అందాల పోటీల్లో క్లిక్ అయిన తర్వాత చాలామంది ముద్దుగుమ్మలు ఫిలిం ఇండస్ట్రీలోకి వస్తుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్. ఆల్రెడీ సినిమాల్లో నటించిన తర్వాత అందాల పోటీలకు వెళ్తోంది ఓ ముద్దుగుమ్మ. ఆమె మరెవరో కాదు, రాజశేఖర్ కుమార్తె శివానీ రాజశేఖర్. త్వరలోనే జరగనున్న ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనాలని ఆమె భావిస్తోంది. దీనికి సంబంధించి ఇవాళ్టి నుంచి ప్రారంభమైన ఫైనల్ ఆడిషన్స్ లో ఆమె పాల్గొంటోంది.
మిస్ ఇండియా 2022 పోటీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది శివానీ. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ టాప్-8 ఫైనలిస్టుల జాబితాలో ఆమె చోటు సంపాదించింది. ఇలా ప్రతి రాష్ట్రం నుంచి ఎంపికైన స్టేట్ ఫైనలిస్టులతో ముంబయిలో ఫైనల్ ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి పాల్గొంటున్న ముద్దుగుమ్మల నుంచి 31 మందిని ఈ 3 రోజుల్లో ఎంపిక చేస్తారు. ఈ జాబితాలోకి శివానీ ఎంటర్ అవ్వాల్సి ఉంది.
మిస్ ఇండియా పోటీల కోసం కొన్ని నెలలుగా ప్రివేర్ అవుతోంది శివానీ. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు అందాల పోటీలకు సన్నద్ధం అవుతోంది. ఇప్పుడా టైమ్ రానే వచ్చింది. ఆమె టాప్-31 లిస్ట్ లో చోటు సంపాదించుకుంటుందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.
అద్భుతం, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ లాంటి సినిమాల్లో నటించింది శివానీ. తండ్రి రాజశేఖర్ తో కలిసి శేఖర్ అనే సినిమా కూడా చేసింది. ప్రస్తుతం చేతిలో 2 సినిమాలున్నాయి. వీటితో పాటు ఓ వెబ్ డ్రామాలో కూడా నటిస్తోంది.