నేను కవిని కాదన్నవాడ్ని కత్తితో పొడుస్తా అంటుంది ఏదో సినిమాలో లేడీ కమెడియన్. ఇప్పుడు సేమ్ టు సేమ్ అదే డైలాగ్ ను ఆర్జీవీ కూడా ఇండైరెక్ట్ గా చెబుతున్నాడు. కరోనాపై ఓ పాట రాసి, స్వయంగా తనే ఆలపించిన ఆర్జీవీ.. ఆ పాటను ఇప్పుడు జనాల మీదకి వదిలాడు. కరోనా గురించి అందులో వర్మ ఏం చెప్పాడనే విషయాన్ని పక్కనపెడితే.. ఆ పాట మాత్రం మన సహనానికి పరీక్షే.
అది ఒక పురుగు.. కనిపించని పురుగు అంటూ అందుకున్న వర్మ.. ఇక 5 నిమిషాల పాటు తన వీరప్రతాపం చూపించాడు. నలిపేద్దామంటే అంత సైజులేదు దానికి.. పచ్చడి చేద్దామంటే కండ లేదు దానికి… అంటూ వర్మ తన “మధురమైన” గొంతుతో చెబుతూ తన పైత్యం మొత్తం చూపించాడు వర్మ.
కరోనాపై ఇప్పటికే కీరవాణి ఓ సాంగ్ రిలీజ్ చేశాడు. స్టార్స్ తో కోటి కూడా ఓ పాట కంపోజ్ చేసి వదిలాడు. వాళ్లంతా పాటలు రిలీజ్ చేశారంటే ఓ అర్థముంది. వాళ్లంతా మ్యూజిక్ డైరక్టర్లు. వర్మ కూడా ఇలా పాట రాసి, పాడి రిలీజ్ చేయడమేంటంటూ విసుక్కుంటున్నారు నెటిజన్లు.
వర్మ అంతే.. సందర్భం ఏదైనా జనాల్ని తనవైపు తిప్పుకోవడంలో ఎక్స్ పర్ట్. అందుకే ఇలా కరోనా పాట పాడి తన ప్రతాపం చూపించాడు. వర్మ పాటకు తగ్గట్టే నెటిజన్లు కూడా కౌంటర్లు స్టార్ట్ చేశారు. అతడి పేరు వర్మ, అతడి కంట పడడం కరోనా ఖర్మ అంటూ ఒకరు సెటైర్ వేస్తే.. వర్మ రూపంలో కరోనాకు మెడిసిన్ వచ్చేసిందంటూ మరొకరు జోక్ చేశారు. వర్మ పాట వింటే కరోనా కూడా ఆత్మహత్య చేసుకుంటుందంటూ మరొకరు అందుకున్నారు. ఇలా వర్మను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు నెటిజన్లు.