వేడిలో కొట్టారు.. చల్లారాక పరామర్శించారు

వ్యక్తిగతంగా కూడా కలిసి క్షమించమని కోరారు. దీంతో ఈ కేసు కాస్త చల్లారే అవకాశం కనిపిస్తోంది.

టీవీ ఛానెల్ జర్నలిస్ట్ పై నటుడు మోహన్ బాబు దాడి చేసిన ఘటన గురించి అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి మోహన్ బాబుపై కేసు నమోదైంది. రేపోమాపో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుంటారనే ప్రచారం కూడా నడుస్తోంది. ఈ క్రమంలో మోహన్ బాబు స్వయంగా హాస్పిటల్ కు వెళ్లారు. తన వల్ల గాయపడిన జర్నలిస్ట్ ను వ్యక్తిగతంగా కలిశారు.

కొద్దిసేపటి కిందట మంచు విష్ణుతో కలిసి హాస్పిటల్ కు వెళ్లారు మోహన్ బాబు. హాస్పిటల్ లో కోలుకుంటున్న జర్నలిస్ట్ ను పరామర్శించారు. వ్యక్తిగతంగా ఆయనకు క్షమాపణలు చెప్పారు. తను చేసిన పనిపై మరోసారి వివరణ ఇచ్చుకున్నారు.

ఉద్రిక్త పరిస్థితుల మధ్య, ఆ వేడిలో అలా చేయిచేసుకోవాల్సి వచ్చిందని, నీపై (జర్నలిస్ట్), మీడియా సంస్థపై ఎలాంటి వ్యక్తిగత కోపం లేదా కక్ష లేదని మోహన్ బాబు జర్నలిస్ట్ తో అన్నారు. అక్కడే ఉన్న జర్నలిస్ట్ తల్లి, భార్యతో కూడా మాట్లాడారు. తనను క్షమించమని వాళ్లను కూడా కోరారు.

ఘటన జరిగిన వెంటనే ఆడియో రిలీజ్ చేశారు మోహన్ బాబు. జరిగిన ఘటనపై చింతిస్తున్నానని అందులో పేర్కొన్నారు. ఆ తర్వాత లేఖ కూడా విడుదల చేశారు. అందులో భేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు వ్యక్తిగతంగా కూడా కలిసి క్షమించమని కోరారు. దీంతో ఈ కేసు కాస్త చల్లారే అవకాశం కనిపిస్తోంది.

ఈ కేసుకు సంబంధించి మోహన్ బాబు ఇంకా పోలీసుల విచారణకు హాజరుకాలేదు. మోహన్ బాబు తమతో టచ్ లోనే ఉన్నారని, కాకపోతే ఇంకా స్టేట్ మెంట్ ఇవ్వలేదని, పహాడీ షరీఫ్ పోలీసులు ఈరోజు ఉదయం ప్రకటించారు. రేపు మోహన్ బాబు పోలీసుల్ని కలిసి స్టేట్ మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. తన దగ్గరున్న రివాల్వర్ ను కూడా ఆయన పోలీసులకు సరెండర్ చేయబోతున్నారు.

One Reply to “వేడిలో కొట్టారు.. చల్లారాక పరామర్శించారు”

  1. Pedarayudu bhayapaddadu. Direct involvement lekunna antha pedda star Allu Arjun ne arrest chesthe direct ga thala pagalakottina aayanni adi kuda attempt to murder case petti arrest chestaremo ani bhayapadi kaala beraniki vachi ippudu apology adugutunnadu. Thandri kodukulaki madhamekki kallu musukupoyayai iopatidaka.

Comments are closed.