సావిత్రి, జయసుధ, విజయశాంతి, అనుష్క, ఇలా టాలీవుడ్ లో ప్రతి జనరేషన్ లో ఓ హీరోయిన్ కు సూపర్ స్టార్ ఇమేజ్ వస్తుంటుంది. వయసుతో సంబంధం లేకుండా పాత్రలు పోషిస్తుంటారు. విజయాలు వరిస్తుంటాయి. అనుష్క థర్టీ ప్లస్ దాటినా ఇంకా చాలాకాలం ఇన్నింగ్స్ కంటిన్యూ అయ్యేదే కానీ, శరీరాకృతి ఆమె కంట్రోల్ లో లేకపోవడంతో, కెరీర్ మందగించింది. ఇలాంటి టైమ్ లో సమంత అందుకుంది. సమంత కాస్తా, సమంత అక్కినేనిగా మారిన తరువాత కెరీర్ మరింత ఊపందుకోవడం విశేషం.
మూడు పదులు ఎప్పుడో దాటిన సమంత ఇట యంగ్ హీరోల పక్కన, సొలోగా కూడా సక్సెస్ లు కొడుతూ వస్తోంది. యుటర్న్ లో సోలో, రంగస్థలం, మజిలీ లాంటి సినిమాల్లో హీరోయిన్ గా విజయాలు సాధించింది. రాబోతున్న ఓ బేబీ ఓ టర్నింగ్ పాయింట్. ఎందుకంటే యుటర్న్ మాదిరిగా థ్రిల్లర్ జోనర్ లో చిన్న సినిమా కాదు. రంగస్థలం, మజిలి మాదిరిగా హీరోలు, డైరక్టర్ల సపోర్టు లేదు. కేవలం తన మీద, తన స్టామినా మీద ఆధారపడ్డ కథను తీసుకుని ఓ బేబీ సినిమా చేస్తోంది.
ప్రస్తుతానికి సమంత ఒకె చేసిన సినిమా ఇది ఒక్కటే. ఈ సినిమా హిట్ రేంజ్ ను బట్టి సమంత తరువాత సినిమాలు వుంటాయి. సమంతకు సినిమాలు వుండవు అని కాదు, ఆమె కోసం ప్రత్యేకంగా కథలు తయారుచేయడం లేదా, పెద్ద హీరోలతో సినిమాలు ఒప్పుకోవడం వంటివి అన్నీ ఈ సినిమా స్థాయిని బట్టి వుంటాయి.
సమంతకు వున్న అడ్వాంటేజ్ మరో హీరోయిన్ కు లేదనే చెప్పాలి. సోషల్ మీడియాలో సమంత అంత యాక్టివ్ గా వుండేవారు తక్కువ. అదే విధంగా సమంతకు సోషల్ మీడియాలో వున్న సర్కిల్ చాలా పెద్దది. అంతేకాదు, సినిమాను ప్రమోట్ చేయడంలో సమంత లా మరెవరు ఇటీవల కాలంలో చేయలేదు. అది హీరోలు అయినా, హీరోయిన్లు అయినా. ఓ బేబీ సినిమా కోసం అంత కు ముందు యుటర్న్ సినిమా కోసం సమంత దాదాపు నెలరోజులు అంతకన్నా ఎక్కువే ప్రచారం కోసం కేటాయించింది.
ఏ ఛానెల్ ను వదలలేదు, ఏ గేమ్ షోను వదలడం లేదు. విసుపు, విరామం లేకుండా ఇంటర్వూలు, చాట్ షోలు, హఢావుడి ఏదో విధంగా చేస్తూనే వస్తున్న సమంత, యుటర్న్, మజిలీలతో పోలిస్తే, ఓ బేబీకి మరింత ఎక్కువ చేసినట్లే చెప్పాలి. సినిమా ఫైనల్ వర్క్ పూర్తయిన తరువాత అంత అవిశ్రాంతంగా ప్రచారం చేయడం చిన్న విషయం కాదు.
చిత్రమేమిటంటే ఇంత హడావుడి, హెక్టిక్ యాక్టివిటీలో కూడా సమంత ఎక్కడా తన కూల్ యాటిట్యూడ్ ను కోల్పోలేదు. అక్కినేని వారి కోడలు కావడం, దగ్గుబాటి వారి మనవరాలు కావడంతో, వచ్చిన అదనపు అడ్వాంటేజ్ ను కూడా చాలా బ్రహ్మాండంగా ఉపయోగించేసుకుంటోంది. ఇంటర్వూల్లో చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడడం నేర్చుకుంది. స్పష్టమైన తెలుగులో మాట్లాడడం అన్నది అడ్వాంటేజ్ అయింది.
అదే సమయంలో ఎవరు ఏమనుకున్నా, తన గ్లామర్ ప్రదర్శన మాత్రం మానలేదు. ముఫై రెండేళ్లు దాటేసినా, పెళ్లయిపోయినా, వెంకీ బాబాయ్, రానా అన్నాయ్ లాంటి వాళ్లు సభలో వుంటారని తెలిసినా, వీలయినంత గ్లామర్ డ్రెస్ తోనే సమంత ఓబేబీ ఫంక్షన్ కు హాజరుకావడం విశేషం. అయితే అదే సమయంలో తన కూల్ ఆటిట్యూడ్ తో సమంత తనపై అస్సలు నెగిటివ్ రాకుండా చూసుకోగలిగింది.
ప్రస్తుతం అక్కినేని వారి ఫ్యామిలీలో లక్కీ లెగ్ సమంతదే. నాగచైతన్య కొట్టిన హిట్ వెనుక సమంత లెగ్ వుంది. మామ నాగార్జునకు రాజగారి గది 2 తరువాత అదే సెంటిమెంట్ లో మన్మధుడు 2లో కామియో క్యారెక్టర్ లో కనిపించబోతోంది. హిట్ కోసం చూస్తున్న అఖిల్ సినిమాలో కూడా గెస్ట్ రోల్ రూపంలో లెగ్ పెడితే మంచిదేమో?
ఇదేతీరు ఇలాగే కొనసాగితే, ఓ బేబీ అనుకున్న టార్గెట్ రీచ్ అయితే, ఆ తరువాత సమంత మరో మెట్టు ఎక్కడం ఖాయం. మాంచి లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్, త్రివిక్రమ్, లాంటి ఇంటలెక్చ్యువల్ డైరక్టర్లు సమంత కోసం ప్రత్యేకమైన సబ్జెక్ట్ లు తయారుచేసినా ఆశ్చర్యపోనక్కరలేదు.