కన్నడ చిత్ర పరిశ్రమను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) దర్యాప్తు వణికిస్తోంది. డ్రగ్స్ వివాదం శాండల్‌వుడ్‌లో ఇంకా ఎవరెవరి మెడకు చుట్టుకుంటుందోననే ఆందోళన కన్నడ చిత్ర పరిశ్రమలో ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ హీరోయిన్ రాగిణి ద్వివేది శుక్రవారం సీసీబీ విచారణకు హాజరయ్యారు. అంతేకాదు, బెంగళూరులో ఆమె నివాసంలో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఇలా ప్రతిరోజూ ఒక్కో సినీ సెలబ్రిటీని డ్రగ్స్ వ్యవహారంపై కూపీ లాగుతూ విచారణ జరుపుతుండడంతో….ఈ వ్యవహారం తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోననే ఆందోళన నెలకొంది. ప్రముఖ దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్‌ను గురువారం సీసీబీ అధికా రుల ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలువురి ప్రముఖుల పేర్లు చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం.
మూడు రోజుల క్రితం ఈయన్ను విచారించిన సందర్భంలో సరైన వివరాలు అందించలేదని విచారణ బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో మరోసారి మరిన్ని ఆధారాలతో ఆయన విచారణకు వెళ్లారనే సమాచారంలో చిత్ర పరిశ్రమలో గుబులు రేపుతోంది.
రాగిణితో పాటు మరో నటి సంజనా కూడా డ్రగ్స్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటోంది. అయితే డ్రగ్స్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని ఆమె చెబుతున్నారు. కాగా ఆమె తన మొబైల్ స్విచ్ఛాప్ చేయడంతో సంజనాపై అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికే తన మిత్రుడు రాహుల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయాన్ని తెలుసుకుని, తన సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాప్ చేయడంతో ఆమె ప్రమేయంపై రకరకాల ప్రచారం జరుగుతోంది.
రాహుల్ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్‌లో వీడియోలు, ఫొటోలు చూసిన సీసీబీ అధికారులు మరికొందరిని గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంజనా అందుబాటులోకి రాలేదనే ప్రచారంపై…ఆమె తీవ్రంగా స్పందించడం మరింత చర్చకు దారి తీస్తోంది. తానేమీ ఉగ్రవాదిని కానని, సినీరంగంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్నానని.. తనకు మిత్రులు ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు. కానీ ఆమె మూడో కంటికి కనిపించక పోవడం గమనార్హం.