తాను ప్రశ్నించడానికి కొత్త పార్టీ పెట్టినట్టు జనసేనాని పవన్‌కల్యాణ్ పలు సందర్భాల్లో ప్రకటించారు. అయితే ఆయన ప్రశ్నించిన దాఖలాలు చాలా తక్కువే. ఎందుకంటే పార్టీ పెట్టిన తర్వాత ఆయన అధికార పక్షంలోనే ఉంటూ వచ్చారు. దీంతో ప్రశ్నించడానికి బదులు మౌనంగా సినిమా చూస్తుండి పోయారనే విమర్శలున్నాయి.
తాను వ్యతిరేకించే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతైనా పవన్‌కల్యాణ్ ప్రశ్నిస్తారని అందరూ ఊహించారు. ఊహూ, ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ, సినిమా షూటింగ్‌లతో బిజీ అయ్యారు. ఇదేమయ్యా పవన్ గతంలో సినిమాలకు స్వస్తి చెప్పానన్నారే… మరి ఇదేంటనే ప్రశ్నలను పవన్ ఎదుర్కోవాల్సి వచ్చింది. సినిమా షూటింగ్‌లు లేని సమయంలో ఆయన ఓ ట్వీటో, మరొకటో చేస్తూ…తాను కూడా రాజకీయాల్లో ఉన్నానంటూ, ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జగన్ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించడం ఆసక్తి కలిగిస్తోంది. ప్రజాధనంతో నిర్వహించే పథకాలకు సొంత పేర్లు ఏంటని జనసేనాని పవన్‌కల్యాణ్ ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక పొట్టి శ్రీరాములు, ప్రకాశం పంతులు లాంటి జాతీయ నేతల పేర్లు పెడతామని పవన్ ప్రకటించారు.
గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ రాజకీయ నేతలంటే పేకాట క్లబ్బులు నడిపేవారు.. సూట్ కేస్ కంపెనీలు పెట్టి రూ.కోట్లు దోచుకునే వారు కాదని పరోక్షంగా జగన్‌తో పాటు వైసీపీ నేతలను దెప్పి పొడిచారు.
పవన్ ప్రశ్న సబబే. తాను అధికారంలోకి వస్తే జాతీయ నాయకుల పేర్లను సంక్షేమ పథకాలకు పెడతానని ప్రకటించడం వరకూ అంతా బాగుంది. కానీ అధికారంలోకి రావడం ఎట్లా? అనేది పెద్ద ప్రశ్న. ముందు అధికారంలోకి రావడానికి ఏం చేయాలో ఆలోచిస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమా షూటింగ్‌ల్లో నిమగ్నమై ఉంటే ప్రజలు ఎప్పటికీ ఆదరించరని వారు హితవు చెబుతున్నారు.
బీజేపీతో కలిసి 2024లో అధికారాన్ని హస్తగతం చేసుకోడానికి ఇప్పటి నుంచి ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఉందని సొంత పార్టీ శ్రేణులు కూడా పవన్‌కు హితబోధ చేస్తున్నాయి. తాను అధికారంలోకి వస్తే అది చేస్తా, ఇది చేస్తానని కలలు కనడం కాదని, వాటిని సాకారం చేసేందుకు శ్రమించాలని నెటిజన్లు పవన్‌కు గట్టిగా చెబుతుండడం విశేషం.