ప్రేక్షకులు ఊహించుకునే క్రేజీ కాంబినేషన్లలో ఇది కూడా ఒకటి. రాజమౌళి దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేస్తే బాగుంటుందని చాలామంది కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా పవన్ రీఎంట్రీ ఇవ్వడంతో ఈ చర్చ ఇంకాస్త ఎక్కువైంది. ఇది కాస్తా రాజమౌళి వరకు కూడా వెళ్లింది.
పవన్ తో సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టాడు జక్కన్న. గతంలో ఓసారి పవన్ కల్యాణ్ తో సినిమా చేయడానికి ప్రయత్నించానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు మాత్రం పవన్ తో సినిమా చేయడం ప్రాక్టికల్ గా కుదరని పని అంటున్నాడు.
“అందరు దర్శకుల్లానే నేను కూడా పవన్ తో సినిమా చేయాలనుకున్నాను. గతంలో ఓసారి ఆయన్ను కలిశాను కూడా. కానీ సినిమా చేయడం కుదర్లేదు. ప్రస్తుతం పవన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. కానీ ఆయన ఫోకస్ మాత్రం రాజకీయాల మీద ఉంది. సినిమాకు ఆయన కేటాయించే టైమ్ కూడా తక్కువ. నేను సినిమా తీయడానికి తీసుకునే టైమ్ చాలా ఎక్కువ. ప్రాక్టికల్ గా చూస్తే పవన్ తో సినిమా కుదరని పని. ఆయన స్టామినాకు తగ్గట్టు పవర్ ఫుల్ క్యారెక్టర్ ఏమైనా దొరికితే అప్పుడు మూవీ సెట్ అవుతుందేమో చూడాలి.”
గతంలో చిరంజీవి, పవన్ కల్యాణ్ హీరోలుగా సుబ్బరామిరెడ్డి సినిమా ఎనౌన్స్ చేశారు. కానీ అది రాదనే విషయం అందరికీ తెలుసు. ఎన్టీఆర్-చరణ్ తో రాజమౌళి మల్టీస్టారర్ తీస్తున్న నేపథ్యంలో… చిరు-పవన్ తో కూడా జక్కన్న ఓ సినిమా చేస్తే బాగుంటుందనే చర్చ ఉంది. దీనిపై కూడా రాజమౌళి స్పందించాడు.
“అవును నిజమే. చిరంజీవి, పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని నాక్కూడా ఉంది. గతంలో చిరంజీవితో కూడా సినిమా చేయడానికి ప్రయత్నించాను కానీ కుదర్లేదు. పవన్-చిరంజీవి కాంబినేషన్ లో సినిమా చేస్తే బాగుంటుంది కానీ సాధ్యమవుతుందా అనేది ఆలోచించాలి. ఆరోజు రావాలనే నేనూ కోరుకుంటున్నాను.”
ఒకవేళ పవన్ తో సినిమా చేస్తే తమ కాంబినేషన్ లో సందేశాత్మక చిత్రం రాదంటున్నాడు రాజమౌళి. సమాజానికి పవన్ కల్యాణ్ చాలా దగ్గరగా ఉంటారని, తను అంత క్లోజ్ గా ఉండను కాబట్టి.. తమ కాంబినేషన్ లో సందేశాత్మక చిత్రం రాదంటున్నాడు రాజమౌళి.