మనసులో ఒకటి, పైకి మరొకటి మాట్లాడే స్వభావం కాదాయనది. లోకానికి చెడ్డ అయినా ఫర్వాలేదు కానీ నిజమే మాట్లాడాలనే తత్వం ఆయన సొంతం. ఉన్నది ఉన్నట్టు, కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే ఆ విలక్షణ సినీ నటుడే మంచు మోహన్‌బాబు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తాజా సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా’ సంగతులతో పాటు రాజకీయాల గురించి మనసులో మాటను బయట పెట్టారు.
‘శాంతంగా ఉన్నానని సచ్చు వెధవని అనుకోవద్దు.. గట్టిగా పిండితే గువ్వ అయినా ఎగిరి తంతుంది.. ప్రస్తుతం అదీ నా పరిస్థితి’ అని ధైర్యంగా ప్రకటించడం మోహన్‌బాబుకే చెల్లుతుంది. రాజకీయంగా అన్నీ చూశానని చెప్పుకొచ్చారు.
తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. ఆప్యాయంగా పలకరించే వారన్నారు. బ్రదర్ అనే పిలుపు నుంచి బావగారూ వరకూ తమ మధ్య బంధం బలపడిందన్నారు. వైఎస్సార్ ముఖంలో, పంచె కట్టులో రాజసం ఉట్టిపడేదన్నారు.
రాజకీయంగా చంద్రబాబు తన మనసును గాయపరిచాడని ఆవేదన వ్యక్తం చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ తనదేనని సంచలన విషయాన్ని మోహన్‌బాబు చెప్పాడు. ఆ సంస్థలో తన డబ్బు, తన షేర్ ఎక్కువని స్పష్టం చేయడం విశేషం. చంద్రబాబు పెట్టుబడి తక్కువన్నారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రకి వెళ్లే ముందు తన ఇంటికి వచ్చాడన్నారు. ‘నువ్వు, చంద్రబాబు ఫ్రెండ్సే కదా? ఏంటి మీ ఇద్దరికీ గొడవ?’ అని తనను వైఎస్ ప్రశ్నించినట్టు తెలిపారు. దానికి సమాధానంగా…. ‘హెరిటేజ్‌లో నా డబ్బు ఇంత, చంద్రబాబుది ఇంత, వేరే వ్యక్తిది ఇంత.. ఇలా ఇలా మోసం చేశాడని చెప్పా’ అని మోహన్‌బాబు వివరించారు.
దానికి వైఎస్సార్ స్పందిస్తూ… ‘వాళ్ల మామకే (ఎన్టీఆర్) వెన్నుపోటు పొడిచాడు. ఇక నిన్ను మోసం చేయడంలో కొత్తేముంది?’ అని తనతో అన్నట్టు మోహన్‌బాబు గతం స్మృతులను నెమరువేసుకున్నారు. ఇదిలా ఉండగా సినిమాలో ప్రధానంగా కులాలు, ఆడ,మగ వివక్ష గురించి ఉంటుందని చెప్పుకొచ్చారు.
కొడుకు వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మాత్రం తల్లిదండ్రులు ఏమీ అనరన్నారు. అదే పని కూతురు చేస్తే మాత్రం తల్లిదండ్రులు సహించరన్నారు. ఈ తేడా, వివక్ష గురించి ‘సన్ ఆఫ్ ఇండియా’ లో చర్చకు పెట్టినట్టు మోహన్‌బాబు వివరించారు.