మాజీ మంత్రి వివేకా హత్య కేసులో తాను దోషినని తేలితే ఎన్కౌంటర్ చేయాలని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సి.ఆది నారాయణరెడ్డి సంచలన ప్రకటన చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు కూడా రక్షణ గురించి మాట్లాడుకోవాల్సి రావడం దురదృష్టకరమన్నారు. జగన్ ప్రభుత్వంలో ఏ ఒక్కరికీ రక్షణ లేదన్నారు.
ఎంతో మంది త్యాగధనుల ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందని, కానీ ఇలాంటి పాలన కోసం కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని విమర్శించారు. ఎవరు తప్పు చేసినా సరిదిద్దడానికి లేదా శిక్షించడానికి రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసిన కోర్టులు ఇచ్చిన తీర్పులను వైసీపీ ప్రభుత్వం గౌరవించకపోవడం దారుణమన్నారు.
గతంలో నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బస్సుల లైసెన్స్‌కు సంబంధించి తీసుకున్న నిర్ణయంపై కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే…తన పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. కానీ జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై పదేపదే హైకోర్టు వ్యతిరేక తీర్పులు వెలువరిస్తున్నా… జగన్ స్పందించకపోవడం దారుణమన్నారు.
సొంత చెల్లెళ్లు అయిన షర్మిల, సునీతారెడ్డిలకే రక్షణ ఇవ్వలేని ముఖ్యమంత్రి జగన్ అని ఆయన ఘాటు విమర్శలు చేశారు. కుటుంబంలోని మహిళలకే రక్షణ ఇవ్వలేని ముఖ్యమంత్రి ఇక ప్రజలకు ఏం రక్షణ ఇస్తారని ఆదినారాయణరెడ్డి ప్రశ్నించారు. వివేకా హత్యపై ఆయన ఘాటుగా స్పందించారు. వివేకా హత్యపై సీబీఐ దర్యాప్తు పద్ధతిగా సాగుతోందన్నారు. కానీ నెమ్మదిగా జరుగుతోందన్నారు.
సీబీఐ దర్యాప్తులో వేగం పుంజుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వివేకా హత్య కేసులో తాము తప్పు చేశామని సీబీఐ దోషిగా నిలబెడితే ఉరి తీయడం కాదు… ఎన్కౌంటర్ చేసినా అభ్యంతరం లేదని ఆదినారాయణరెడ్డి సంచలన ప్రకటన చేశారు.
ఇదే విధంగా సీబీఐ ఎవరిని దోషులుగా తేల్చినా అదే పని చేయాలని ఆయన డిమాండ్ చేయడం గమనార్హం. ఆస్తుల పంపకాల్లో విభేదాలతోనే అన్నపై షర్మిల అలిగినట్టు ఆదినారాయణరెడ్డి చెప్పారు.