సినిమా టికెట్ రేట్ల క్యూలో మరో సినిమా చేరింది. మారుతి డైరక్షన్ లో గోపీచంద్..రాశీఖన్నా చేసిన పక్కా కమర్షియల్ సినిమాను నార్మల్ రేట్లకే ప్రదర్శిస్తున్నామని హీరో గోపీచంద్ నే వెల్లడించారు.
సినిమా ట్రయిలర్ విడుదల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సినిమాకి నాన్ కమర్షియల్ టికెట్ రేట్స్ పెట్టారు మీరు మీ ఫ్యామిలీ తో కలిసి ఎంజాయ్ చెయ్యండి అన్నారు. యువి సంస్థతో వున్న అనుబంధంతో తాను ఈ సినిమా చేసానని, సినిమా ఆద్యంతం ఎంటర్ టైన్ మెంట్ తో వుంటుందని, రాశీఖన్నా పాత్ర బాగుంటుందని అన్నారు. అరవింద్..బన్నీ వాస్, మారుతి లాంటి టీమ్ తో పని చేయడం బాగుందన్నారు.
మారుతి మాట్లాడుతూ అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ చూసే సినిమా ఇది, ఒక మంచి ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తీసాం. ఎక్కడా బోర్ కొట్టకుండా అలా చూసుకుంటూ ముగింపు వరకు వెళ్లిపోయేలా చేస్తుందని అన్నారు.
నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ మల్టీప్లెక్స్ లు లేని టైం లో మేము ఇలాంటి సింగిల్ స్క్రీన్ లోనే సినిమాలు చూసేవాళ్ళం, మేము కూడా ఇలా మీలానే ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈ సినిమాను తీసింది మాస్ ప్రేక్షకులు గురించే, అందుకే ఈ సినిమాకి అందరికి అందుబాటులో ఉండే టికెట్స్ రేట్స్ పెట్టాం. నేను “పక్కా కమర్షియల్” సినిమా తీసిన కూడా నేను నాన్ కమర్షియల్ గా మాట్లాడుతున్నాను అన్నారు.
రాశిఖన్నా మాట్లాడుతూ సినిమాలో ఫుల్ లెన్త్ రోల్ చేశాను, ఈ సినిమాలో నేను హీరోయిన్ కాదు కమెడియన్ ని. మారుతి చాలా మంచి కథ రాసారు అన్నారు.