మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు సమీపిస్తున్న అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ‘మా’ అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాశ్‌రాజ్‌పై నటుడు, అధ్యక్ష బరిలో నిలిచి , వెనక్కి తగ్గిన సీవీఎల్ నరసింహారావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ధర్మం, దేవుడు, దేశభక్తి అంటే గౌరవం లేని ప్రకాశ్‌రాజ్‌ను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు.
సీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ ప్రకాశ్‌రాజ్‌పై విమర్శలు గుప్పించారు. నాన్ లోకల్ అయిన ప్రకాశ్‌రాజ్‌ను ఓడించాలని కోరారు. ‘మా’ ఎన్నికల్లో తలపడుతున్న తెలంగాణ వారిని గెలిపించాలని అభ్యర్థించారు. ‘మా’ అనేది తెలంగాణ గడ్డపై ఉందన్నారు. ఇదిలా వుండగా ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ప్యానల్‌కు వ్యతిరేకంగా తాను కూడా బరిలో నిలుస్తున్నట్టు సీవీఎల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
తన ఎన్నికల మేనిఫెస్టోను కూడా ప్రకటించారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ, ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తాజాగా ప్రకాశ్‌రాజ్‌పై ఆరోపణలు చేయడం ద్వారా, ఆయన మద్దతు ఎవరికో చెప్పకనే చెప్పారు.
టాలీవుడ్‌లో లోకల్, నాన్ లోకల్ అనే ఫీలింగ్‌ని బలంగా తెరపైకి తేవడంలో ఒక వర్గం సక్సెస్ అయ్యిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెల్లడైతే తప్ప, ఆ ప్రచారం ఎంత వరకు పనిచేసిందో చెప్పలేం.