబోతోంది.

ఇలా రాజ్ తరుణ్-లావణ్య కేసు, జానీ మాస్టర్-శ్రేష్టి కేసు, మోహన్ బాబు కుటుంబ తగాదా కేసు ఈ ఏడాది కూడా హైలెట్ అవ్వడం విశేషం. ఇంకొన్నాళ్ల పాటు ఈ 3 కేసులు మీడియాకు మసాలా అందించడం ఖాయంగా కనిపిస్తోంది.

8 Replies to “మెల్లమెల్లగా తెరపైకి ఆ 3 వివాదాలు”

Comments are closed.