మెగా కాంపౌండ్ కు చెందిన హీరో అల్లు అర్జున్. ఇతడు ఎన్నికల ప్రచారం చేస్తే జనసేన పార్టీకి చేయాలి. లేదంటే కూటమి తరఫున జనసేనతో పాటు టీడీపీ-బీజేపీకి క్యాంపెయిన్ చేయాలి. కానీ ఆశ్చర్యంగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు.
అవును.. అల్లు అర్జున్ కాంగ్రెస్ కండువా వేసుకున్న ఫొటోలు, ‘దేశంలో కాంగ్రెస్ ను గెలిపించండి’ అంటూ చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇవన్నీ ఫేక్.
చాలామంది సెలబ్రిటీలు ఇప్పటికే డీప్ ఫేక్ బారిన పడ్డారు. మొన్నటికిమొన్న నటుడు రణ్వీర్ సింగ్, బీజేపీని దూషిస్తున్నట్టు వీడియో ప్రత్యక్షమైంది. అది తన వీడియో కాదని స్వయంగా రణ్వీర్ ప్రకటన చేయాల్సి వచ్చింది. అంతకంటే ముందు అమీర్ ఖాన్ కూడా ఇలానే క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ బాధితుల జాబితాలోకి బన్నీ కూడా చేరిపోయాడు.
స్టార్ డమ్ తెచ్చే చిక్కుల్లో ఇప్పుడు డీప్ ఫేక్ ముందు వరుసలో నిలిచింది. మరీ ముఖ్యంగా ఎన్నికల సీజన్ కావడంతో వీటి గోల మరింత ఎక్కువైంది. ఇంతకీ బన్నీ వీడియో ఎక్కడ్నుంచి వచ్చిందో చూద్దాం..
రెండేళ్ల కిందట న్యూయార్క్ లో జరిగిన ఇండియా డే పరేడ్ కు హాజరయ్యాడు బన్నీ. ఆ వీడియోల్ని తనే స్వయంగా షేర్ చేశాడు. ఆ వీడియోల్నే డీప్ ఫేక్ చేశారు కొంతమంది. “ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు కాంగ్రెస్ కు ప్రచారం చేస్తున్నాడు” అంటూ వీటిని వైరల్ చేస్తున్నారు. వీడియోల్ని డీప్ ఫేక్ చేసి, బన్నీ ధరించిన జాతీయ జెండా స్థానంలో కాంగ్రెస్ జెండా పెట్టారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ అన్ని పార్టీలకు సమదూరంలో ఉన్నాడు. ఏ పార్టీకి అతడు మద్దతిచ్చినట్టు ప్రకటించలేదు. ప్రచారం కూడా చేయడం లేదు. అతడి దృష్టి మొత్తం సినిమాలపైనే ఉంది.