మన్మథుడు-2.. ఈ టైటిల్ చుట్టూరా, కథ చుట్టూరా చాలా గాసిప్స్ నడిచాయి. కొందరు రీమేక్ అన్నారు. మరికొందరు మన్మథుడు సినిమాకు సీక్వెల్ అన్నారు. ఇంకొందరు ఎక్కడ్నుంచో కాపీ కొట్టారని అన్నారు. ఫైనల్ గా వీటన్నింటికీ ఓ క్లారిటీ ఇచ్చాడు నాగార్జున. మన్మథుడు-2ను ఓ అఫీషియల్ రీమేక్ గా చెప్పుకొచ్చాడు.
“మేం ఈ సినిమాను కాపీ కొట్టామని, ఏదో సినిమాను తెలుగులో తీస్తున్నామని కొందరు అంటున్నారు. ఊపిరి అనేది ఓ ఫ్రెంచ్ సినిమాకు రీమేక్. డబ్బులిచ్చి రైట్స్ కొని ఆ సినిమా చేశాం. మన్మథుడు-2 సినిమా కూడా అలానే చేస్తున్నాం. ఏడాదిన్నర కిందట ఈ స్క్రిప్ట్ నాకు వచ్చింది. ఇది కూడా ఓ ఫ్రెంచ్ సినిమా. స్క్రిప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అయితే కథ మీద చర్చలు అప్పుడే ప్రారంభించలేదు. 2 నెలలు సంప్రదించి రీమేక్ రైట్స్ తీసుకున్న తర్వాతే కథ మీద చర్చలు మొదలుపెట్టాం.”
ఇలా మన్మథుడు-2 సినిమాను ఓ ఫ్రెంచ్ సినిమాకు అధికారిక రీమేక్ గా చెప్పుకొచ్చాడు నాగ్. చివరికి ఈ రీమేక్ ను హ్యాండిల్ చేసిన డైరక్టర్ రాహుల్ కు కూడా పేపర్స్ చూపించిన తర్వాతే ప్రాజెక్టు స్టార్ట్ చేశామన్నాడు. అయితే మూలకథ మాత్రమే తీసుకున్నామని, తెలుగు ప్రేక్షకుల టేస్ట్ కు తగ్గట్టు దానికి చాలా మార్పులు చేశామని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా టైటిల్ పై కూడా రియాక్ట్ అయ్యాడు.
“ఎవరో చేసిన క్రియేషన్ ను నేను కొట్టేసేరకం కాదు, నేను అలా చేయను. ఇక టైటిల్ విషయానికొస్తే.. మన్మథుడు, మన్మథుడు-2కు ఎలాంటి సంబంధం లేదు. ఒకే ఒక్క సంబంధం రెండూ కామెడీ జానర్లు. కానీ ఈ సినిమాకు మన్మథుడు-2 అనే టైటిల్ పెట్టడానికి ఓ బలమైన రీజన్ ఉంది. సినిమా చూసిన తర్వాత మన్మథుడు-2 అనే టైటిల్ కరెక్ట్ అని అంతా అంటారు.”
మూవీలో ముద్దుసీన్లపై స్పందించిన నాగార్జున.. తనకు లిప్ కిస్సులు కొత్తకాదన్నాడు. గీతాంజలి సినిమాలో రెండున్నర నిమిషాల లిప్ కిస్ ఉందని, ఇప్పుడు వయసు పెరిగింది కాబట్టి, బాగా ప్రాక్టీస్ కూడా అయింది కాబట్టి, మన్మథుడు-2లో మరిన్ని లిప్ కిస్సులు బాగా పెట్టానని గర్వంగా చెబుతున్నాడు.