సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిందితుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే సల్మాన్ బయటకొస్తే పరిస్థితేంటనేది ఇప్పుడు అందరికీ ఆందోళన కలిగించే విషయం.
ప్రస్తుతానికైతే సల్మాన్ కు షూటింగ్స్ లేవు. కాబట్టి అతడు తన సెక్యూరిటీ మధ్య భద్రంగా ఉన్నాడు. కానీ వచ్చే నెల నుంచి, అంటే మరో 2 వారాల్లో అతడు కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్లాలి. మురుగదాస్ దర్శకత్వంలో సికిందర్ సినిమా చేస్తాడు.
మరి షూటింగ్ లొకేషన్ లో సల్మాన్ కు సెక్యూరిటీ ఎలా? ఓ స్టార్ హీరో షూటింగ్ అంటే ఎలా ఉంటుందో చాలామందికి తెలిసే ఉంటుంది. రోజూ కనీసం 200 మంది పనిచేస్తారు. అలాంటి ప్రదేశంలో సల్మాన్ ను కాపాడ్డం ఎలా? ఇదే ఇప్పుడు సెక్యూరిటీ సిబ్బందికి తలనొప్పిగా మారింది.
సల్మాన్ షూటింగ్ లొకేషన్ ను, అతడి డేట్స్ ను ఎప్పటికప్పుడు షేర్ చేయాలని భద్రత అధికారులు యూనిట్ కు ఆదేశించారు. కేవలం 10 మందికి మాత్రమే ఆ వివరాలు తెలియాలని, సెట్స్ లో అందరికీ జియో ట్యాగింగ్ ఇవ్వాలని అడుగుతున్నారు. ఇవన్నీ ప్రాక్టికల్ గా సాధ్యమా అనేది తేలాల్సి ఉంది.
లైట్ బాయ్ నుంచి దర్శకుడి వరకు వివిధ విభాగాలన్నీ ఒకే చోట కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఎవరు ఏ డిపార్ట్ మెంటో యూనిట్ లో జనాలకే తెలియదు. అలాంటి పరిస్థితుల్లో సల్మాన్ కు సెక్యూరిటీ ఇవ్వడం సవాల్ తో కూడుకున్న వ్యవహారం.
ప్రస్తుతానికైతే వై-ప్లస్ సెక్యూరిటీ సిబ్బంది అధికారులు సల్మాన్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. సెట్స్ లో కదలికల్ని పరిమితం చేసుకోవాలని సూచిస్తున్నారు. దర్శకుడు స్వయంగా చెప్పేంత వరకు కెమెరా ముందుకు వెళ్లకూడదని.. షాట్ ఓకే అయిన వెంటనే తిరిగి కారవాన్ లోకి వచ్చేయాలని వాళ్లు సూచిస్తున్నారు. కారవాన్ ను కూడా లొకేషన్ కు అతి దగ్గరగా ఉంచాలని నిర్ణయించారు. మరోవైపు సల్మాన్ ఇంటిపై కాల్పులకు ఉపయోగించిన తుపాకీని తాపి నది నుంచి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.